వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఫోర్టిఫైడ్ బియ్యం: సూక్ష్మపోషక లోపాలను ఎదుర్కోవడానికి కేంద్రం ప్రతిష్ఠాత్మక నిర్ణయం
ఐరన్ తో కూడిన బలవర్థకమైన బియ్యానికి పరిశోధనల మద్దతు
బలవర్ధక విధానానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు పాటిస్తున్న భారత్
మొత్తం వినియోగంలో ఉన్న 30 వేల రైస్ మిల్లుల్లో 21 వేల పైచిలుకు మిల్లుల్లో బ్లెండింగ్ పరికరాలు,
నెలకు ఎగుమతి సామర్థ్యం 223 లక్షల మెట్రిక్ టన్నులు
Posted On:
17 OCT 2024 5:15PM by PIB Hyderabad
జూలై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై), ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ (బలవర్ధక) బియ్యాన్ని అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో సూక్ష్మ పోషకాహార లోపాలను ఎదుర్కోవటానికి, పరిపూరకరమైన వ్యూహంగా కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని కొనసాగించనుంది.
తలసేమియా, సికిల్ సెల్ రక్తహీనత వంటి హిమోగ్లోబిన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారితో సహా ప్రజలందరికీ ఈ బలవర్థకమైన బియ్యం వాడకం సురక్షితమని శాస్త్రీయ ఆధారాలు నిరూపించాయి.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్) నిబంధన- 2018 ప్రకారం- భారతదేశంలో బలవర్థకమైన బియ్యం ప్యాక్ పై తలసేమియా, సికిల్ సెల్ రక్తహీనత ఉన్న వ్యక్తులకు ఆరోగ్య సలహాను కలిగి ఉండాలి. ప్యాకేజింగ్పై మరే ఇతర దేశం ఇలాంటి సలహా ఇవ్వడాన్ని పాటించడంలేదని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా, హిమోగ్లోబిన్ వ్యాధిగ్రస్తులకు ఇనుముతో కూడిన బలవర్థకమైన బియ్యం- భద్రత అన్న అంశాన్ని అంచనా వేయడానికి 2023 లో భారత ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ విభాగం- ఒక వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది.
ప్రస్తుత సాక్ష్యాలు హీమోగ్లోబిన్ వ్యాధి కలిగిన వ్యక్తులకు ఎటువంటి భద్రతా ఆందోళనలకు మద్దతు ఇవ్వవని వర్కింగ్ గ్రూప్ నివేదిక తేల్చింది. తలసేమియా రోగులకు రక్త మార్పిడి సమయంలో గ్రహించిన ఇనుముతో పోలిస్తే బలవర్థకమైన బియ్యం నుండి ఇనుము తీసుకోవడం చాలా తక్కువ. ఇనుము అధికంగా ఉన్నప్పుడు కీలేషన్ ద్వారా చికిత్స చేస్తారు. ఇంకా, సికిల్ సెల్ రక్తహీనత ఉన్నవారు ఇనుము శోషణను నియంత్రించే హార్మోన్ అయిన హెప్సిడిన్ సహజంగా పెరిగిన స్థాయుల కారణంగా అదనపు ఇనుమును గ్రహించే అవకాశం లేదు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని కమిటీ ఈ అంశాలపై విస్తృత సమీక్ష నిర్వహించింది. హెమటాలజీ, పోషకాహార, ప్రజారోగ్య నిపుణులతో కూడిన కమిటీ ఇనుము జీవక్రియ, బలవర్థకమైన బియ్యం నుండి ఇనుము మోతాదులు, అంతర్జాతీయ లేబులింగ్ పద్ధతులపై సమగ్ర సమీక్షను నిర్వహించింది.
ఈ అంతర్జాతీయ శాస్త్రీయ సమీక్ష ఆధారంగా ఇనుము-బలవర్థకమైన బియ్యం ఈ హిమోగ్లోబిన్ వ్యాధి ఉన్నవారికి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందనే ఆధారాలు కనిపించలేదు. భారతదేశంలో గిరిజన ప్రాంతాల నుండి 8 వేల మందికి పైగా పాల్గొన్న ఒక పెద్ద సమూహ అధ్యయనంలో- సికిల్ సెల్ వ్యాధి ఉన్న రోగులలో మూడింట రెండు వంతుల మంది ఇనుము లోపాన్ని ఎదుర్కొన్నట్లు అధ్యయనంలో తేలింది. సికిల్ సెల్ రక్తహీనత లేదా తలసేమియా వ్యాధి గ్రస్తులు బలవర్థకమైన బియ్యం తినడం వల్ల కలిగే హాని గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు.
డబ్ల్యూహెచ్ఓ, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు కూడా ప్యాకేజింగ్ పై ఇలాంటి సలహాలు ఇవ్వకపోవడం గమనార్హం.
దేశంలో, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోర్టిఫైడ్ (బలవర్థక) బియ్యం పంపిణీ జరిగింది. ప్రతి రాష్ట్రంలో 2,64,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. అధిక ఇనుము సంబంధించిన ప్రతికూల ఆరోగ్య ఫలితాలు నమోదు కాలేదు. సలహాను తొలగించాలని కమిటీ చేసిన సిఫార్సును ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది.
ఈ సలహాను తొలగించాలని కమిటీ సిఫారసు చేయగా... ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అంగీకరించింది. ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో ఆమోదించిన తర్వాత 2024 జూలైలో ఈ సలహాను అధికారికంగా తొలగించారు.
భారత్ లో రైస్ ఫోర్టిఫికేషన్ కార్యక్రమాన్ని 2019లో ప్రయోగాత్మక కార్యక్రమంగా ప్రారంభించి మూడు దశల్లో విస్తరించారు. ఫోర్టిఫికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పద్ధతి. భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు అనుసరిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ 2018 లో చేసిన సిఫార్సుల ప్రకారం, బియ్యం ప్రధాన ఆహారంగా ఉన్న దేశాలలో ఇనుముతో బియ్యం ఫోర్టిఫికేషన్ అవసరం. దేశంలో, దాని జనాభాలో 65% మంది ప్రతిరోజూ బియ్యం తింటున్నారు. ఇనుము-బలవర్థకమైన బియ్యం ప్రధానంగా ఆవశ్యకమైనవి.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఏటా 520 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్ధకమైన బియ్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,023 తయారీ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 111 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది పథకానికి అవసరమైన 5.20 ఎల్ఎంటీ కంటే గణనీయంగా ఎక్కువ. అదనంగా, ఏడాదికి 75 ఎల్ఎంటీ సామర్థ్యంతో 232 ప్రీమిక్స్ సరఫరాదారులు ఉన్నారు, ఇది అవసరమైన 0.104 ఎల్ఎంటిని మించి ఉంది.
భారతదేశంలో బియ్యం ఫోర్టిఫికేషన్ కోసం వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. అందుబాటులో ఉన్న 30 వేల రైస్ మిల్లులలో, 21 వేల కంటే ఎక్కువ బ్లెండింగ్ పరికరాలు ఏర్పాటు చేశాయి, ఇవి నెలకు 223 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్థకమైన బియ్యం సామర్థ్యం కలిగి ఉన్నాయి. పరీక్షించే మౌలిక సదుపాయాల సామర్థ్యం కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా అనేక ఎన్ఎబిఎల్-గుర్తింపు పొందిన ప్రయోగశాలలు బలవర్థకమైన బియ్యంలో నాణ్యత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
బియ్యం ఫోర్టిఫికేషన్ విధానానికి ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ మద్దతు లభిస్తోంది. గ్లోబల్ ఫోర్టిఫికేషన్ డేటా ఎక్స్ఛేంజ్ ప్రకారం 18 దేశాలు బియ్యం ఫోర్టిఫికేషన్ ను అనుమతిస్తున్నాయి. 147 దేశాలు ఉప్పు ఫోర్టిఫికేషన్ కు మద్దతిస్తున్నాయి. 105 దేశాలు గోధుమ పిండి ఫోర్టిఫికేషన్ ను స్వీకరించాయి. 43 దేశాలు నూనెల ఫోర్టిఫికేషన్‌ను సమర్థిస్తున్నాయి. 21 దేశాలు మొక్కజొన్న పిండి ఫోర్టిఫికేషన్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ దేశాలలో తలసేమియా లేదా సికిల్ సెల్ రక్తహీనత ఉన్నవారికి సలహా లేబుళ్లు అవసరం లేదు.
***
(Release ID: 2065963)
Visitor Counter : 77