ప్రధాన మంత్రి కార్యాలయం
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి
ఆరోగ్య రంగానికి చెందిన రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన ప్రారంభోత్సవం, శంకుస్థాపన
70, ఆపైన వయసున్న వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై వర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ఊతమిస్తూ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
భారతదేశపు మొదటి 'అఖిల భారత ఆయుర్వేద సంస్థ' రెండో దశను ప్రారంభించనున్న ప్రధాని
ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్నమైన సాంకేతిక వినియోగం...
11 స్పెషాలిటీ ఆరోగ్య కేంద్రాల్లో డ్రోన్ సేవలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు డిజిటల్ కార్యక్రమాలకు ప్రోత్సాహం.. గర్భిణీలు, శిశువులకు ప్రయోజనం చేకూర్చే టీకా ప్రక్రియను నమోదు చేసే 'యు-విన్' పోర్టల్‌ను ప్రారంభించనున్న ప్రధాని
మేక్ ఇన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ కోసం పిఎల్‌ఐ పథకం కింద
అయిదు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్ అండ్ డి, పరీక్షా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే
అన
Posted On:
28 OCT 2024 12:47PM by PIB Hyderabad
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై)కి ప్రధాన జోడింపుగా...70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఆరోగ్య పథకాన్ని వర్తింప చేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది వారి ఆదాయంతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ ఆరోగ్య సంరక్షణను అందించడానికి సహాయపడుతుంది.
దేశమంతటా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నం. దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలకు గొప్ప ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి బహుళ ఆరోగ్య సంరక్షణ సంస్థల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
దేశంలోనే మొదటి 'అఖిల భారత ఆయుర్వేద సంస్థ' రెండో దశను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఇందులో పంచకర్మ ఆసుపత్రి, ఔషధాల తయారీకి ఆయుర్వేద ఫార్మసీ, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, ఐటీ, ఆంకుర సంస్థల కోసం ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్ల ఆడిటోరియం ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్, నీముచ్, సియోని లో మూడు వైద్య కళాశాలలను కూడా ఆయన ప్రారంభిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి, బీహార్‌లోని పాట్నా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్, అస్సాంలోని గౌహతిలో ఉన్న వివిధ ఎయిమ్స్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సేవల విస్తరణ, జన్ ఔషధి కేంద్రాలను ఆయన ప్రారంభిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను, ఒడిశాలోని బార్‌గఢ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లోని శివపురి, రత్లాం, ఖాండ్వా, రాజ్‌గఢ్, మందసౌర్‌లో అయిదు నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్) కింద హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, తమిళనాడు, రాజస్థాన్‌లో 21 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, న్యూఢిల్లీలోని, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ లో అనేక సౌకర్యాలు, సేవల విస్తరణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
ప్రధానమంత్రి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. హర్యానాలోని ఫరీదాబాద్, కర్నాటకలోని బొమ్మసంద్ర, నరసాపూర్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంలో ఈఎస్ఐసి ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు దాదాపు 55 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తాయి.
రంగాల వారీగా సేవలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తరించాలన్నది ప్రధానమంత్రి భావిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికీ, సేవలను మరింత మెరుగుపరచడానికీ- డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. 11 స్పెషాలిటీ ఆరోగ్య కేంద్రాల్లో డ్రోన్ సేవలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ , తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, అస్సాంలోని గౌహతి ఎయిమ్స్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిమ్స్, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఎయిమ్స్, బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ , హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ ఎయిమ్స్ , ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎయిమ్స్, ఛత్తీస్‌గఢ్ లోని రాయపూర్ ఎయిమ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్, మణిపూర్‌లోని ఇంఫాల్ రిమ్స్ లలో డ్రోన్ సేవల్ని ప్రారంభిస్తారు. రిషికేష్ ఎయిమ్స్ నుండి హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది వేగవంతమైన వైద్య సంరక్షణను అందించడంలో సహాయపడుతుంది.
ప్రధానమంత్రి యు-విన్ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. టీకా ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా గర్భిణీలు, శిశువులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది 12 టీకా-నివారణ వ్యాధులకు గాను గర్భిణీలు, పిల్లలకు (పుట్టుక నుండి 16 సంవత్సరాల వరకు) ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లను సకాలంలో అందించడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఇనిస్టిట్యూట్ల కోసం ప్రధానమంత్రి ఒక పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఇది ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఇనిస్టిట్యూట్ల కేంద్రీకృత డేటాబేస్‌గా పని చేస్తుంది.
దేశంలో ఆరోగ్య సంరక్షణ విస్తార వ్యవస్థను మెరుగుపరచడానికి పరిశోధన, అభివృద్ధి, టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని గోతపట్నలో సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఒడిశాలోని ఖోర్ధా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో యోగా, నేచురోపతిలో రెండు సెంట్రల్ రీసెర్చ్ సంస్థలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. వైద్య పరికరాల కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఎన్ఐపీఈఆర్ లో, బల్క్ డ్రగ్స్ కోసం తెలంగాణలో హైదరాబాద్ ఎన్ఐపీఈఆర్ లో, ఫైటో ఫార్మాస్యూటికల్స్ కోసం అస్సాంలోని గౌహతి ఎన్ఐపీఈఆర్ లో, యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ డ్రగ్ పరిశోధన-అభివృద్ధి కోసం పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న ఎన్ఐపీఈఆర్ లో నాలుగు ఉన్నత ప్రమాణాలతో కూడిన కేంద్రాలకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో నాలుగు ఆయుష్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు, అవి- మధుమేహం, జీవ క్రియ రుగ్మతల కోసం ఉన్నత ప్రమాణాలతో కూడిన కేంద్రాలు; ఇక ఐఐటీ ఢిల్లీలో రసౌషధీల కోసం అధునాతన సాంకేతిక పరిష్కారాలు, అంకురాలకు మద్దతు, పర్యావరణ హిత పరిష్కారాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్; అలాగే లక్నోలో ఆయుర్వేదంలో ప్రాథమిక, అనువాద పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్; న్యూ ఢిల్లీలోని జేఎన్ యులో ఆయుర్వేదం, సిస్టమ్స్ మెడిసిన్‌పై ఎక్సలెన్స్ సెంటర్.
హెల్త్‌కేర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రధాన ప్రోత్సాహకంగా... గుజరాత్‌లోని వాపి, తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగర్లో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) పథకం కింద అయిదు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ యూనిట్లు ముఖ్యమైన బల్క్ డ్రగ్స్‌తో పాటు బాడీ ఇంప్లాంట్లు, క్రిటికల్ కేర్ పరికరాలు వంటి అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తాయి.
పౌరులలో ఆరోగ్య అవగాహనను పెంపొందించే లక్ష్యంతో “దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్” అనే దేశవ్యాప్త ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఇది వాతావరణాన్ని తట్టుకునే ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడానికి అనుసరణ వ్యూహాలను రూపొందిస్తుంది.
(Release ID: 2069055)
Visitor Counter : 77
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam