సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం: డాక్టర్ ఎల్. మురుగన్
ఆకాంక్షా భారత్ కోసం కృత్రిమ మేధ: ఉత్పాదకతను పెంపొందించడానికి, పాలనను మెరుగుపర్చేందుకు కృత్రిమ మేధ సాధనాలను స్వీకరించాలని కోరిన డాక్టర్ ఎల్. మురుగన్
Posted On:
25 OCT 2024 2:23PM by PIB Hyderabad
కర్మయోగి వారోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా జాతీయ అభ్యాస వారోత్సవాల బహుమతి ప్రధానోత్సవం, ఐజీఓటీ ల్యాబ్, అభ్యాస కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ హాజరయ్యారు.
సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్మయోగి సప్తాహ్ – జాతీయ అభ్యాస వారోత్సవం (ఎన్ఎల్‌డబ్ల్యూ)
కర్మయోగి సప్తాహ్ – జాతీయ అభ్యాస వారోత్సవం (ఎన్ఎల్‌డబ్ల్యూ) భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని స్థాయుల్లో ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రాపంచిక దృక్పథంతో భారతీయ విలువలు నిండిన శ్రామిక శక్తిని రూపొందించే అవసరాన్ని ఈ వారోత్సవాలు స్పష్టం చేస్తాయి.
ఈ సందర్భంగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ, 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడంలో అలాగే రెండు కోట్ల ఇరవై లక్షలకు పైగా రాష్ట్ర స్థాయి ఉద్యోగులు, 50 లక్షలకు పైగా పట్టణ స్థానిక సంస్థల (యుఎల్బీ) అధికారులకు నిరంతర అభ్యాసాన్ని అందుబాటులోకి తేవడంలో ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం శాశ్వత, ఒప్పంద ఉద్యోగుల కోసం సమాన అవకాశాలను కల్పిస్తుందనీ, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా జీవితకాల అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.
ఐజీఓటీ ల్యాబ్: అభ్యాసాన్ని ప్రోత్సహించడం
సోషల్ మీడియా వినియోగం, చలన చిత్రాలను చూడడంలో వచ్చిన మార్పులు, ఫోటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరచడం గురించి మంత్రిత్వ శాఖ మూడు వెబినార్లను నిర్వహించిందని డాక్టర్ ఎల్. మురుగన్ తెలిపారు. కార్యాలయ విధానాలు, జెండర్ సెన్సిటివిటీ, నాయకత్వం మొదలైనటువంటి కీలకాంశాలను కవర్ చేస్తూ ఐజీఓటీ పోర్టల్‌లో కనీసం నాలుగు గంటల శిక్షణను ఉద్యోగులంతా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటును నిరంతర అభ్యసాన్ని ప్రోత్సహించే ఒక గొప్ప చర్యగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న వినూత్న విధానాన్ని ప్రశంసించారు.
ఆకాంక్షా భారత్ కోసం కృత్రిమ మేధ
ఆకాంక్షా భారత్ లక్ష్య సాధన కోసం కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్పాదకతను పెంచడం కోసం ఏఐ సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖను డాక్టర్ ఎల్. మురుగన్ కోరారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, పునరావృతమయ్యే పనుల భారాన్ని తగ్గించడానికి చాట్జిపిటి, జెమిని వంటి ఏఐ సాధనాలను ఉపయోగించుకోవాలన్నారు. ఏఐ ద్వారా పొందిన డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు తమ విభాగాల్లో మెరుగైన సేవలు, ఆవిష్కరణలకు భరోసానిస్తూ అధిక ప్రభావవంతమైన పాలనాంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
పౌర-కేంద్రిత పాలనను ప్రోత్సహించడానికి ప్రవర్తన సంబంధిత కోర్సులపై దృష్టి సారించాలని ఆయన కోరారు. మెరుగైన సేవలందించుటకు ఫిర్యాదులను సమర్థంగా పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను డాక్టర్ ఎల్. మురుగన్ ప్రధానంగా ప్రస్తావించారు.
***
(Release ID: 2068297)
Visitor Counter : 20