సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వైవిధ్యభరితమైన ఆస్ట్రేలియా చలనచిత్ర సంప్రదాయాలకు ఇఫీ 2024లో ప్రత్యేక గౌరవం
55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘కంట్రీ ఆఫ్ ఫోకస్’ గా ఆస్ట్రేలియా చిత్రరంగంపై ప్రత్యేక దృష్టి
పరస్పర సహకార అవకాశాలను ‘ఫిల్మ్ బజార్’లో సమీక్షించనున్న
భారత్-ఆస్ట్రేలియా సంయుక్త నిర్మాణ మండలి
ఇఫీ 2024లో ఆస్కార్ అవార్డు విజేత, ఛాయాగ్రాహకుడు జాన్ సీల్
‘మాస్టర్ క్లాస్’ నిర్వహణ
నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవా పనాజీ వేదికగా జరగబోయే 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో, ‘కంట్రీ ఆఫ్ ఫోకస్’ గా ఆస్ట్రేలియా ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలియచేసింది. అద్భుతమైన కథనరీతులు, చైతన్యవంతమైన సినిమా సంస్కృతి , వినూత్నమైన సాంకేతిక పద్ధతుల ద్వారా ప్రపంచ సినిమా రంగాన్ని సుసంపన్నం చేసినందుకు, ఆస్ట్రేలియా చిత్రరంగానికి ఈ ప్రత్యేక గౌరవం దక్కుతోంది. గతంలో కుదిరిన ఒప్పందం మేరకు, ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియాలు ఆడియో విజువల్ రంగంలో కలిసి పనిచేస్తున్నాయి.
ఇఫీ లో ‘కంట్రీ ఆఫ్ ఫోకస్’
ఇఫీ వేడుకల్లో కీలక భాగమైన ‘కంట్రీ ఆఫ్ ఫోకస్’ విభాగంలో, ఎంపికైన దేశానికి చెందిన సమకాలీన ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తారు. వైవిధ్యమైన సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన ప్రఖ్యాత ఆస్ట్రేలియా సినీ కళాకారులు, ప్రపంచ సినీరంగంపై బలమైన ముద్ర వేశారు. ఈ కృషికి గుర్తింపుగానూ, భారత్ ఆస్ట్రేలియా చిత్రరంగాల మధ్య పెరుగుతున్న సహకారానికీ, ‘కంట్రీ ఆఫ్ ఫోకస్’ ఎంపిక తార్కాణంగా నిలుస్తోంది.
ఆస్ట్రేలియా చిత్రాల ప్రదర్శన:
కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రాలూ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న డాక్యుమెంటరీలూ, నాటకీయత మెండుగా ఉన్న సినిమాలూ, కన్నులపండుగగా నిలిచే థ్రిల్లర్లు సహా విభిన్న అంశాలతో కూడిన ఏడు సినిమాలను ప్రత్యేక ప్రదర్శన కోసం ఇఫీ ఎంపిక చేసింది. ఈ సినిమాలు ఆస్ట్రేలియా ప్రాచీన సమూహాల జీవితాలనే కాక ఆధునిక సమాజాల సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి.
ఫిలిమ్ బజార్ లో భాగస్వామ్యం
ఇఫీతో పాటూ నిర్వహిస్తున్న ‘ఫిలిమ్ బజార్’, దక్షిణాసియాలోనే అతిపెద్ద చలనచిత్ర విపణి. ఇందులో, ‘స్క్రీన్ ఆస్ట్రేలియా’, రాష్ట్ర చలనచిత్ర కమిషన్లూ, ‘ఆస్ ఫిల్మ్’ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. సినిమా చిత్రీకరణలకు ఆస్ట్రేలియా ఉత్తమ గమ్యస్థానమని ప్రచారం చేస్తున్న సంస్థ ‘ఆస్ ఫిల్మ్’. ఫిలిమ్ బజార్ లో ప్రత్యేకంగా కేటాయించిన ‘ఫిలిమ్ ఆఫీస్ ఎగ్జిబిషన్’ ప్రాంతంలో ఈ సంస్థలన్నీ తమ ప్రచారాన్ని సాగిస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించే నిర్మాతల ప్రతినిధి బృందంలోని ఆరుగురికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తుంది. వీరు ఫిలిమ్ బజార్ లో సహ నిర్మాతలుగా మెలిగే అవకాశాలనూ, ఇతర అవకాశాలనూ పరిశీలిస్తారు. ఇరుదేశాలకూ చెందిన నిర్మాత, దర్శకులు ప్రత్యేక ‘ఆస్ట్రేలియా కో-ప్రొడక్షన్’ కార్యక్రమం ద్వారా కలుసుకుని పరస్పర సహకారానికి గల అవకాశాలను చర్చిస్తారు. ‘కో-ప్రొడక్షన్ మార్కెట్’ కోసం ఫిలిమ్ బజార్ ‘హోం బిఫోర్ నైట్’ ఆస్ట్రేలియా చిత్రాన్ని అధికారిక ఎంట్రీగా ఎన్నుకుంది.
భారత్-ఆస్ట్రేలియా చిత్రరంగ సంయుక్త నిర్మాణ మండలి
ఇరుదేశాల చిత్రరంగాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని గుర్తించే ‘నాలెడ్జ్ సిరీస్’ నిపుణుల చర్చా కార్యక్రమంలో, సినిమా నిర్మాణంలో సహకారానికి గల అవకాశాలు ప్రధానాంశం కానుంది. ఇరుదేశాల నిర్మాతలూ, సినీ ప్రముఖులూ పాల్గొనే ఈ కార్యక్రమంలో, సహ నిర్మాణంలో గల సాధకబాధకాలూ, విజయాలు దక్కించుకున్న ప్రాజెక్టులను గురించి ప్రసంగాలుంటాయి.
ఛాయాగ్రాహకుడు జాన్ సీల్ ‘మాస్టర్ క్లాస్’ నిర్వహణ
ఆస్కార్ అవార్డు విజేత, ఛాయాగ్రాహకుడు జాన్ సీల్ ‘మాస్టర్ క్లాస్’ నిర్వహణ ఇఫీ 2024లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ‘మ్యాడ్ మ్యాక్స్:ఫ్యూరీ రోడ్’, ‘ఇంగ్లీష్ పేషంట్’ వంటి చిత్రాలు జాన్ సీల్ అసమాన ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. చిత్ర జగత్తులో జాన్ సీల్ ప్రయాణాన్ని స్పృశిస్తూ సాగే ఈ కార్యక్రమంలో ఔత్సాహిక కళాకారులు అనేక సాంకేతిక మెళకువలను తెలుసుకుంటారు.
***
(Release ID: 2067519)
Visitor Counter : 26
Read this release in:
Malayalam
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Tamil
,
Kannada