సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 4

55వ ఇఫీలో గాంధీజీ శాంతి, అహింసా నేపథ్యంలో...


ప్రతిష్ఠాత్మక ‘ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం’ కోసం పోటీ పడుతున్న 10 చిత్రాలు

ఇఫీలో ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం : శాంతి, మానవతల ప్రతీక

ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం కోసం ఎంపికైన చిత్రాల పేర్లను 55వ ఇఫీ ( భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) అధికారికంగా ప్రకటించింది. ఇఫీ ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని ‘ప్యారిస్ ఐసీఎఫ్టీ’ (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ ఆడియోవిజువల్ కమ్యూనికేషన్స్), యునెస్కోల సహకారంతో అందిస్తోంది.  మహాత్మా గాంధీ ఆశయాలైన అహింస, సహనం, శాంతి సామరస్యాలను ప్రతిబింబించే చిత్రాలను వరించే ఈ పురస్కారం, వివిధ దేశాల, సంస్కృతుల మధ్య వారధుల నిర్మాణాన్నీ శాంతినీ ప్రోత్సహిస్తుంది.   

 

image.png

 

వివిధ ప్రాంతాలూ సంస్కృతుల కథాంశాలతో నిర్మితమైన చిత్రాలైనప్పటికీ గాంధేయ సూత్రాలను బోధించే పది అత్యుత్తమ చిత్రాలను ఈ యేటి అవార్డు కోసం ఎంపిక చేశారుఅవార్డు నిమిత్తం నైతిక బలం, కళాత్మక విలువలతో కూడిన, ప్రేక్షకులు – ముఖ్యంగా యువతను ఆకర్షిస్తూఆలోచింపజేసే చిత్రాలను ప్రతిష్ఠాత్మక జ్యూరీ పరిశీలిస్తుంది. ఫిప్రెసి (ఇంటెర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిమ్ క్రిటిక్స్) అధ్యక్షుడు శ్రీ ఇసాబెల్ డ్యానెల్, సీఐసీటీ-ఐసీఎఫ్టీ ఉపాధ్యక్షులు సెర్జ్ మిచెల్, యునెస్కో సాంస్కృతిక విభాగం మాజీ అధినేత్రి మారియా క్రిస్టీనా ఇగ్లెసియాస్, అల్జీర్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ఆర్టిస్టిక్ డైరెక్టర్ - డాక్టర్ అహ్మద్ బెజౌయీ, సీఐసీటీ-ఐసీఎఫ్టీ యువ విభాగ సృజనాత్మక వేదిక సభ్యుడు జూయన్ హున్ లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం-2024’ పోటీకి ఎంపికైన చిత్రాలు:

క్రాసింగ్

అండ్ దెన్ వి డాన్స్డ్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న స్వీడిష్ డైరెక్టర్ లివాన్ అకిన్ చిత్రం క్రాసింగ్.  ఇస్తాంబుల్ ట్రాన్స్ జెండర్ల విషాద గాథలను సంవేదనాత్మకంగా తెరకెక్కించాడుజాడ తెలియకుండా పోయిన తన అక్క కూతురు  టెక్లాని వెతికేందుకు రిటైరయిన టీచర్ లియా బయలుదేరుతుంది. దర్శకుడు ఆమె అన్వేషణని సామాజిక స్థాయి, లైంగికతల లోతైన దృష్టికోణాల ద్వారా చర్చించాడు. బంధుత్వం, పరివర్తన అంశాలను హృద్యంగా చూపిన తీరు బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ జ్యూరీ సభ్యుల మనసులని గెలుచుకుని క్రాసింగ్ చిత్రానికి టెడ్డీ జ్యూరీ అవార్డును కట్టబెట్టింది.

·        ఫర్ రానా

బిడ్డకు హృదయ మార్పిడి చికిత్స చేయించేందుకు అష్టకష్టాలూ పడే ఒక జంట కథను ఇరాన్ చిత్రం ఫర్ రానా చూపుతుంది. తొలి ప్రయత్నంలోనే ప్రేమ, ఎడబాటు, వైద్య రంగంలో నైతికాంశాలు వంటి బరువైన అంశాలను దర్శకుడు ఇమాన్ యెజ్దీ తెర్కెక్కించిన విధానం ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రం 2024  బూసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యింది.

 

·        Lesson Learned (Fekete Pont) లెసన్ లెర్నడ్ (ఫెకీట్ పాంట్)

హంగేరీ దర్శకుడు బలింట్ జిమ్లర్ తొలిసారిగా మెగాఫోన్ పట్టుకున్నప్పటికీ బలమైన కథా సంవిధానంతో లొకార్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవ విమర్శకుల ప్రశంసలను సంపాదించుకున్నాడు. ఎదిగే క్రమంలో సమస్యగా మారిన ఒక పిల్లవాడి దృష్టికోణం నుంచీ హంగేరీ దేశపు విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని లెసన్ లెర్నడ్ ప్రభావవంతంగా చూపింది. పనిలో పనిగా హంగేరీ సమాజపు తీరుతెన్నుల గురించి కెమెరా కన్ను చెప్పిన భాష్యం వీక్షకుల మనసులని గెలుచుకుంది.

·        మీటింగ్ విత్ పోల్ పోట్ ( రాండే-వూ అవెక్ పోల్ పోట్)

ఎలిజబెత్ బెకర్ వెన్ ది వార్ వజ్ ఓవర్ స్ఫూర్తితో తీసిన మీటింగ్ విత్ పోల్ పోట్ చిత్రం, కంబోడియా దర్శకుడు రితీ పాన్ చేతిలో రూపుదిద్దుకుంది. 1978లో పోల్ పోట్ అకృత్యాలను దగ్గర నుంచీ చూసిన ముగ్గురు ఫ్రెంచి పాత్రికేయుల అనుభవాలని సినిమా రూపంలో సమర్పించిన ఈ చిత్రం. చారిత్రిక వాస్తవాలను కచ్చితత్వంతో, సంవేదనా భరితంగా చూపిందన్న పేరు దక్కించుకుంది. 2024 కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యింది.

 

·         సాతు- ఇయర్ ఆఫ్ ది రాబిట్

లావోస్ నేపథ్యంగా, 2024 రెయిన్ డ్యాన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించిన సాతు- ఇయర్ ఆఫ్ ది రాబిట్  సినిమా.. దర్శకుడు జోషువా ట్రిగ్ కు తొలి ప్రయత్నంలోనే పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. తన తల్లి కోసం అన్వేషిస్తున్న ఒక అనాథ బాలుడి దీనగాధను చూపిన ఈ సినిమాలో బతుకు పోరాటం, స్నేహం, పోరాట పటిమ వంటి అంశాలను స్పృశించారు.

·         ట్రాన్సామజోనియా

బ్రెజిల్ అమెజాన్ అడవుల నేపథ్యంలో, దక్షిణాఫ్రికా దర్శకురాలు పియా మరాయి తీసిన ట్రాన్సామజోనియాలో అడవి కూడా పాత్రధారిగా మారి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అటవీ సంపదను తరలించుకుపోయే అక్రమ వ్యాపారుల బారి నుంచీ స్థానిక తెగలను కాపాడుకునేందుకు పోరాటం సాగించిన ప్రధాన పాత్రధారి వృత్తాంతాన్ని తెలిపే ఈ కథ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయాల మధ్య తలెత్తే సున్నితమైన అంశాలనూ సంఘర్షణలనూ పరిశీలించింది. 2024 లొకార్నో, టోరొంటో చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

·        అన్ సింకబుల్ (సిన్కెఫ్రీ)

డానిష్ భాషా చిత్రం, అన్ సింకబుల్ (సిన్కెఫ్రీ) లో1981 నిజ జీవిత ‘ఆర్ఎఫ్2’ విషాద ఘట్టాన్ని దర్శకుడు క్రిస్టియన్ ఆండర్సన్ థ్రిల్లర్ గా మలిచిన తీరు ప్రేక్షకుడిని విస్మయానికి గురి చేస్తుంది. సంఘటనలో తన తండ్రి పాత్ర గురించి పరిశోధిస్తున్న ప్రధాన పాత్రధారి హెన్రిక్, ఆ అన్వేషణలో ఎదుర్కొన్న వేదన, అపరాధ భావనలు, కుటుంబపరమైన అంశాలను సినిమా అద్వితీయంగా చిత్రీకరించింది. 

 

·        అమార్ బాస్

నందితా రాయ్, శివ ప్రసాద్ ముఖర్జీల సంయుక్త దర్శకత్వంలో వచ్చిన అమార్ బాస్  ద్వారా నాటితరం సుప్రసిద్ధ నటి రాఖీ గుల్జార్ 20 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం వెండి తెరపై కనిపించారుడబ్బు లేమితో ఇబ్బందులు పడుతున్న తల్లీ కొడుకుల కథను మనసులను తడిమేలా చెప్పిన ఈ బెంగాలీ చిత్రంలో వ్యక్తిగత ఆకాంక్షలు, కుటుంబ పరమైన సంక్లిష్టతలను ప్రతిభావంతంగా చిత్రీకరించారు. 

·        జుయిఫూల్

సరిహద్దు హింస నేపథ్యంలో ఈశాన్య భారతదేశంలో ఇద్దరు తల్లుల మధ్య ఏర్పడ్డ ప్రత్యేక అనుబంధాన్ని ఆర్ద్రంగా చిత్రీకరించిన జుయిఫూల్  చిత్రానికి  అస్సామీ దర్శక నటుడు జాదూమోనీ దత్తా దర్శకత్వం వహించారు. జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న ఈ సినిమా,  సంఘర్షణ, మానవత్వం, మాతృత్వ భావనల సామాజిక, వ్యక్తిగత  కోణాలను నిశితంగా పరిశీలించింది.    

  • శ్రీకాంత్

తుషార్ హీరా నందానీ దర్శకత్వం వహించిన ఈ నిజ జీవిత చిత్రంలో రాజ్ కుమార్ రావు, అలయా ఎఫ్ నటించారు. దృష్టిలోపం ఉన్నప్పటికీ పట్టుదలతో ఎన్నో అడ్డంకులని దాటుకుని ప్రతిష్ఠాత్మక ఎంఐటీలో సీటు, అనంతర కాలంలో వ్యాపార రంగంలో విజయాన్నీ దక్కించుకున్న వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా స్ఫూర్తిదాయక విజయగాధను శ్రీకాంత్ చూపుతుంది. 

ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం నేపథ్యం

46వ ఇఫీలో ప్రవేశపెట్టిన ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకం... కళాత్మక విలువలతో  తీర్చిదిద్దిన సినిమాలకే కాకుండా, సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను నైతికత, మానవీయ కోణాల్లో చర్చించే సినిమాలకు ప్రాధాన్యాన్నిస్తుంది. సినిమా మాధ్యమానికున్న బలమైన పరివర్తనాత్మక శక్తిని వినియోగించుకుంటూ ప్రపంచ మానవులు ఎదుర్కొనే కష్టాలూ నష్టాలూ, పంచుకునే భావోద్వేగాల గురించి లోతుగా అర్థం చేసుకునే దిశగా ప్రోత్సాహాన్నందిస్తుంది.

ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతకాన్ని కేవలం పురస్కారంగా చూడలేం. స్ఫూర్తిని రగిల్చి అవగాహన పెంచే, ఐక్యం చేసే చలన చిత్రాల సామర్థ్యాన్ని ఈ అవార్డు గుర్తించీ గౌరవిస్తుంది. గోవా చలన చిత్రోత్సవ ముగింపు వేడుకల్లో, ఇఫీ -2024 ‘ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ పతక’ విజేతను ప్రకటిస్తారు. పురస్కారంలో భాగంగా ప్రతిష్ఠాత్మక గాంధీ పతకంతో పాటూ విజేతకు ప్రశంసా పత్రాన్ని కూడా బహూకరిస్తారు.  

మరింత సమాచారం ఈ లింక్ లో లభ్యం :  https://iffigoa.org/

 

***

iffi reel

(Release ID: 2072942) Visitor Counter : 23