రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ శాఖ కార్యదర్శిగా శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ పదవీ బాధ్యతల స్వీకారం
Posted On:
01 NOV 2024 11:25AM by PIB Hyderabad
రక్షణ కార్యదర్శిగా నియమితులైన శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ న్యూ ఢిల్లీ లోని సౌత్ బ్లాకులో ఈ రోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆయన కేరళ కేడరుకు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ ఏడాది ఆగస్టు 20న ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో నియమితుడు)గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ న్యూ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకానికి వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించి ఆ తరువాత నూతన పదవీబాధ్యతలను స్వీకరించారు. ‘‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర సైనికుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్ ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు.
అంతకు ముందు, శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం-పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. అంతకంటే ముందు, ఆయన మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖలో పశు సంవర్థకం - పాడి పరిశ్రమ కార్యదర్శి బాధ్యతలను నిర్వర్తించారు.
శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వంలో అనేక ఇతర పదవులను నిర్వహించిన అనుభవం ఉంది. ఆయన పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో వర్క్స్ అండ్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ లో డైరెక్టర్; డీడీఏ లో కమిషనర్ (భూములు); పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి; వ్యవసాయం, సహకారం - రైతుల సంక్షేమ విభాగంలో సంయుక్త కార్యదర్శి గాక, భారత ఆహార సంస్థలో ముఖ్య నిఘా అధికారిగా పని చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి గా, కేరళ ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శి గా ముఖ్య పదవులను కూడా నిర్వహించారు.
రక్షణ కార్యదర్శి పదవీ బాధ్యతలను నిర్వహించి, నిన్న పదవీ విరమణ చేసిన ఆంధ్ర ప్రదేశ్ కేడరుకు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీ గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని శ్రీ ఆర్ కే సింగ్ చేపట్టారు.
****
(Release ID: 2070073)
Visitor Counter : 11