ప్రధాన మంత్రి కార్యాలయం
అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
Posted On:
20 NOV 2024 8:09PM by PIB Hyderabad
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.
ప్రధానితో తొలిసారిగా సమావేశమైన అధ్యక్షుడు మిలే, వరసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టినందుకు శ్రీ మోదీకి అభినందనలు తెలియజేశారు. అర్జెంటినా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ మిలే కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పరిపాలన అంశం గురించి జరిగిన ఆసక్తికర చర్చ అనంతరం ఇరువురూ ఈ విషయంలో తమతమ అనుభవాలను పంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య విస్తృతమవుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల ఉభయ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం సహా ఇరుదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం అనూహ్య వృద్ధిని నమోదు చేయడంతో, అర్జెంటీనా అయిదు అగ్ర వ్యాపార భాగస్వాముల జాబితాలో భారత్ చేరింది.
ఫార్మా, రక్షణ, లిథియం సహా కీలక ఖనిజాలు, చమురు, సహజ వాయువు, సైనికేతర అణుఇంధనం, అంతరిక్షం, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు సహా భారత్-అర్జెంటీనాల మధ్య ద్వైపాక్షిక సహకారం అనేక రంగాలకు విస్తరించింది. అర్జెంటీనాలో ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల గురించి కూడా ఇరువురు నేతలూ చర్చించారు.
ప్రాముఖ్యత కలిగిన అనేక అంతర్జాతీయ అంశాల గురించి చర్చించిన శ్రీ మోదీ, శ్రీ మిలే…. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు.
***
(Release ID: 2075301)
Visitor Counter : 6