ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని వడ్తల్ లోస్వామి నారాయణ మందిరం 200వ వార్షిక వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
సమాజానికి సాధువుల సేవ విశేషమైనది.. సమాజం, దేశం మొత్తం కలిసి ముందుకొస్తే
ఏ లక్ష్యమైనా తప్పక నెరవేరుతుంది: ప్రధానమంత్రి
అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా దేశం ముందుకెళుతున్నది: ప్రధానమంత్రి
అభివృద్ధి చెందిన భారత్ కోసం స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉన్న తపన, చైతన్యం140 కోట్ల మంది దేశ ప్రజలలో ప్రతి క్షణం ఉండాలి: ప్రధానమంత్రి
స్థానికత (వోకల్ ఫర్ లోకల్)కు సహకరిస్తూ ‘ఆత్మ నిర్భర్’గా మారడం
ఈ దిశగా తొలి అడుగు: ప్రధానమంత్రి
భారత యువత సామర్థ్యం ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది.. నిపుణులైన ఈ యువత
దేశ అవసరాలనే కాదు, ప్రపంచ ఆవశ్యకతను కూడా తీర్చగలదు: ప్రధానమంత్రి
ఘనమైన తన వారసత్వాన్ని గుర్తించి, సంరక్షిస్తేనే ఏ దేశమైనా ముందుకు సాగుతుంది.. అభివృద్ధితో పాటు వారసత్వం మనకు మంత్రప్రదం: ప్రధానమంత్రి
Posted On:
11 NOV 2024 1:31PM by PIB Hyderabad
గుజరాత్ లోని వడ్తాల్ లో ఉన్న శ్రీ స్వామి నారాయణ మందిరం 200వ వార్షిక వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. శ్రీ స్వామి నారాయణ అనుగ్రహంతోనే 200వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి అనుచరులందరికీ స్వాగతం పలికిన శ్రీమోదీ.. స్వామి నారాయణ మందిర సంప్రదాయంలో సేవే ప్రధానమని, శిష్యులంతా నేడు సేవలో నిమగ్నమయ్యారని అన్నారు. ఈ వేడుకలను ఇటీవల మీడియాలో చూడడం తనకు సంతోషాన్నిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.
వడ్తాల్ ధామ్ లో 200వ వార్షిక వేడుకలు కేవలం చరిత్ర మాత్రమే కాదని పేర్కొన్న శ్రీమోదీ.. ఆ ధామంపై అత్యంత భక్తివిశ్వాసాలతో చిన్నప్పటి నుంచి పెరిగిన తనతో సహా అనేక మంది శిష్యులకు ఇది అత్యంత ప్రాధాన్యం గల కార్యక్రమమన్నారు. భారతీయ సంస్కృతి శాశ్వత వాహిని అనడానికి ఈ ఉత్సవం నిదర్శనమన్నారు. శ్రీ స్వామి నారాయణ వడ్తాల్ ధామాన్ని స్థాపించి 200 ఏళ్లు గడిచినప్పటికీ ఆధ్యాత్మిక చేతన సజీవంగా ఉందని.. ఆయన బోధనలతో నేటికీ తాదాత్మ్యం చెందగలమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. మందిర 200వ వార్షికోత్సవం సందర్భంగా సాధువులు, అనుచరులందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయల (200) వెండి నాణెంతోపాటు స్మారక చిహ్నంతో పోస్టల్ స్టాంపు విడుదల చేసిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇవి భావి తరాల మదిలో ఈ గొప్ప సందర్భపు జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాయన్నారు.
ఈ సంప్రదాయంతో స్వామి నారాయణ్ వ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక సంబంధాలపై ఆయన అనుచరులందరికీ అవగాహన ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం అర్థవంతమైన చింతనతోపాటు.. సాధువుల దివ్య సాంగత్యాన్ని గతంలోనూ, ఇప్పుడూ తాను ఆస్వాదించానని ప్రధాని చెప్పారు. ఇతర కార్యక్రమాల కారణంగా తాను వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ, మానసికంగా తాను వడ్తాల్ ధామంలోనే ఉన్నానని ప్రధాని వ్యాఖ్యానించారు.
పవిత్రమైన సాధు సంప్రదాయం భారతదేశ ప్రత్యేకత అని, ప్రతీ క్లిష్ట సమయంలోనూ ఒక రుషో, సాధుసంతో, మహాత్ముడో ఎవరో ఒకరు ముందు నిలిచారని శ్రీ మోదీ అన్నారు. స్వామి నారాయణ్ కూడా అలాంటి సమయంలోనే వచ్చారన్నారు. వందల ఏళ్ల బానిసత్వంతో బలహీనపడి, దేశం ఆత్మ విశ్వాసం కోల్పోయిన సమయంలో దేశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారని ప్రధాని చెప్పారు. స్వామి నారాయణ్ తోపాటు ఆ కాలపు సాధువులందరూ ఓ కొత్త ఆధ్యాత్మిక శక్తినివ్వడమే కాకుండా.. మన ఆత్మగౌరవాన్ని మేల్కొలిపారని, మన అస్తిత్వాన్ని పునరుజ్జీవింపజేశారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా శిక్షపత్రి, వచనామృతుల కృషి ఎంతో అసామాన్యమైనదని, వారి బోధనలను స్వీకరించి ముందుకు తీసుకెళ్లడం మనందరి కర్తవ్యమని ఉద్ఘాటించారు. మానవాళి సేవకు, నూతన శక నిర్మాణానికి విశేషమైన తోడ్పాటునందించి గొప్ప స్ఫూర్తిగా వడ్తాల్ ధామం నిలిచినందుకు సంతోషంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. అదే వడ్తాల్ ధామం అణగారిన వర్గాల నుంచి సాగరం వంటి గొప్ప అనుచరులను అందించిందన్నారు. వడ్తాల్ ధామం నేడు ఎందరో పిల్లలకు ఆహారం, నివాసం, విద్యతోపాటు అనేక సేవలు అందిస్తోందని.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మహిళా విద్య వంటి కీలక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పేదలకు సేవ, ఆధునికతను – ఆధ్యాత్మికతను మేళవించి భారతీయ సంస్కృతిని పరిరక్షించేలా కొత్తతరాన్ని నిర్మించడం వంటి విశేష సేవలెన్నిటినో వడ్తాల్ ధామం అందిస్తోందని శ్రీ మోదీ వివరించారు. ఇక్కడి సాధువులు, భక్తులు ఎప్పుడూ తన అంచనాలను తప్పలేదని.. మెరుగైన భవిష్యత్తు కోసం పారిశుద్ధ్యం నుంచి పర్యావరణం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టారని శ్రీ మోదీ ప్రశంసించారు. దానిని వారు తమ బాధ్యతగా స్వీకరించి, మనస్ఫూర్తిగా ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో నిమగ్నమయ్యారన్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన శిష్యులు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో లక్షకు పైగా మొక్కలు నాటారని శ్రీ మోదీ తెలిపారు.
ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుందని, వారి జీవితాన్ని కూడా అది నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యం మన మనోవాక్కర్మలను ప్రభావితం చేస్తుందన్నారు. పరమార్థాన్ని గుర్తిస్తే జీవితం మొత్తం మార్పు వస్తుందన్నారు. ప్రతి యుగంలోనూ సాధు సంతులు ప్రజలకు తమ జీవిత లక్ష్యాన్ని తెలియజేశారని కొనియాడారు. మన సమాజానికి సాధుసంతులు, రుషుల విశేష సేవలను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ మోదీ.. ఆ లక్ష్యాల కోసం మొత్తం సమాజం, దేశం ఏకమైతే అవి తప్పక నెరవేరుతాయన్నారు. అందుకు అనేక ఉదాహరణలున్నాయన్నారు. ధార్మిక సంస్థలు నేడు యువతకు బృహత్తరమైన దిశను నిర్దేశించాయని, అభివృద్ధి చెందిన భారతదేశమనే నిర్దేశిత లక్ష్యంతో దేశం మొత్తం ముందుకు వెళుతున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశమనే ఈ పవిత్ర లక్ష్యాన్ని వడ్తాల్ సాధు సంతులు, స్వామి నారాయణ్ పరివారమంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీ మోదీ కోరారు. స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రస్తావిస్తూ - స్వాతంత్ర్య కాంక్ష, చేతన సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ శతాబ్దం పాటు స్ఫూర్తినిస్తూ నిలిచాయని.. ప్రజలు తమ స్వతంత్రతా లక్ష్యాన్ని, స్వప్నాలను, సంకల్పాన్ని ఒక్క రోజూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉన్న తపన, చైతన్యం అభివృద్ధి చెందిన భారత్ కోసం140 కోట్ల మంది దేశ ప్రజలలో అనుక్షణం ఉండాలన్నారు. రాబోయే 25 సంవత్సరాలు అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా జీవించేలా, ప్రతి క్షణం దానితో మమేకమై ఉండేలా ప్రజలను ప్రేరేపించాలని సాధువులు, స్వామి నారాయణ్ అనుచరులను ఆయన కోరారు. ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని అభ్యర్థించారు. స్వావలంబన సాధించడం అభివృద్ధి చెందిన భారత్ దిశగా తొలి అడుగు అని, దీన్ని సాధించడానికి బయటి వ్యక్తులు అవసరం లేదని, 140 కోట్ల మంది భారత పౌరులు ఈ దిశగా చొరవ తీసుకోవాలని కోరారు. స్థానికతను ప్రోత్సహించడం ద్వారా సహకరించాలని కార్యక్రమానికి హాజరైన స్వామి నారాయణ్ శిష్యులను శ్రీ మోదీ కోరారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం దేశ ఐక్యత, సమగ్రత అత్యంత ప్రధానమైనవని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. కొన్ని స్వార్థ శక్తులు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను ఐక్యంగా తిప్పికొట్టడం అత్యావశ్యకమన్నారు.
కఠోర సాధన ద్వారా పెద్ద లక్ష్యాలను ఎలా సాధించవచ్చో, దేశ నిర్మాణం దిశగా యువత నిర్ణయాత్మకంగా ఎలా నిర్దేశించగలదో, యువత దేశాన్ని ఎలా నిర్మించగలదో – ఎలా నిర్మిస్తుందో అన్న అంశాలపై శ్రీ స్వామి నారాయణ్ బోధనలను శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. ఇందుకోసం యువతను సమర్థులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడం అవసరం. సాధికారత, నైపుణ్యం కలిగిన యువత అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా నడిపించగల అతిపెద్ద శక్తి అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారత యువతకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మరింత పెరుగుతుందన్నారు. భారత్ లోని నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉందని, దేశ యువశక్తి ప్రపంచాన్ని ఆకట్టుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. దేశంతోపాటు ప్రపంచ అవసరాలను కూడా తీర్చడానికి ఈ యువత సంసిద్ధంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. వ్యసనాల నుంచి విముక్తి కల్పించడానికి స్వామి నారాయణ్ భక్తులు చేస్తున్న కృషిని ప్రముఖంగా పేర్కొంటూ.. యువత వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా సాధువులు, స్వామి అనుచరులు కృషిచేయాలని శ్రీ మోదీ కోరారు. మాదకద్రవ్యాల వ్యసనం నుంచి యువతను రక్షించే కార్యక్రమాలు కేవలం భారత్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యావశ్యకమని ఆయన అన్నారు. అలాంటి కార్యక్రమాలను నిరంరం చేపట్టాలన్నారు.
ఏ దేశమైనా ఘనమైన తన వారసత్వ సంపదను గౌరవించి, సంరక్షిస్తేనే పురోగతి సాధించగలదన్న శ్రీ మోదీ.. “అభివృద్ధితోపాటు వారసత్వ సంపదను పరిరక్షించడం భారత్ కు మంత్రప్రదం’’ అన్నారు. అయోధ్యను ప్రస్తావిస్తూ.. వేల ఏళ్ల నాటి భారత వారసత్వ కేంద్రాల వైభవం పునరుద్ధరణకు నోచుకుంటుండడంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో వాటిని ధ్వంసమైన ప్రదేశాలుగానే భావించారన్నారు. కాశి, కేదారనాథ్, పావగఢ్, మొథెరా సూర్యదేవాలయం, సోమనాథ ఆలయాలను కూడా ఈ పరివర్తనకు నిదర్శనాలుగా ఆయన ఉదాహరించారు. అంతటా సరికొత్త చైతన్యం, సంకల్పం కనిపిస్తున్నాయన్నారు. చోరీకి గురైన వందల ఏళ్ల నాటి దేవతా విగ్రహాలు భారత్‌కు తిరిగి వస్తున్నాయని కూడా శ్రీ మోదీ పేర్కొన్నారు. లోథాల్ పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. సాంస్కృతిక చైతన్య ప్రసరణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదన్నారు. ఈ నేలను, ఈ దేశాన్ని, ఇక్కడి సంప్రదాయాలను ప్రేమించే, ఈ సంస్కృతిపై గర్వించే, మన వారసత్వాన్ని కీర్తించే పౌరులందరిపైనా ఈ బాధ్యత ఉందన్నారు. వడ్తాల్ ధామంలోని స్వామి నారాయణ్ కళాఖండాల ప్రదర్శన శాల అక్షర్ భువన్ కూడా ఇందులో భాగమే అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ.. అక్షర్ భువన్ దేశ అజరామరమైన ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప దేవాలయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
140 కోట్ల మంది భారతీయులు ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమైనప్పుడే అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రస్థానాన్ని పూర్తి చేయడంలో మన సాధు సంతుల మార్గదర్శకత్వం చాలా ముఖ్యమైనదన్నారు. 12 ఏళ్లకోసారి జరిగే భారత సాంస్కృతిక దీప్తి అయిన పూర్ణ కుంభ గురించి ప్రపంచానికి చాటాలని ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సాధువులను ప్రధానమంత్రి అభ్యర్థించారు. ప్రయాగరాజ్ లో జరగబోయే పూర్ణ కుంభ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, భారత మూలాలు లేని విదేశీయులకు దాని గురించి వివరించాలని ఆయన సూచించారు. విదేశాల్లోని తమ ప్రతి శాఖ నుంచి కనీసం 100 మంది విదేశీయులు... వచ్చే కుంభమేళాను సందర్శించడానికి ప్రయత్నించాలని ఆయన కోరారు. ప్రపంచం మొత్తానికీ దీనిపై అవగాహన కల్పించే ఈ కార్యాన్ని సాధువులు సులభంగా పూర్తి చేయగలరని ప్రధాని అన్నారు.
కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెప్తూ, ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్వామి నారాయణ మందిరంలోని సాధువులు, అనుచరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
గుజరాత్ లోని వడ్తాల్ లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ మందిరం 200వ వార్షిక వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. శ్రీ స్వామినారాయణ్ మందిరం అనేక దశాబ్దాలుగా ప్రజల సామాజిక, ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేస్తోంది.
***
MJPS/SR
(Release ID: 2072575)
Visitor Counter : 34
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Bengali-TR
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam