ప్రధాన మంత్రి కార్యాలయం
సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
28 OCT 2024 4:58PM by PIB Hyderabad
గౌరవనీయ పెడ్రో సాంచెజ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, విదేశాంగ మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, స్పెయిన్, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎయిర్‌బస్, టాటా బృందాల సభ్యులు, సోదరసోదరీమణులారా!
నమస్కారం!
బ్యూనస్ దియాస్ (శుభోదయం)!
నా మిత్రులు శ్రీ పెడ్రో సాంచెజ్ మొదటిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. నేటి నుండి, భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని సరికొత్త మార్గంలో ముందుకు తీసుకెళుతున్నాం. సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ తయారీ కేంద్రం కేవలం భారత్-స్పెయిన్ సంబంధాలను మాత్రమే కాకుండా, ‘మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అనే మా మిషన్‌ను సైతం బలోపేతం చేస్తుంది. ఎయిర్‌బస్, టాటా బృందాల్లోని సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఇటీవల భారత్ ముద్దుబిడ్డ రతన్ టాటాను కోల్పోయింది. ఆయన జీవించి ఉంటే.. నేడు ఇక్కడ మన మధ్యే ఉండేవారు. ఎక్కడ ఉన్నా ఆయన దీనిని చూసి తప్పకుండా సంతోషిస్తారు.
మిత్రులారా,
సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం భారతదేశపు కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆలోచన నుంచి అమలు వరకు.. ఈ రోజు భారత్ పనిచేస్తున్న వేగం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తయారీ కేంద్ర నిర్మాణాన్ని రెండేళ్ల కిందట అక్టోబరు నెలలో ప్రారంభించాం. అలాగే ఇప్పుడు అక్టోబరులోనే ఇక్కడ విమానాల తయారీకి అంతా సిద్ధమైంది. ప్రణాళిక, అమలులో అనవసర జాప్యాలను నివారించడంపై నేను ఎప్పుడూ దృష్టి సారించాను. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వడోదరలో బొంబార్డియర్ రైలు కోచ్‌ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ తయారీ కేంద్రాన్ని సైతం రికార్డు సమయంలో ఉత్పత్తి కోసం సిద్ధం చేశాం. నేడు ఆ ఫ్యాక్టరీలో తయారైన మెట్రో కోచ్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అలాగే ఈ తయారీ కేంద్రంలో తయారైన విమానాలు కూడా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
ప్రముఖ స్పానిష్ కవి ఆంటానియో మచాడో ఒక సందర్భంలో ఇలా అన్నారు:
“ఓ బాటసారీ, అక్కడ మార్గమేదీ లేదు... నడక ద్వారానే మార్గం తయారైంది”
మన లక్ష్యం వైపు మనం మొదటి అడుగు వేసిన క్షణం, మార్గాలు ఏర్పడడం ప్రారంభమవుతాయని ఇది సూచిస్తుంది. నేడు, భారత్ రక్షణ సంబంధ తయారీ రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఒక దశాబ్దం క్రితం మనం పటిష్ఠమైన చర్యలు చేపట్టడం వల్లే, ఈ రోజు ఇది సాధ్యమైంది. అప్పట్లో భారత్‌లో పెద్ద ఎత్తున రక్షణ తయారీని ఎవరూ ఊహించలేదు. అప్పుడు ప్రాధాన్యాలు, గుర్తింపు దిగుమతులకే పరిమితం అయ్యాయి. మేం మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటి ఫలితాలను ఈ రోజు మనం చూడగలుగుతున్నాం.
మిత్రులారా,
ఏదైనా అవకాశాన్ని శ్రేయస్సుగా మార్చడానికి, సరైన ప్రణాళిక, సరైన భాగస్వామ్యం అవసరం. మార్పు చెందిన భారత రక్షణ రంగ అభివృద్ధి... సరైన ప్రణాళిక, సరైన భాగస్వామ్యానికి చక్కటి ఉదాహరణ. గత దశాబ్దంలో, భారత్‌లో శక్తిమంతమైన రక్షణ రంగాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను దేశం తీసుకుంది. మేం రక్షణ తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాం, ప్రభుత్వ రంగ విభాగాలను సమర్థంగా మార్చాం. ఆయుధ కర్మాగారాలను ఏడు పెద్ద కంపెనీలుగా మార్చాం. డీఆర్డీవో, హెచ్ఏఎల్‌లకు సాధికారత కల్పించాం. అలాగే ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడుల్లో రెండు ప్రధాన రక్షణ కారిడార్లను అభివృద్ధి చేశాం. ఈ కార్యక్రమాలు రక్షణ రంగానికి కొత్త శక్తిని అందించాయి. ఐడీఈఎక్స్ (ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్) వంటి పథకాలు అంకుర సంస్థలకు ఊతమిచ్చాయి. గత 5-6 సంవత్సరాల్లో భారత్‌లో దాదాపు 1,000 కొత్త రక్షణ రంగ అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి. గత పదేళ్లలో భారత్ రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయి. నేడు, మేం ప్రపంచంలోని 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నాం.
