వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం)లో..170 విభాగాల్లో 8 వేల రకాల విత్తనాలు
Posted On:
04 NOV 2024 11:36AM by PIB Hyderabad
వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాల లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ ఈ- మార్కెట్ (జెమ్) పోర్టల్లో 8 వేల రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. విత్తనాలను 170 విభాగాలుగా వేరు చేసి ఉంచింది. సీజను ఆరంభానికి ముందుగా రూపొందించిన ఈ నూతన విభాగాల్లో దాదాపు వేలాది రకాల విత్తనాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పీఎస్‌యూలు, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా వీటిని సేకరిస్తారు.
రాష్ట్రాల విత్తన సంస్థలు, పరిశోధనా విభాగాలతో సహా నిపుణులతో సంప్రదించిన అనంతరం విత్తన సేకరణకు సంబంధించిన నియమావళిని రూపొందించారు. అందులో భాగంగానే నూతన విభాగాలను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు, నిబంధనలకు అనుగుణంగా విత్తన సేకరణ ప్రకియను సులభతరం చేస్తాయి.
జెమ్ పోర్టల్ విస్తృత వ్యూహంలో భాగంగా... విభాగాల వారీగా సేకరణను ప్రోత్సహించేందుకు నూతన కేటగిరీలను ప్రారంభించారు. ఇది విభాగ ఆధారిత విత్తన సేకరణకు ప్రభుత్వం చేపట్టే టెండర్ల పక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించి, సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల భాగస్వామాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుంది.
‘‘నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన కేటగిరీల ఆధారంగా... విక్రేతలు ప్రభుత్వ టెండర్లలో స్వేచ్ఛగా పాల్గొని, విత్తనాలను సరఫరా చేయాల్సిందిగా మేం ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలను తక్కువ ధరలో కొనుగోలు చేసేందుకు ఈ కొత్త కేటగిరీల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని విత్తన సంస్థలు, రాష్ట్ర విభాగాలను ప్రోత్సహిస్తున్నాం’’ అని జెమ్ డిప్యూటీ సీఈవో శ్రీమతి రోలి ఖరే తెలిపారు.
***
(Release ID: 2070650)
Visitor Counter : 69