ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఒక చైతన్యశీల బోడో సమాజం పురోగమించడానికి,

సమృద్ధి చెందడానికి కృషి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి

బోడో ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిని వేశాం: ప్రధానమంత్రి

భారతదేశానికి ఈశాన్య ప్రాంతం అష్టలక్ష్మి: ప్రధానమంత్రి

Posted On: 15 NOV 2024 9:34PM by PIB Hyderabad

తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. రెండు రోజుల పాటు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమం ఒక చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. భాష, సాహిత్యం, సంస్కృతిపరమైన కార్యక్రమాలు దీనిలో భాగంగా ఉన్నాయి.

శ్రీ నరేంద్ర మోదీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళిలను పురస్కరించుకొని దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఇదే రోజు శ్రీ గురునానక్ దేవ్ జీ 555వ ప్రకాశ్ పర్వ కావడంతో, ప్రపంచవ్యాప్త సిక్కు సోదరులకు, సిక్కు సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతికి గుర్తుగా భారతదేశ పౌరులు గిరిజన గౌరవ దినోత్సవాన్ని పాటిస్తున్నారని కూడా ఆయన అన్నారు.  తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రధాని చెబుతూ ఒక నూతన భవితను ఉత్సవం మాదిరిగా జరుపుకోవడానికి దేశం నలుమూలల నుంచి తరలి వచ్చిన బోడో సముదాయానికి అభినందనలు తెలిపారు. 


 

ఈ కార్యక్రమం తనకు ఒక భావోద్వేగభరిత క్షణంగా... శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ, ఇది 50 సుదీర్ఘ సంవత్సరాల హింసకు స్వస్తి పలికిన ఒక అత్యంత శుభకాలమని, మరి బోడోలాండ్ తన ప్రథమ ఏకత ఉత్సవాన్ని నిర్వహించుకొంటోందని వ్యాఖ్యానించారు.  రణచండీ నృత్యం బోడోలాండ్ శక్తిని చాటుతోందని కూడా ఆయన అన్నారు. పోరాటాన్ని, మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఏళ్ళ తరబడి సాగించిన తరువాత ఒక కొత్త చరిత్రను సృష్టించినందుకు బోడోలను శ్రీ మోదీ ప్రశంసించారు.

 

బోడో శాంతి ఒప్పందం 2020లో కుదిరిన తరువాత కోక్ రాఝార్‌ను సందర్శించే అవకాశం దక్కడాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొంటూ, తన పైన కురిపించిన స్నేహానురాగాల జల్లు బోడోలలో తానూ ఒకడినన్న అభిప్రాయాన్ని కలిగించిందన్నారు.  అక్కడకు తాను వచ్చి నాలుగు సంవత్సరాలే అయినప్పటికీ ఈ రోజూ ఆనాటి ఆత్మీయతానురాగాల అనుభూతినే పొందుతున్నందుకు సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ఆయుధాలను విడచిపెట్టి, శాంతి మార్గాన్ని ప్రజలు ఎంచుకోవడాన్ని చూసిన తరువాత బోడోలాండ్‌లో శాంతి, సమృద్ధిల నవోదయం అయిందని బోడోలతో తాను అన్న మాటలను గుర్తుకు తెచ్చుకొన్నారు. అది తనకు ఒక భావోద్వేగభరిత క్షణమని ఆయన చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండడం, గొప్పగా ఉత్సవాలను నిర్వహించుకోవడం చూసిన తరువాత బోడో ప్రజలకు ఒక ఉజ్వల భవితకు బలమైన పునాది పడిందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. గత నాలుగేళ్ళలో బోడోలాండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా ముఖ్యమైనవని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.  ‘‘శాంతి ఒప్పందం కుదిరిన తరువాత బోడోలాండ్‌లో ఒక కొత్త అభివృద్ధి తరంగం ఎగసింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.  బోడో శాంతి ఒప్పందం ప్రయోజనాలు, అవి బోడోల జీవనంపై ప్రసరించిన ప్రభావాన్ని గమనించి ఈ రోజు తాను ఎంతో సంతృప్తి చెందినట్లు తెలిపారు. బోడో శాంతి ఒప్పందం అనేక ఇతర ఒప్పందాలకు కొత్తగా బాటలు వేసిందని కూడా ఆయన అన్నారు.  ఒక్క అసోమ్ లోనే 10,000 మందికి పైగా యువత ఆయుధాలను వదలి, హింస మార్గాన్ని విడచి,  ప్రధాన స్రవంతికి తిరిగి వచ్చారంటేనే ఈ ఒప్పందం ఎంత మార్పు తెచ్చిందీ తెలుస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.  కార్బీ ఆంగ్‌లోంగ్ ఒప్పందం, బ్రు-రియాంగ్ ఒప్పందం, ఎన్ఎల్ఎఫ్‌టీ-త్రిపుర ఒప్పందం ఒకనాటికి వాస్తవ రూపం దాల్చుతాయన్న సంగతి ఎవరి ఊహకూ అందనిదని ఆయన చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పరస్పర విశ్వాసాన్ని ఉభయ పక్షాలు గౌరవించాయి. మరి ఇప్పుడు బోడోలాండ్‌ను అభివృద్ధి చేయడానికి, బోడోలాండ్ ప్రజలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం, అసోమ్ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

 

బోడో టెరిటోరియల్ రీజియన్ లోని బోడో ప్రజానీకం అవసరాలను తీర్చడానికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇచ్చిన సంగతిని శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.  బోడోలాండ్‌ను అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చిందని, అసోమ్ ప్రభుత్వం  ప్రత్యేకంగా ఒక అభివృద్ధి ప్యాకేజీని మంజూరు చేసిందని శ్రీ మోదీ తెలిపారు. బోడోలాండ్‌లో విద్య, ఆరోగ్యం, సంస్కృతి రంగాలకు సంబంధించిన ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధి పరచడానికి రూ. 700 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. హింసను వీడి, ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చిన ప్రజల స్థితిగతులను సానుకూలంగా అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్ణయాలను తీసుకొందని ప్రధానమంత్రి వివరించారు. బోడోలాండ్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంటుకు చెందిన 4,000 మందికి పైగా పూర్వ కార్యకర్తలకు పునరాశ్రయాన్ని కల్పించడమే కాకుండా, ఎంతో మంది యువతీ యువకులకు అసోమ్ పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బోడో పోరాటంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అసోమ్ ప్రభుత్వం అందించిందని కూడా ఆయన చెప్పారు. అసోమ్ ప్రభుత్వం బోడోలాండ్ అభివృద్ధికి ప్రతి ఏటా రూ.800 కోట్లకు పైగా ఖర్చు పెడుతోందని కూడా ప్రధాని వెల్లడించారు.

 

ఏ ప్రాంతం అభివృద్ధికైనా సరే యువతీ యువకులకు, మహిళలకు నైపుణ్యాభివృద్ధితోపాటు, అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం ఎంతైనా ముఖ్యమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్ఈఈడీ మిషన్‌ను ప్రారంభించినట్లు శ్రీ మోదీ చెప్పారు.  ఎస్ఈఈడీ మిషన్ ను గురించి ఆయన వివరిస్తూ, ఈ మిషన్ నైపుణ్యాల సాధనలో శిక్షణ, ఔత్సాహిక పారిశ్రామికత్వం, ఉపాధికల్పన మార్గాలలో యువతీ యువకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలుచేస్తున్న కార్యక్రమమని వివరించారు.  బోడో యువత ఈ మిషన్ ద్వారా చాలా లబ్ధిని పొందగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ఇదివరకు తుపాకులను పట్టుకొని తిరిగిన యువతీ యువకులు ప్రస్తుతం క్రీడల రంగంలో రాణిస్తుండడం చూస్తే తనకు సంతోషంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. డురాండ్ కప్‌ను రెండు సార్లుగా కోక్ రాఝార్‌లో నిర్వహిస్తూ వచ్చారని, ఈ పోటీలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌ల జట్లు పాల్గొనడం చరిత్రాత్మకమని ఆయన అన్నారు. శాంతి ఒప్పందం కుదిరిన తరువాత గత మూడేళ్ళుగా వరుసగా బోడోలాండ్ సాహిత్య ఉత్సవాన్ని కోక్ రాఝార్ లో నిర్వహించారని, దీనితో బోడో సాహిత్యానికి గొప్ప సేవను చేసినట్లయిందన్నారు. బోడో సాహిత్య సభ 73వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున పాటించుకొంటున్న సందర్భంగా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఇది బోడో సాహిత్యాన్ని, బోడో భాషను ఒక సంబరంలా జరుపుకొనే రోజు అని ఆయన అన్నారు. రేపటి రోజున ఒక సాంస్కృతిక ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు.


 

మహోత్సవ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను తాను చూశానని శ్రీ మోదీ చెప్తూ, తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.  జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును పొందిన ఆరోనాయే, దోఖోనా, గామ్‌సా, కరై-దక్ఖినీ, థోర్‌ఖా, జౌ గిశీ, ఖామ్, తదితర ఉత్పత్తుల కళాత్మకతను, ఘనమైన బోడో కళను తాను గమనించానని ఆయన చెప్పారు.  జీఐ గుర్తింపుతో ఆయా ఉత్పత్తులు బోడో సంస్కృతితో పెనవేసుకొని ఉండటానికి తోడ్పడ్డాయని ఆయన అన్నారు.  బోడో సంస్కృతిలో పట్టు పరిశ్రమకు సదా ఒక ముఖ్య స్థానం ఉంటూ వచ్చిందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ప్రభుత్వం బోడోలాండ్ సెరికల్చర్ మిషన్ ను అమలుచేస్తోందని ఆయన ప్రస్తావించారు.  ప్రతి ఒక్క బోడో కుటుంబంలో నేత పని సంప్రదాయం ఉందని, బోడోలాండ్ హేండ్‌లూమ్ మిషన్ ద్వారా బోడో ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రయత్నాలు చేపట్టినట్లు శ్రీ మోదీ వివరించారు.

‘‘భారతదేశ పర్యాటక రంగంలో అసోమ్ ఒక గొప్ప శక్తి గా నిలుస్తోంది. బోడోలాండ్ అసోమ్ పర్యాటక రంగానికి ఊతాన్నిస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు. ఒకప్పుడు రహస్య స్థావరాలుగా ఉపయోగించుకొన్న మానస్ నేషనల్ పార్క్, రాయ్‌మోనా నేషనల్ పార్క్, సిఖ్నా ఝాలావో నేషనల్ పార్క్ లలోని దట్టమైన అడవులు ప్రస్తుతం యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక మాధ్యమంగా మారుతున్నాయని శ్రీ మోదీ చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బోడోలాండ్‌లో పర్యటన రంగం విస్తరిస్తూ, యువతీ యువకులకు అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

శ్రీ బోడోఫా ఉపేంద్ర నాథ్ బ్రహ్మ, గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మల సేవలను శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొంటూ, భారతదేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామిక పద్ధతినే బోడోఫా సదా ప్రతిపాదిస్తూ వచ్చారన్నారు.  గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అహింస, ఆధ్యాత్మికవాదాల బాటలో నడుస్తూ సమాజాన్ని ఏకం చేశారని ప్రధాని అన్నారు.  బోడో మాతృమూర్తులకు, సోదరీమణులకు వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలనే కలలు ఉండేవి. ప్రస్తుతం ప్రతి ఒక్క బోడో కుటుంబం వారి సంతానానికి ఒక మెరుగైన భవిష్యత్తును అందించాలని ఆశపడుతోందని శ్రీ మోదీ అన్నారు. వారికి బోడోల సముదాయంలోని విశిష్ట వ్యక్తులు ప్రేరణగా నిలిచారని ఆయన చెప్పారు. శ్రీ హరిశంకర్ బ్రహ్మ ఇది వరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారిగాను, శ్రీ రంజిత్ శేఖర్ ముశ్ హరీ మేఘాలయకు మాజీ గవర్నరుగాను సేవలందించి, బోడో సముదాయం ప్రతిష్ఠను పెంచిన సంగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చక్కని జీవనోపాధిమార్గం కోసం బోడోలాండ్ యువత కలలు కంటున్నారని, కేంద్ర  ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వమూ వారి ఈ ప్రగతి యాత్రలో వారి వెన్నంటి నిలిచాయని ఆయన అన్నారు. 

 

అసోమ్ సహా యావత్తు ఈశాన్య ప్రాంతం భారతదేశానికి అష్టలక్ష్మి అని శ్రీ మోదీ అభివర్ణించారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పాన్ని నెరవేర్చుకోవడంలో అభివృద్ధిని సూచించే ప్రభాత కిరణాలు తూర్పు భారతదేశం నుంచే ప్రసరిస్తాయని ఆయన అన్నారు. ఈ కారణంగా ఈశాన్య ప్రాంత రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలకు స్నేహపూర్వక పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నాలు చేస్తూ, ఈశాన్య ప్రాంతంలో చిరకాలిక శాంతి సాధనకు ప్రభుత్వం పట్టువిడువక ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.   

 

గత పదేళ్ళలో అసోమ్ లోను, ఈశాన్య ప్రాంతంలోను అభివృద్ధి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసిన విధానాల ఫలితంగా పది సంవత్సరాల్లో 2.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని ఆయన తెలిపారు. అసోమ్ లో లక్షలాది ప్రజలు కూడా పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అసోమ్ అభివృద్ధిలో కొత్త కొత్త రికార్డులను నెలకొల్పుతోందని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో ప్రాథమిక సదుపాయాలను సమకూర్చడంపై శ్రద్ధ తీసుకొందన్నారు. గత ఒకటిన్నరేళ్లలో అసోమ్‌లో 4 పెద్ద ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు. అవే గౌహతి ఏఐఐఎమ్ఎస్, కోక్ రాఝార్, నల్‌బాడీ, నాగావ్ మెడికల్ కాలేజీలు అని ఆయన వివరించారు. ప్రజల అవసరాలను ఈ ఆసుపత్రులు తీర్చుతున్నాయి. అసోమ్‌లో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించడంతో ఈశాన్య ప్రాంతంలో రోగులకు గొప్ప ఊరట లభించిందని ఆయన అన్నారు.  అసోమ్‌లో 2014 కన్నా ముందు 6  వైద్య కళాశాలలు ఉంటే, వాటిని ప్రస్తుతం 12కు పెంచినట్లు శ్రీ మోదీ చెప్పారు. మరో 12 కొత్త వైద్య కళాశాలలను తెరచేందుకు సంబంధించిన పనులు  కొనసాగుతున్నాయని, ఈ వైద్య కళాశాలలు యువతకు అవకాశాలను అందిస్తాయని ఆయన అన్నారు.

 

బోడో శాంతి ఒప్పందం చూపిన బాట పూర్తి ఈశాన్య ప్రాంత సమృద్ధికి బాట అని శ్రీ మోదీ అభివర్ణిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. బోడోలాండ్‌ కు శతాబ్దాల నాటి సంస్కృతికి విశిష్ట ధామం అనే ఖ్యాతి ఉందని, ఈ సంస్కృతి- సంప్రదాయాలను మనం ఎప్పటికప్పుడు బలపరచుకొంటూ ముందుకు సాగాలని ఆయన అన్నారు.  బోడోలకు ధన్యవాదాలంటూ, తొలి బోడోలాండ్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసోం గవర్నరు శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రధాన అధికారి శ్రీ ప్రమోద్ బోరో, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ దీపేన్ బోడో, బోడో సాహిత్య సభ అధ్యక్షుడు డాక్టర్ సూరత్ నార్‌జారీ, తదితరులు పాల్గొన్నారు. అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.

 

నేపథ్యం

తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను రెండు రోజుల పాటు.. ఈ నెల 15న, 16న.. నిర్వహిస్తున్నారు.  శాంతి పరిరక్షణ సూచకంగా, చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి పెద్ద పీటను వేస్తూ వివిధ కార్యక్రమాలకు వేదికగా ఈ మహోత్సవ్ ఉంటుంది. ఒక్క బోడోలాండ్ లోనే కాకుండా అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్ లతో పాటు, ఈశాన్య ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న బోడో ప్రజలందరినీ ఒక్క తాటి మీదకు తేవడం ఈ ఉత్సవం లక్ష్యం. ‘సమృద్ధ భారత్ ఆవిష్కారానికి శాంతి, సామరస్యాలు’.. ఇవి ఈ మహోత్సవ్‌ ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది.  బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్  (బీటీఆర్)లోని బోడో సముదాయం, ఇంకా ఇతర సముదాయాల సంపన్న సంస్కృతి, భాష, విద్య.. ఈ అంశాలపై మహోత్సవం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. దీనితో పాటు, బోడోలాండ్ సంస్కృతి, భాషల విశిష్ట వారసత్వాన్ని, అక్కడి పరిసరాలలోని జీవ వైవిధ్యాన్ని ఈ మహోత్సవం కళ్ళకు కట్టనుంది.


 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చురుకైన నాయకత్వంలో 2020 లో బోడో శాంతి ఒప్పందం కుదిరిన తరువాత ఆ ప్రాంతం మళ్ళీ పుంజుకున్న సరళిని ఈ మహోత్సవంలో ఓ పండుగలా జరుపుకొంటున్నారు. దశాబ్దాల పాటు సంఘర్షణలు, హింస, చెలరేరగి బోడోలాండ్ లో అపార ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ఆ దురవస్థను శాంతి ఒప్పందం పరిష్కరించడమే కాక, ఇతర శాంతి ఒడంబడికలకు ఓ ఉత్ప్రేరకంలా పనిచేసింది.


 

‘‘సంపన్న బోడో సంస్కృతి, సంప్రదాయాలు, ఇంకా సాహిత్యం భారతీయ వారసత్వానికి, సంప్రదాయాలకు అందిస్తున్న తోడ్పాటు’’ అంశంపై నిర్వహించే కార్యక్రమం ఈ మహోత్సవ్ లో ప్రధానాంశంగా ఉండబోతోంది.  బోడోల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యంలపై చర్చోపచర్చలు ఈ కార్యక్రమంలో చోటుచేసుకోనున్నాయి.  ‘‘జాతీయ విద్యా విధానం 2020 పథనిర్దేశకత్వంలో మాతృభాష మాధ్యమంలో విద్యాబోధనకు ఉన్న అవకాశాలు, సవాళ్ళు’’ అంశంపైన సైతం మరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  బోడోలాండ్ ప్రాంతంలో ‘‘పర్యటన రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సంస్కృతి, పర్యటన మాధ్యమాల ద్వారా ‘శక్తిమంతమైన బోడోలాండ్’ నిర్మాణంలో స్థానిక సంస్కృతి పాత్ర’’ అంశం పై ఒక సమావేశాన్ని, చర్చను నిర్వహించనున్నారు.  

అయిదు వేల మందికి పైగా కళా రంగ ఔత్సాహికులు ఈ మహోత్సవ్‌లో పాలుపంచుకొన్నారు.  వారిలో బోడోలాండ్ ప్రాంతానికి చెందిన వారే కాక, అసోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు, , నేపాల్, భూటాన్ వంటి ఇరుగు పొరుగు దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

 

 

 

***

MJPS/SR


(Release ID: 2075577) Visitor Counter : 9