మిత్రులారా,
ఈ రోజు మేం భారత్‌లో నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. ఎయిర్‌బస్, టాటాల సంయుక్త నిర్వహణలో ఈ కర్మాగారం భారత్‌లో వేలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా 18 వేల విమాన విడిభాగాలను దేశీయంగా తయారు చేయనున్నాం. ఒక భాగం దేశంలోని ఒక ప్రాంతంలో తయారైతే, మరో భాగం మరో చోట తయారు చేయవచ్చు. అయితే ఈ భాగాలను ఎవరు తయారు చేస్తారు? మా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఈలు) నాయకత్వంలో ఈ విడిభాగాలు తయారు కానున్నాయి. మేం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమాన కంపెనీలకు విడిభాగాల అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకరిగా ఉన్నాం. ఈ కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం భారత్‌లో కొత్త నైపుణ్యాలు, కొత్త పరిశ్రమలకు ఊతం ఇస్తుంది.
మిత్రులారా,
కేవలం రవాణా విమానాల తయారీని మించినదిగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను. గత దశాబ్దంలో, మీరు భారత విమానయాన రంగంలో అపూర్వమైన వృద్ధిని, మార్పును చూశారు. దేశవ్యాప్తంగా వందలాది చిన్న నగరాలను అనుసంధానిస్తూ విమానయానాన్ని విస్తరిస్తున్నాం. విమానయానం, ఎమ్ఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) కేంద్రంగా భారత్‌ను నిలిపేందుకు మేం కృషి చేస్తున్నాం. ఇది భవిష్యత్తులో 'మేడ్ ఇన్ ఇండియా' పౌర విమానాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. వివిధ భారత విమానయాన సంస్థలు 1,200 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. అంటే భవిష్యత్తులో, ఈ తయారీ కేంద్రం భారత్‌తో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేందుకు పౌర విమానాల రూపకల్పన, తయారీలో కీలకం కానుంది.
మిత్రులారా,
భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో వడోదర నగరం ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. ఈ నగరం ఇప్పటికే ఎమ్ఎస్ఎమ్ఈల కోసం బలమైన కేంద్రంగా ఉంది. అలాగే గతి శక్తి విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఉంది. ఈ విశ్వవిద్యాలయం వివిధ రంగాల నిపుణులను సిద్ధం చేస్తోంది. ఫార్మా రంగం, ఇంజనీరింగ్-భారీ యంత్రాలు, రసాయనాలు-పెట్రోకెమికల్స్, విద్యుత్-ఇంధన పరికరాలకు సంబంధించిన అనేక కంపెనీలు వడోదరలో ఉన్నాయి. ఇప్పుడు, ఈ ప్రాంతమంతా భారత్‌లో విమానాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారనుంది. ఆధునిక పారిశ్రామిక విధానాలు, నిర్ణయాలతో ముందుకు సాగుతున్న గుజరాత్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ అలాగే అతని మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
వడోదరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్‌లో వారసత్వ నగరంగా, ఒక ముఖ్యమైన సాంస్కృతిక నగరంగా ఉంది. అందువల్ల స్పెయిన్ నుంచి మీ అందరినీ ఇక్కడికి స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. భారత్, స్పెయిన్ సాంస్కృతిక సంబంధాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. స్పెయిన్ నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన ఫాదర్ కార్లోస్ వాలెస్ తన యాభై ఏళ్ల జీవితం ఇక్కడే గడిపి, తన ఆలోచనలు, రచనల ద్వారా మన సంస్కృతిని సుసంపన్నం చేసిన విషయం నాకు గుర్తుంది. ఆయన్ని అనేకసార్లు కలుసుకోవడం నా అదృష్టం. ఆయన చేసిన విశేష సేవలకుగాను మేం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకున్నాం. గుజరాత్‌లో, మేం అతనిని ప్రేమగా ఫాదర్ వాలెస్ అని పిలిచేవాళ్లం. ఆయన గుజరాతీలో రచనలు చేసేవారు. అతని పుస్తకాలు గుజరాతీ సాహిత్యాన్ని, మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశాయి.
మిత్రులారా,
స్పెయిన్‌లో యోగా బాగా ప్రాచుర్యం పొందిందని నేను విన్నాను. భారత అభిమానులు కూడా స్పెయిన్ ఫుట్‌బాల్‌ను ఆరాధిస్తారు. రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మధ్య నిన్న జరిగిన మ్యాచ్ భారత్‌లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. బార్సిలోనా అద్భుతమైన విజయం గురించి కూడా ఇక్కడ విస్తృత చర్చ జరిగింది. భారత్‌లోని రెండు క్లబ్బుల అభిమానులు స్పెయిన్ ప్రజల్లాగే అత్యంత అభిరుచితో ఆటనను ఆస్వాదిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను.
మిత్రులారా,
ఆహారం, చలనచిత్రాలు, ఫుట్‌బాల్-ఈ అంశాలన్నీ మన ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాల్లో భాగంగా ఉన్నాయి. 2026 సంవత్సరాన్ని భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, ఏఐ సంవత్సరంగా జరుపుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించడం నాకు సంతోషం కలిగించింది.
మిత్రులారా,
భారత్, స్పెయిన్ భాగస్వామ్యం ఒక పట్టకం (ప్రిజం) లాంటిది, ఇది బహుమితీయమైనది, శక్తిమంతమైనది అలాగే నిరంతరం అభివృద్ధి చెందుతుంది. నేటి కార్యక్రమం భారత్, స్పెయిన్ మధ్య అనేక కొత్త ఉమ్మడి సహకార ప్రాజెక్టులకు స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నేను స్పానిష్ పారిశ్రామికవేత్తలను, ఆవిష్కర్తలను కూడా భారత్‌కు రావాలని, మా అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
***
(Release ID: 2069056)
Visitor Counter : 35
Read this release in:
Odia
,
Tamil
,
Hindi
,
English
,
Urdu
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam