సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అసత్యపూరిత వార్తలను ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు డిజిటల్ మీడియాలోజవాబుదారీతనం ఉండాలన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్
సమాజంపై తాము చూపుతున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని డిజిటల్ మీడియా వ్యవస్థలు తగిన పరిష్కారాలతో ముందుకు రావాలి: శ్రీ అశ్విని వైష్ణవ్
మారుతున్న మీడియా స్వరూపం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక, సామాజిక నేపథ్యాల దృష్ట్యా సేఫ్ హార్బర్ నిబంధనలను పున:సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ వైష్ణవ్
డిజిటల్ వేదికలు, సంప్రదాయ మాధ్యమాల మధ్య అసమానతలను పరిష్కరించడానికి సంప్రదాయ కంటెంట్ సృష్టికర్తలకు న్యాయమైన పరిహారం అవసరం: శ్రీ వైష్ణవ్
పక్షపాత ధోరణితో కూడిన అల్గారిథం వల్ల ఎదురయ్యే సామాజిక పరిణామాలు ఆందోళనకరం; భారత్ లాంటి వైవిధ్యమైన దేశంలో డిజిటల్ మీడియా వేదికలు ఈ నష్టాన్ని తగ్గించడం తప్పనిసరి
ఏఐ విసురుతున్న నైతిక, ఆర్థిక సవాళ్లను గురించి వివరిస్తూ సమాచారాన్ని రూపొందించేవారి మేధో సంపత్తి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి
Posted On:
16 NOV 2024 7:19PM by PIB Hyderabad
జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేడుకలు నిర్వహించింది. కేంద్ర సమాచార, ప్రసారాలు, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, దిగ్గజ పాత్రికేయడు శ్రీ కుందన్ రమణ్ లాల్ వ్యాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 35,000కు పైగా నమోదు చేసుకున్న వార్తాపత్రికలు, వార్తా ఛానెళ్లు, పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన శక్తిమంతమైన, వైవిధ్యమైన భారతీయ పాత్రికేయ వ్యవస్థ గురించి ప్రధానంగా మాట్లాడారు. 4జీ, 5జీ నెట్వర్కుల్లో వచ్చిన పెట్టుబడులు - తక్కువ ధరలకే డేటాను అందించి డిజిటల్ అనుసంధానంలో భారత్‌ను ప్రపంచంలోనే ముందంజలో ఉంచాయని మంత్రి పేర్కొన్నారు.
అయితే, మారుతున్న మీడియా, పత్రికా విధానాల కారణంగా మన సమాజం ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సవాళ్లను ఆయన వివరించారు:
1. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం
నకిలీ వార్తల ప్రచారం మీడియాపై నమ్మకాన్ని తగ్గించడంతో పాటు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మీడియా, దానిలో ప్రచురిస్తున్న కథనాల పట్ల వహిస్తున్న బాధ్యతపై విమర్శనాత్మక ప్రశ్నను శ్రీ అశ్వనీ వైష్ణవ్ తన ప్రసంగంలో లేవనెత్తారు. 1990లో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు చెందిన ఎంపిక చేసిన అతి కొద్ది మందికి మాత్రమే డిజిటల్ మీడియా అందుబాటులో ఉన్నప్పుడు అభివృద్ది చేసిన సేఫ్ హార్బర్ భావన, వినియోగదారులు సృష్టించిన కంటెంట్‌కు జవాబుదారీతనం అవసరం లేకుండా ఆన్లైన్ వేదికలకు అవకాశం కల్పించింది.
ప్రపంచవ్యాప్తంగా బూటకపు సమాచార వ్యాప్తి, అల్లర్లు, తీవ్రవాద చర్యల నేపథ్యంలో సేఫ్ హార్బర్ నిబంధనలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నాయా? అనే అంశంపై చర్చలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ‘‘భారతదేశంలోని ఈ సంక్షిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ వేదికలు భిన్నమైన బాధ్యతలను స్వీకరించలేవా? ఈ ప్రధానమైన ప్రశ్నలు జవాబుదారీతనాన్ని, జాతీయ సమగ్రతను రక్షించే కొత్త నియమాల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి’’ అని అన్నారు.
2.కంటెంట్ సృష్టికర్తలకు న్యాయబద్ధమైన పరిహారం
సంప్రదాయ మీడియా నుంచి డిజిటల్ మాధ్యమానికి సాగిన మార్పు, సంపాదకీయ ప్రక్రియలో భారీగా పెట్టుబడులు పెట్టే సాధారణ మీడియాపై ఆర్థికపరమైన ప్రభావాన్నిచూపించింది. డిజిటల్ వేదికలు, సంప్రదాయ పాత్రికేయ వ్యవస్థల మధ్య అసమానతను గుర్తిస్తూ, కంటెంట్ సృష్టికర్తలకు న్యాయంగా పరిహారం అందించాల్సిన అవసరాన్ని శ్రీ వైష్ణవ్ ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘కంటెంట్ రూపొందించడంలో సంప్రదాయ మీడియా చేస్తున్న ప్రయత్నాలకు తగిన విధంగా న్యాయంగా పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన తెలిపారు.
3. పక్షపాతపూరితమైన అల్గారిథమ్
డిజిటల్ వేదికలను నడిపించే అల్గారిథంలు ఎక్కువ మందికి నచ్చే సమాచారానికే ప్రాధాన్యమిచ్చి, ప్రతిస్పందనలను ప్రేరేపించడం ద్వారా ఆదాయాన్ని అందిస్తాయి. ఎక్కువగా సంచలనమైన లేదా విభజించే కథనాలను విస్తరింపజేస్తాయి. ఇలాంటి పక్షపాతపూరితమైన పరిణామాలను, ముఖ్యంగా భారత్ వంటి వైవిధ్యమైన దేశంలో, సమాజంపై ఆ వ్యవస్థలు చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని పరిష్కారాలను కనుగొనాలని పిలుపునిచ్చారు.
4. మేధో సంపత్తి హక్కులపై కృత్రిమ మేధ ప్రభావం
ఏఐ విస్తరణ, ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్న సమాచారాన్ని రూపొందించే వారికి నైతిక, ఆర్థిక సవాళ్లను విసురుతోంది. కృత్రిమ మేధలో వస్తున్న పురోగతుల కారణంగా సృజనాత్మక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రమంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ వివరించారు. ఏఐ వ్యవస్థల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, వాస్తవంగా సమాచారాన్ని రూపొందించే వారి మేధో సంసత్తి హక్కుల (ఐపీ)ను కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. ‘‘విస్తృతమైన డేటా సెట్ల ఆధారంగా శిక్షణ పొందిన ఏఐ మోడళ్లు ప్రస్తుతం సృజనాత్మక కంటెంట్‌ను తయారుచేస్తున్నాయి. కానీ వాస్తవంగా ఆ డేటాను తయారు చేసిన వారికి దక్కాల్సిన హక్కులు, గుర్తింపు ఏమవుతున్నాయి? వారు చేసిన పనికి పరిహారం లేదా సరైన గుర్తింపు పొందుతున్నారా?’’ అని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఇది ఆర్థిక సమస్య మాత్రమే కాదు. నైతిక సమస్య కూడా’’ అని అన్నారు.
రాజకీయ విభేదాలకు అతీతంగా ఈ సవాళ్లను పరిష్కరించడానికి బహిరంగ చర్చలు, సహకార ప్రయత్నాల్లో భాగం పంచుకోవాలని శ్రీ వైష్ణవ్ మీడియా నిపుణులను కోరారు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా వ్యవహరించే మీడియా పాత్రను కాపాడుకోవడంతో పాటు 2047 నాటికి సామరస్యపూరితమైన, సంపన్నమైన వికసిత్ భారత్‌ను నిర్మించాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు.
