Posted On:
28 OCT 2024 10:47PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..
ఇది పవిత్రమైన ధనతేరస్, దీపావళి పండుగల సమయం.. నవీన భారత దేశం ఒక పక్క సంస్కృతినీ, మరోవైపు అభివృద్ధినీ పండుగలుగా జరుపుకుంటున్న సందర్భం. వికాస్ (అభివృద్ధికి ప్రోత్సాహం), విరాసత్ (వారసత్వ పరిరక్షణ).. రెండూ సమ ప్రాధాన్యంలో ముందుకు వెళుతున్నాయి. ఈ రోజు గుజరాత్ లో అనేక అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలూ, శంకుస్థాపనలూ చేసే అవకాశం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చే ముందు వడోదర నగరానికి వెళ్ళిన నేను అక్కడ భారతదేశ తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ విమాన తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశాను. మన వాయుసేన కోసం అవసరమైన విమానాలను ఇక్కడే, మన వడోదర గడ్డపై తయారు చేసుకుంటామన్నమాట! అమ్రేలీ గ్వైక్వాడ్లదే, అలాగే, వడోదరా కూడా గైక్వాడ్ల వంశానికి చెందినదే. నిజంగా ఇది గర్వించదగిన క్షణం! ఈ రోజు భారత్ మాతా సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించాం. అలాగే ఈ వేదికపై నుండే నీళ్లు, రహదార్లు, రైల్వేల వంటి అనేక రంగాలకు చెందిన దీర్ఘకాలిక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు సౌరాష్ట్ర, కచ్ ప్రాంత ప్రజలకి మెరుగైన జీవనాన్ని ఇచ్చి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఉద్దేశించినవే! ఈ రోజు మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రైతుల సంక్షేమం, యువత ఉపాధి కోసం ప్రత్యేకంగా చేపట్టినవి. ఈ సందర్భంగా కచ్, సౌరాష్ట్రల్లోని నా సోదర సోదరీమణులకు ఇవే నా శుభాభినందనలు.
మిత్రులారా, సౌరాష్ట్ర, అమ్రేలీ ప్రాంతాలు జాతిరత్నాలకి పుట్టినిళ్ళు. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, రాజకీయ దృక్కోణాల పరంగా ఘన వారసత్వం గల నగరాలివి. యోగీజీ మహారాజ్, భోజా భగత్, కాగ్ బాపూలకు జన్మనిచ్చిన భూమి.. డులా భయా కాగ్ ప్రసక్తి లేని సాయంత్రాలని మనమెరుగం. ప్రతి కథా, కవితా ఆయన్ని జ్ఞప్తికి తెచ్చేవే. ఈరోజు మన ప్రాంతానికి నీటి రాకతో కవి కలాపి “రే పంఖీడా సుఖథీ చణజో” (చిన్ని పిట్టా, స్వేచ్ఛగా ఎగిరిపో..) వాక్యానికి సార్థకత చేకూరినట్లయ్యింది. కే. లాల్, కవి రమేష్ భాయి పరేఖ్, గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి జీవరాజ్ భాయి మెహతా వంటి గొప్ప గొప్పవారిని అందించిన నేల మన అమ్రేలీ. ఇక్కడి బిడ్డలు ఎన్నో సవాళ్ళకు ఎదురొడ్డి నిలబడ్డారు. ప్రకృతి విసిరే సవాళ్ళను తట్టుకుని నిలబడ్డ వారే సిసలైన భూమాత బిడ్డలనిపించుకుంటారు. అలాంటి కొందరు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి రాష్ట్రానికే కాక, దేశానికే గర్వకారణంగా నిలిచారు. సమాజ హితం కోసం తమ వంతు పాటుపడ్డారు. మన ఢోలకియా కుటుంబం ఇటువంటి ఆనవాయితీని కొనసాగించడం సంతోషాన్ని కలిగిస్తోంది.
గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం ‘80/20’ పథకం ద్వారా తొలి నుంచీ నీటి సంరక్షణకు ప్రాధాన్యాన్నిస్తోంది. 80/20 పథకం ఒకటే కాక, ప్రజల భాగస్వామ్యంతో చెక్ డ్యామ్ ల నిర్మాణం, పొలాల్లో నీటి చెలమల ఏర్పాటు, చెరువుల్లో పూడికతీత, నీటి మందిరాల నిర్మాణం, కొత్త చెరువుల తవ్వకం వంటివి ఎన్నో ప్రభుత్వ నీటి నిర్వహణ పథకాల్లో భాగ్యమయ్యాయి. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళిన నేను, బడ్జెట్ ద్వారా నీటి కోసం మనం వెచ్చించే పెద్దమొత్తాల గురించి ప్రస్తావించినప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, నేతలూ ఆశ్చర్యపోవడం నాకు గుర్తుంది. నైపుణ్యాలకు నిలయమైన మా రాష్ట్రానికి తగినంత నీటి లభ్యత అందుబాటులోకి వస్తే, రాష్ట్రం ఏ మేర సుభిక్షమవగలదో నేను వాళ్ళకి చెప్పేవాడిని. ఇదే మన గుజరాత్ ప్రత్యేకత. అనేక గ్రామాల, ప్రాంతాల ప్రజలు 80/20 పథకంలో భాగమయ్యారు. నా ఢోలాకియా కుటుంబం కూడా పెద్దఎత్తున పథకంతో మమేకమై, నదుల పునరుజ్జీవానికి పాటుపడింది. నదులను కాపాడుకునే సరైన విధానం ఇదే కదూ! నర్మదా నదితో పాటూ మరో 20 నదులకూ మనం అనుసంధానమయ్యాం. అప్పుడే, నదుల్లోనే చిన్న చెరువులను ఏర్పాటు చేయవచ్చన్న ఆలోచన కలిగింది. ఆ విధంగా మైళ్ళ కొద్దీ నీటిని సంరక్షించగలిగాం. ఈ విధంగా నేలలోకి ఇంకిన నీరు అమృత ఫలాలని అందించకుండా ఉంటుందా! సౌరాష్ట్ర కానీయండి , కచ్ కానీయండి, గుజరాత్ వాసులు పుస్తకాలు చదివి నీటి విలువ గురించి తెలుసుకోనవసరం లేదు. వారంతా ఆ కష్టాలను స్వయంగా అనుభవించినవారే. నీటి ఇక్కట్లు ఎలాంటివో బాగా తెలిసినవారే. నీటి కటకట వల్లే సౌరాష్ట్ర, కచ్ వాసులు ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. ఒకే గదిలో ఎనిమిది మంది దాకా నివసించాల్సి వచ్చేది. ఆ విధంగా నగరాల్లో ఇరుకు గదుల్లో మనవాళ్లు సర్దుకునేవారు. నీటి విలువ తెలిసిన వారం కాబట్టే జలశక్తి మంత్రిత్వశాఖని ప్రారంభించాం. ఈ విధంగా చేసిన కృషి వల్ల, ఈరోజు గుజరాత్ లోని ప్రతి గ్రామానికీ నర్మదా నీరు అందుతోంది.
ఒకప్పుడు పుణ్యం ఆశించి నర్మదానది చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళం. కాలం మారింది. ఇప్పుడు ప్రతి గ్రామానికీ సొంతంగా ఆ తల్లే వెళ్ళి నీటితో పాటూ పుణ్యాన్నీ అందిస్తోంది. నేను ‘సౌనీ’ పథకం వంటి నీటి సంరక్షణ పథకాలను ప్రవేశపెట్టిన సమయంలో, వాటిపై ఎవరికీ విశ్వాసం కలగలేదు. వాటి అమలు సాధ్యమని ఎవరూ నమ్మలేదు. ఎన్నికల ముందు మోదీ వేస్తున్న ఎత్తుగడ అంటూ కొందరు ఎద్దేవా చేయడం నాకు గుర్తుంది. సరిగ్గా అవే పథకాలు సౌరాష్ట్ర కచ్ ప్రాంతాలకు జవజీవాలను అందించి, భూమిని సస్యశ్యామలం చేశాయి. పచ్చని పొలాలను చూడాలన్న రైతుల కలలు నెరవేరాయి. పవిత్రమైన ఉద్దేశంతో తీసుకున్న సంకల్పం విజయవంతమై తీరుతుందనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? మారుతీ కార్ పట్టేంత వెడల్పున్న పైప్ లైన్లు వేద్దామని నేనన్నప్పుడు, కొందరు నోళ్లు వెళ్ళబెట్టారు. ఈ రోజు అవే భారీ పైపులు గుజరాత్ మొత్తానికీ నీటిని అందిస్తున్నాయి. ఇది రాష్ట్రం సాధించిన అపూర్వ విజయం. మనం నదుల లోతును పెంచవలసి ఉంది. ఈ దిశగా చెక్ డ్యాముల నిర్మాణం సహా బ్యారేజీలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి సంరక్షణ కోసం ఎంతైనా పాటుపడవలసిందే! రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని సంపూర్ణంగా నమ్మి భాగస్వాములయ్యారు కాబట్టే, తాగునీటి నాణ్యత పెరగడం, తద్వారా ఆరోగ్యం మెరుగవడం సాధ్యపడింది. ప్రతి ఇంటికీ, పొలానికీ నీరు అందించాలన్న దీక్ష నెరవేరింది. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు కుండెడు నీటి కోసం కొన్ని మైళ్ళ దూరం ప్రయాణించవలసి వచ్చేదని షవర్ తిప్పి స్నానం చేసే నేటి యువతరానికి తెలుసా? నీటి కటకట ఎంత బాధాకరమో వారికి తెలిసే అవకాశాలు తక్కువే!
జల సంరక్షణ విషయంలో గుజరాత్ లో జరిగిన కృషి ఈ రోజు మొత్తం దేశానికీ మార్గం చూపుతోంది. ‘ప్రతి ఇంటికీ, పొలానికీ నీరు’ అన్న సంకల్పం ఈనాటికీ చిత్తశుద్ధితో అమలవుతోంది. లక్షలాది మందికి లబ్ధి కలిగించాలన్న ఆశయంతో అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ జరుగుతున్నాయి. నావ్డా- చావండ్ భారీ పైప్ లైన్ ప్రాజెక్ట్ వల్ల 35 పట్టణాలూ, 1300 గ్రామాలకు నీరు అందుతుంది. అమ్రేలి, బొటాడ్, రాజ్ కోట్, జూనా గఢ్, పోర్బందర్ వంటి ప్రాంతాలకు రోజుకి 30 కోట్ల లీటర్ల మేర అదనపు నీరు లభిస్తుంది. ఈరోజు ‘విస్తృత పాస్వీ నీటి సరఫరా పథకం’ రెండో దశకు కూడా శంకుస్థాపన జరిగింది. ఈ పథకం వల్ల మహువా, తలాజా, పల్టానా తాలూకాలకు అత్యధిక లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర ఖజానాకు దన్నుగా నిలిచే పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతం, పల్టానా. ఈ ప్రాజెక్టుల వల్ల 100 గ్రామాలు ప్రత్యక్షంగా లాభాన్ని పొందుతాయి.
మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో మొదలుపెట్టిన నీటి ప్రాజెక్టులు ప్రభుత్వమూ, ప్రజల మధ్య భాగస్వామ్యానికి చిహ్నాలు. పథకాలు విజయవంతమవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.. కలిసి అడుగేస్తేనే విజయం సాధ్యం. ప్రభుత్వం 75 ఏళ్ళ స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించినప్పుడు, మోదీ పేర బోర్డులు, ఇతర ప్రచారాలు నిర్వహించి ఉండవచ్చు. అయితే మేం ఆ దారిని ఎంచుకోలేదు. అందుకు బదులు, ఒక్కో జిల్లాలో 75 చెరువులను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ప్రతి గ్రామంలో అమృత్ సరోవరాలను ఏర్పాటు చేయాలనుకున్నాం. అందుబాటులో ఉన్న తాజా సమాచారం మేర, 75,000 చెరువుల లక్ష్యంలో 60,000 చెరువుల పని పూర్తయి, అవి నీటితో కళకళలాడుతున్నాయి. ఈ విధమైన ప్రయత్నాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూగర్భ నీటిమట్టం పెరిగింది. ఇది భవిష్యత్తరాలకు కానుక వంటిదే కదా! గుజరాత్ లో మనం ‘క్యాచ్ ది రెయిన్’ ప్రచారోద్యమాన్ని నిర్వహించాం.. ఆ అనుభవం నాకు ఢిల్లీలో ఉపయోగపడింది. నేడు ఇదే ఉద్యమం విజయవంతమైన నమూనాగా రూపుదిద్దుకుంది. కుటుంబ, గ్రామ, కాలనీ స్థాయుల్లో ప్రజలు నీటి సంరక్షణలో భాగమయ్యేలా తగిన ప్రోత్సాహాన్నివ్వాలి. ఉత్తేజాన్ని కలిగించాలి. గుజరాత్ నీటి యాజమాన్యంలో ఉద్దండులనిపించుకున్న సీ.ఆర్. పాటిల్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ సభ్యులవడం మన అదృష్టం. ఆయన ప్రవేశపెట్టిన పద్ధతులు ఇప్పుడు దేశమంతా అమలవుతున్నాయి. ‘క్యాచ్ ద రెయిన్’ ప్రచారాన్ని కీలక అస్త్రంగా చేసుకుని, ప్రజల భాగస్వామ్యంతో గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో బావుల పునరుజ్జీవానికి ఆయన కృషి చేస్తున్నారు. దక్షిణ గుజరాత్, సూరత్ ప్రాంతానికి చెందిన కొందరు, తమ పూర్వీకుల గ్రామాల్లోని పాడుబడ్డ బావులను తిరిగి తవ్వించే ప్రయత్నాలు చేపట్టడాన్ని, ఇటీవల నేను పాల్గొన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా గమనించాను. ఇటువంటి ప్రయత్నాల వల్ల గ్రామాలకు సౌభాగ్యం తిరిగివచ్చినట్టే కదా! గ్రామంలోని నీళ్లు గ్రామ పొలిమేరలు దాటిపోకుండా నిలిపి ఉంచే ఇటువంటి విలక్షణ ప్రయత్నాలు ఎంతో అద్భుతమైనవి. నిజానికి ఈ ప్రచారాలన్నీ గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగినవే! నీటి ఎద్దడి అధికంగా గల దేశాల్లో ప్రతి నీతి బొట్టునీ జాగ్రత్తగా ఒడిసి పట్టినట్లే... మన దేశం కోసం చేపట్టిన బృహత్ పథకంలో ఈ ప్రయత్నాలు కూడా ఒక భాగమే. పోర్బందర్ లోని గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించిన వారికి, అక్కడ 200 ఏళ్ళ కిందట నిర్మించిన భూగర్భ నీటి నిల్వ ట్యాంక్ కనిపిస్తుంది. దీన్ని బట్టి, మన పూర్వీకులు నీటి సంరక్షణకి ఎంతటి ప్రాముఖ్యాన్నిచ్చారో అర్ధమవుతోంది కదా!
సరైన నీటి లభ్యత వల్లే సాగు సులభమవుతుంది. ‘ప్రతి నీటి బొట్టుకీ మరింత పంట’ ను సాధించడమే మన లక్ష్యం. గుజరాత్ లో సూక్ష్మస్థాయి నీటిపారుదలను ప్రోత్సహిస్తూ, అందులో భాగంగా నీటిని బొట్టుబొట్టుగా చిలకరించే స్ప్రింక్లర్లను అందించడంతో, రైతులు ఎంతో సంతోషించారు. ఇక్కడ ఒకప్పుడు ఏడాదికి ఒక పంట పండించడమే గగనమయ్యేది. అలాంటిది నర్మద నీరు గ్రామాలకు చేరుకోవడంతో రైతులు ఏడాదికి మూడు పంటలను పండించగలుగుతున్నారు. రైతు కుటుంబాల్లో ఆనందం, సౌభాగ్యం వెల్లివిరిసేందుకు సూక్ష్మస్థాయి నీటిపారుదల పద్ధతులు దోహదపడుతున్నాయి. పత్తి, వేరుశనగ, నువ్వులు, జొన్నలు, సజ్జలు వంటి పంటలతో అమ్రేలీ జిల్లా నేడు వ్యవసాయంలో ముందంజలో ఉంది. ఇదే విషయాన్ని నేను ఢిల్లీ సమావేశాల్లో తరుచూ ప్రస్తావిస్తూ ఉంటాను. ఇక, ఇక్కడ పండే కేసరి రకం మామిడిపండుకి ‘జిఐ’ ట్యాగ్ లభించడంతో, అమ్రేలీ పండుకి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించినట్లైంది. అమ్రేలీ సహజ పద్ధతుల వ్యవసాయానికి కూడా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ దిశగా మన రాష్ట్ర గవర్నర్ ఎంతో కృషి చేస్తున్నారు. రైతులు కూడా ఈ ప్రయోగాన్ని స్వీకరించి అనేక రకాలైన పంటలను అతి తక్కువ కాలంలో సాగు చేస్తున్నారు. హలోల్ ప్రాంతంలో సహజ పంటల పద్ధతులను అభివృద్ధి పరిచే అనేక విశ్వవిద్యాలయాలు వెలిశాయి. సహజ సాగు విశ్వవిద్యాలయానికి చెందిన తొలి కళాశాల అమ్రేలిలో ఏర్పాటయింది. ఇందుకు కారణం సులభంగానే గుర్తించవచ్చు. సరికొత్త ప్రయోగం విజయవంతమయ్యేందుకు అమ్రేలి రైతులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. అందువల్లే, ఇక్కడ కొత్త ప్రయోగాలు చేపడితే పంటలు అతి తొందరగా చేతికి అందుతాయన్న భరోసా కలుగుతోంది. స్థానిక రైతులు పశుసంవర్ధన పట్ల ఆసక్తి చూపాలనీ, తద్వారా లబ్ధి పొందాలనీ మేం ఆశిస్తున్నాం. ఈ చర్య వారికి సహజ వ్యవసాయ పద్ధతుల పరంగా కూడా లాభిస్తుంది. ఇక అమ్రేలి పాడి పరిశ్రమ విషయానికి వస్తే, ఒకప్పుడు పాడి పరిశ్రమ నెలకొల్పడాన్ని పెద్ద నేరంగా భావించే చట్టాలు ఉండేవి. ఈ పరిశ్రమకు అడ్డంకిగా ఉన్న అనేక చట్టాలని మేం తొలగించాం. దాంతో సహకార స్ఫూర్తితో ఇక్కడ పాడి పరిశ్రమ వర్ధిల్లే అవకాశం కలిగింది. 2007లో ఇక్కడ ‘అమర్ డైరీ’ మొదలెట్టినప్పుడు, కేవలం 25 సహకార సంఘాలు ఉండేవి. నేడు, 700 పైగా గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రోజుకి 1.25 లక్షల లీటర్ల పాలను సేకరించగలుగుతున్నాయి. ఈ విప్లవాత్మకమైన మార్పు వివిధ అభివృద్ధి చర్యల వల్ల మాత్రమే సాధ్యపడింది.
మిత్రులారా మీతో మరొక తీయటి కబురు పంచుకోవాలని ఉంది. చాలా ఏళ్ళ కిందట మీ అందరి ముందు ఆ విషయాన్ని ప్రస్తావించాను. ఒకప్పుడు శ్వేత విప్లవం, హరిత విప్లవం గురించి మాట్లాడుకునేవాళ్ళం కానీ, నేడు మనకి తీపి విప్లవం అవసరం ఎంతైనా ఉంది. మనం తేనెను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవలసి ఉంది. తేనె అనేది కేవలం ఇంట్లో మాట్లాడుకునే విషయం కాదు. మన పొలాల్లో తేనెని ఉత్పత్తి చేయగలగాలి. దిలీప్ భాయ్, రూపాలా గారూ ఈ విషయంలో అవగాహన పెంచడం వల్ల అమ్రేలి జిల్లా పొలాల్లో తేనెటీగల పెంపకం మొదలైంది. రైతులు వాటి పెంపకం గురించిన మెళకువలు నేర్చుకుంటున్నారు. దాంతో ఈ ప్రాంతపు తేనెకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఇది నిజంగా హర్షణీయం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వంటి పర్యావరణహిత ప్రచారాలను దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందరో ఆదరిస్తున్నారు. నాకు తెలిసిన అనేకమంది ఈ ప్రచార ఉద్యమంలో భాగమయ్యారు. ఇది పర్యావరణ పరిరక్షణ దిశగా రూపుదిద్దుకున్న గొప్ప కార్యక్రమం. ఇక పర్యావరణానికి సంబంధించి మరొక అంశం విద్యుదుత్పత్తి. విద్యుత్ బిల్లులను తగ్గించాలన్న మన ప్రయత్నానికి ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన’ ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఈ ఉచిత పథకంలో భాగమైన కుటుంబాలు ఏడాదికి రూ.25 నుంచి 30 వేల వరకు ఆదా చేసుకోగలుగుతాయి. తమ ఇళ్ల పైకప్పులపై ఏర్పరిచిన సౌర పలకల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును వారు అమ్ముకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. దాదాపు కోటిన్నర కుటుంబాలు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నాయి. గుజరాత్ లోని రెండు లక్షల ఇళ్లలో మేడలపై సౌర పలకల్ని ఏర్పరచుకుని విద్యుత్ ఉత్పత్తిలో భాగమడమే కాక అదనపు విద్యుత్తును విక్రయించగలుగుతున్నారు. విద్యుత్ రంగంలో కూడా అమ్రేలి జిల్లా ప్రగతి సాధిస్తోంది. గోవింద్ భాయ్ గారి నేతృత్వంలో ‘దుద్ధ’ గ్రామం దరిదాపు మొత్తం సౌరశక్తినినే వినియోగించే తొలి ‘సోలార్ పవర్ విలేజ్’ గా రూపుదిద్దుకుంటోంది. ఈ గ్రామాన్ని సూర్యఘర్ లేదా సౌర శక్తితో నిర్మితమైన గ్రామంగా తీర్చిదిద్దగలనని గోవింద భాయ్ నాకు ఆరు నెలల కిందట తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు పూర్తికావచ్చింది. కుటుంబానికి నాలుగు వేల రూపాయల చొప్పున, గ్రామం మొత్తం ప్రతినెల దాదాపు రూ. 75 వేల వరకూ విద్యుత్ చార్జీల రూపేణా ఆదా చేసుకోగలుగుతుంది. ‘దుద్ధ’ గ్రామాన్ని తొలి సంపూర్ణ సౌరశక్తి ఆధారిత గ్రామంగా చేసినందుకు గోవింద భాయ్ కీ, అమ్రేలికీ అభినందనలు.
మిత్రులారా నీటి లభ్యతతో పర్యాటకం ముడిపడి ఉంటుదన్న విషయం తెలిసిందే. నీరు పుష్కలంగా లభించే చోట పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. భారత్ మాత సరోవర్ ను చూస్తూండగా నాకు కలిగిన ఆలోచన మీతో పంచుకుంటాను. సాధారణంగా ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించే వలస పక్షులు ఈసారి డిసెంబర్లో తమ గమ్యాన్ని మార్చుకుంటాయేమో! ఫ్లెమింగో పక్షులు ఇక్కడికి వస్తే, వాటిని చూసేందుకు పర్యాటకులూ ఇక్కడికి వస్తారు. ముఖ్యమైన అనేక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలకు అమ్రేలి జిల్లా నెలవు. భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించడం పరిపాటి. సర్దార్ సరోవర్ డాం విషయమే తీసుకోండి. మొదట్లో అది కేవలం నీటి నిల్వ కోసం ఉద్దేశించిన ఆనకట్ట మాత్రమే. అక్కడ ప్రపంచపు అతి ఎత్తు అయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఏటా అయిదు మిలియన్ సందర్శకులను ఆకర్షించే పర్యాటక స్థలంగా రూపుదిద్దుకుంది. ఈ పర్యాటకులు కేవలం డ్యామ్ ను చూసేందుకే కాక, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తారు. సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ అక్టోబర్ 31న జరుగుతాయి. నేను స్వయంగా గుజరాత్ కి వచ్చి సర్దార్ కి నివాళులు అర్పిస్తాను. ఈరోజు నేను ఢిల్లీకి తిరిగి ప్రయాణం అయినా, ఎల్లుండి తిరిగి వచ్చి సర్దార్ సాహెబ్ పాదాలను తాకి నా భక్తిని తెలుపుకుంటాను. సాధారణంగా సర్దార్ పుట్టిన రోజున మనం ‘యూనిటీ రన్’ ని నిర్వహించుకుంటాం. అయితే ఈసారి అక్టోబర్ 31న దీపావళి పండగ కావడంతో ‘యూనిటీ రన్’ తేదీని అక్టోబర్ 29కి మార్చుకుంటున్నాం. గుజరాత్ మొత్తంలో ఐక్యత పరుగు పెద్ద ఎత్తున చేపడతారని ఆశిస్తున్నాను. కేవడియలోని నేషనల్ యూనిటీ కవాతులో నేను పాల్గొంటాను.
మిత్రులారా, రానున్న రోజుల్లో కొత్తగా ప్రారంభించిన కెర్లీ రీచార్జ్ రిజర్వాయర్ పర్యావరణహిత పర్యాటకానికి ముఖ్య కేంద్రంగా మారబోతోంది. పర్యాటకం ద్వారా మనకు చక్కని ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారబోతోంది. సాహస పర్యాటకానికి కూడా ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కర్లీ పక్షుల అభయారణ్యం త్వరలో అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకుంటుంది