సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 4

ఇఫీ ఆధ్వర్యంలో నలుగురు భారతీయ సినీ దిగ్గజాల శతాబ్ధి ఉత్సవాలు

కొత్త హంగులతో… రాజ్ కపూర్, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మహ్మద్ రఫీ కళాఖండాలు

భారతీయ సినిమాను బహుముఖీనంగా తీర్చిదిద్దిన నలుగురు సినీ దిగ్గజాలకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం తగిన రీతిలో గౌరవించనున్నది. సినిమా రంగంలో అసాధారణ సేవలందించిన- రాజ్ కపూర్, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), మహమ్మద్ రఫీల గౌరవార్ధం.. ఇఫీ ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించింది. వీటిలో అనేక సినిమా ప్రదర్శనలు, ముఖాముఖి కార్యక్రమాలు, ఇంకా ఇతర కార్యక్రమాల ద్వారా ఈ కళాకారుల గురించి ప్రతినిధులకు పరిచయం చేస్తారు.

 

కాలదోషం పట్టని అపురూప చిత్రాలను పునరుద్ధరించిన ఎన్ఎఫ్ డీసీ – ఎన్ఎఫ్ఏఐ

 

అజరామరంగా నిలిచే ప్రముఖుల చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఇఫీ ఆయా కళాకారులకు నివాళి అర్పించనున్నది. ఎన్ఎఫ్ డీసీ - ఎన్ఎఫ్ఏఐ అపురూప చిత్రాలను పునరుద్ధరించాయి. భారత సినీ చరిత్రలో పేరెన్నిక గన్న చలన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలని నిర్ణయించారు. పాత చిత్రాలకు కొత్త హంగులు అందించడం ద్వారా వాటిని పునరుద్ధరించి, ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.

 

డిజిటల్ గా పునరుద్ధరించిన రాజ్ కపూర్ చిత్రం ఆవారాను ప్రదర్శించనున్నారు. సగటు మనిషి జీవితంలోని ఆత్మీయతానురాగాలు, హాస్యం, సహానుభూతులను కళ్లకు కట్టినట్లు రాజ్ కపూర్ ఆ సినిమాలో చూపించారు. పునరుద్ధరించిన సినిమాను ప్రదర్శించడం ద్వారా- రాజ్ కపూర్- భారతీయ సినిమాకు అందించిన అద్వితీయమైన సేవలతోపాటు, సామాజిక అంశాలను నిశితంగా, ఆర్ధ్రంగా చిత్రించిన వైనాన్ని కళ్లకు కట్టనున్నారు.

 

తపన్ సిన్హా దర్శకత్వం వహించిన హార్మోనియం చిత్రాన్ని ప్రదర్శిస్తారు. దీని ద్వారా తపన్ సిన్హా క్లిష్టమైన కథన శైలి గురించి ప్రేక్షకులు తెలుసుకోవడం వీలవుతుంది. బలమైన ఇతివృత్తానికీ, నిశితమైన కథనానికీ పేరెన్నికగన్న ‘హార్మోనియం’... సిన్హా కళాత్మక ధోరణి, సినిమా శైలికీ ఉదాహరణగా నిలిచింది.

 

సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) స్థానాన్ని సుస్థిరం చేసిన చలనచిత్రం ‘దేవదాసు’ను ఇఫీ ప్రదర్శించనున్నది. దేవదాసు.. ఇఫీ ప్రదర్శనల్లో హైలైట్ కానున్నది. పునరుద్ధరించిన ఈ సినిమాలో... దేవదాసుగా ఏఎన్నార్ పాత్ర మరింత ఆకర్షణీయంగా ఉంది. భారతీయతను నిశితంగా ప్రతిబింబించే పాత్రలో ఆయన భావోద్వేగభరిత ప్రదర్శనతో నేటి తరం ప్రేక్షకులు తాదాత్మ్యం చెందడం ఖాయం.

చివరిగా, హమ్ దోనో చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఆడియో, వీడియోపరంగా ఈ సినిమాకు మెరుగులు దిద్దారు. దిగ్గజ గాయకుడు మహమ్మద్ రఫీ చిరస్థాయిలో నిలిచే పాటలందించారు. సంగీతం, సినిమా రంగాలకు రఫీ అందించిన అసాధారణ సేవలకు తార్కాణంగా ఈ ప్రదర్శన నిలుస్తుంది. అన్ని తరాల వారినీ మంత్రముగ్ధులను చేసే ఆయన స్వరం వీనుల విందు కానున్నది.

 

సినీ ధృవతారల ఉత్సవం...

 

చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, ఈ నలుగురు సినీ ధృవతారల కృషిని ఈ చిత్రోత్సవమంతా ఇఫీ స్మరించుకుంటుంది. వారి జీవిత విశేషాలను వివరిస్తూ, వారి విజయాలను శ్లాఘిస్తూ ప్రారంభోత్సవంలో ఒక అద్భుతమైన ప్రదర్శనను రూపొందించారు. వారి సినీ ప్రస్థానాన్ని కళ్లకు కట్టేవిధంగా ఆడియో విజువల్ ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు.

 

చర్చలు, సదస్సులు: గౌరవ అతిథులు, కుటుంబ సభ్యులతో చర్చలు, మౌఖిక సదస్సులు ఉంటాయి. వాటి ద్వారా వారి జీవిత విశేషాలను ప్రేక్షకులకు అందిస్తారు. చలనచిత్ర పరిశ్రమపై వారి కృషికి సంబంధించి వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను ఎన్నింటినో ఆహూతులకు అందిస్తారు.

 

మై స్టాంప్ ఆవిష్కరణ: భారతీయ సంస్కృతి, సినిమాపై చెరగని ముద్రకు ప్రతీకగా, ఈ సినీ దిగ్గజాలకు గౌరవ సూచకంగా ప్రత్యేకమైన స్టాంపును ఇఫీ ఆవిష్కరించనుంది.

 

రెండు భాషల్లో కరపత్రాలు: నలుగురి విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ప్రత్యేకంగా రెండు భాషల్లో విడుదల చేసే కరపత్రాలు ప్రతినిధులను ఆకట్టుకోనున్నాయి.

 

పాటల ప్రస్థానం: రాజ్ కపూర్ - మహ్మద్ రఫీ 150 పాటలతోపాటు తపన్ సిన్హా-ఏఎన్నార్ 75 పాటల సంగీత ప్రస్థానంపై రూపొందించిన కార్యక్రమం ఈ దిగ్గజాలు సంగీతపరంగా చేసిన కృషిని ప్రేక్షకుల ముందుంచుతుంది. భారతీయ సినీ సంగీతంపై వారు వేసిన చెరగని ముద్రను ప్రతిబింబిస్తుంది.

 

ప్రదర్శన: రాజ్ కపూర్, తపన్ సిన్హా, ఏఎన్నార్, మహ్మద్ రఫీ జీవిత విశేషాల అరుదైన జ్ఞాపకాలు, చిత్రాలు, కళాఖండాలతో నిర్వహించే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ కానున్నది.

 

ప్రత్యేక కార్యక్రమాలు: ఈ ఉత్సవం సందర్భంగా ఒక్కో సినీ దిగ్గజానికి... ఒక్కో రోజు చొప్పున ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ప్రేక్షకులను నిమగ్నం చేసే కార్యక్రమాలు, డిజిటల్ ప్రదర్శనలు, క్విజ్ నిర్వహణ వంటివి అందులో ఉన్నాయి. ప్రేక్షకులకు ఈ దిగ్గజాల విశేషాలను తెలియజెప్పడంతోపాటు, శాశ్వతమైన వారి ఘనతను చాటడానికి ఇవి ఉపయోగపడతాయి.

 

సైకత కళా ప్రదర్శన: దిగ్గజ కళాకారులకు నివాళిగా ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కళా అకాడమీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ సైకత కళాకారుడు శ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత కళా ప్రదర్శన ఉంటుంది.

ఘన నివాళి

 

కళ, చరిత్ర, భాగస్వామ్య అనుభవాలను ఒకే వేదికపై నుంచి అందించడం ద్వారా వారి ఘనతలతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలని, దాంతోపాటు సినీ ప్రపంచంపై రాజ్ కపూర్, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మహ్మద్ రఫీ ప్రభావాన్ని చిరస్థాయిలో నిలపాలని ఇఫీ భావిస్తోంది.

 

ఇఫీ అంటే సినిమాల ప్రదర్శన, సినీ ప్రేమికుల సంగమం మాత్రమే కాదు! స్థూలంగా.. నిపుణులైన అనేకానేక మంది కళాకారుల సినీ అనుభవాలను పంచుకోవడం ఈ ఉత్సవ ఉద్దేశం. సినీ వినీలాకాశంలో... ఒక వెలుగు వెలిగిన ధృవతారల విశేషాలు భావితరాలకు కూడా ఎప్పటికీ స్ఫూర్తిదాయకం

 

****

 

iffi reel

(Release ID: 2070959) Visitor Counter : 46