డిజిటల్ శకానికి ప్రయాణం: తప్పుడు వార్తలను ఎదుర్కొంటూ, పాత్రికేయంలో నైతిక విలువలను పాటించడం
సంప్రదాయ ముద్రణ నుంచి శాటిలైట్ ఛానళ్లకు, ఆ తర్వాత డిజిటల్ యుగానికి జర్నలిజం పరిణామం చెందడం గురించి మాట్లాడుతూ ప్రజలకు వార్త ఎంత వేగంగా చేరువ అవుతోందో డా. మురుగన్ తెలిపారు. అయినప్పటికీ నకిలీ వార్తల వల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరిస్తూ, ఇవి ‘‘వైరస్‌ల కంటే వేగంగా’’ వ్యాపిస్తాయని అన్నారు. ఇవి జాతీయ సమగ్రతకు ముప్పు కలిగిస్తాయని, సైన్యాన్ని బలహీనపరుస్తాయని, భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని హెచ్చరించారు.
ప్రతి వ్యక్తిని ప్రభావవంతమైన సమాచార రూపకర్తగా మార్చడంలో స్మార్ట్ ఫోన్ల పాత్రను వివరిస్తూ, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో మరింత బాధ్యత, నియంత్రణ అవసరమని డా. మురుగన్ అన్నారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించినప్పటికీ, వాటిని కచ్చితంగా, నైతిక బాధ్యతతో ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు.
వార్తలను ప్రామాణీకరించడానికి, బూటకపు కథనాలను ఎదుర్కోవడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో సహా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలను డాక్టర్ మురుగన్ ప్రశంసించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) లాంటి సంస్థల ద్వారా గుర్తింపు, ఆరోగ్యం, సంక్షేమ పథకాలతో పాటు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలతో సహా పాత్రికేయులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు వివరించారు. పాత్రికేయ నిబంధనలను ఆధునికీకరించేలా చేపట్టిన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ చట్టం-2023 లాంటి సంస్కరణలను కూడా ఆయన గుర్తు చేశారు. సాధారణ పాత్రికేయ సమావేశాలు, వెబ్ స్క్రీనింగ్‌లు, కాన్ఫరెన్స్ లు తదితరమైన వాటి ద్వారా సమాచారాన్ని వేగంగా అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం వివరించారు. న్యాయమైన, పారదర్శక, స్థిరమైన పత్రికా వ్యవస్థను నిర్మించడానికి సమష్టి కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. సత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేదిగా, విభిన్న స్వరాలకు వేదికగా, సమాజంలో సానుకూల మార్పునకు ఉత్ప్రేరకంగా నిలిచేదిగా పాత్రికేయాన్ని ఆయన అభివర్ణించారు.
పాత్రికేయ సమగ్రతను కాపాడటంలో పీసీఐ పాత్ర
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ మాట్లాడుతూ, డిజిటల్ ప్లాట్‌ఫాంలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, ఆధ్యాత్మిక మీడియా, బ్లాగులు, పాడ్‌క్యాస్ట్‌ల వినియోగం వార్తలు, సమాచార ప్రసారానికి విస్తరించాయి. ఇవి జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు సవాళ్లను కూడా మోసుకువచ్చాయి. ఈ విషయంలో కచ్చితమైన వార్తలు సకాలంలో మనకు చేరాలి.
పాత్రికేయ సమగ్రతను కాపాడటం, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడం, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే నైతిక వేదికగా మీడియా పనిచేసేలా చూడడం తదితర చర్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. పీసీఐ అందిస్తున్న పురస్కారాలు, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాల గురించి ప్రధానంగా వివరించారు. "ఈ సంవత్సరం, వివిధ విభాగాల్లో 15 మంది పాత్రికేయులు జాతీయ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. పీసీఐ చేపట్టిన కార్యక్రమాలు జర్నలిజంలో ప్రతిభను, నైతిక విలువలను ప్రోత్సహించడమే కాకుండా, ఔత్సాహిక జర్నలిస్టులలో బాధ్యత, అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి" అని ఆమె తెలిపారు.
****
(Release ID: 2074147)
Visitor Counter : 22
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam