ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
22 OCT 2024 10:32PM by PIB Hyderabad
కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ ఏడాది వారిరువురూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నాయకులిద్దరూ ఒకసారి సమావేశమయ్యారు.
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. బ్రిక్స్‌కు రష్యా నాయకత్వాన్ని ప్రశంసించారు. బహుముఖీనతను పటిష్ఠం చేయడానికి, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో పాలనాపరమైన సంస్కరణలను ముందుకు నడిపించడానికి రష్యా చేసిన కృషిని ప్రధాని అభినందించారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని నాయకులిద్దరూ సమీక్షించారు. అలాగే ఉభయ దేశాల పౌరుల మధ్య పటిష్ఠమైన అనుబంధం నెలకొనేలా చేయడానికి చేస్తున్న కృషిని కూడా సమీక్షించారు. నవంబరులో న్యూఢిల్లీలో జరుగనున్న వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాల భారత రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమావేశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు.
బ్రిక్స్ సహా విభిన్న బహుముఖ వేదికలపై భారత-రష్యా సహకారం పట్ల ఉభయులు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ సంఘర్షణ సహా పరస్పర ఆసక్తి గల కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నాయకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచంలో సంఘర్షణ నివారణకు చర్చలు, దౌత్యమే అత్యుత్తమ మార్గమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ఉభయ దేశాల మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం చక్కగా పురోగమిస్తున్నదంటూ ప్రపంచంలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ అస్థిరతలను కూడా తట్టుకుని బలంగా నిలిచిందని నాయకులిద్దరూ అభిప్రాయపడ్డారు. ఆ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి కృషిని కొనసాగించాలని అంగీకరించారు.
వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రావాలని అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని ఆహ్వానించారు.
***
(Release ID: 2067305)
Visitor Counter : 28
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam