ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన


రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రారంభోత్సవం;

నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాపన;

షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవనానికి శంకుస్థాపన;

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్-ముంబయితోపాటు మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి ప్రారంభోత్స‌వం;

మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టుల ప్రారంభంతో మౌలిక సదుపాయాల మెరుగుదల.. అనుసంధానం పెంపు సహా యువతకు సాధికారత సిద్ధిస్తుంది: ప్రధానమంత్రి

Posted On: 09 OCT 2024 3:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ  మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ  ప‌నుల‌కు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్స‌వం చేశారు.

 ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- మహారాష్ట్రకు అనేక విలువై కానుకలు ఇస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాగ్‌పూర్ విమానాశ్రయం ఆధునికీకరణ, షిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం సహా 10 కొత్త వైద్య కళాశాలల వంటి కీలక మౌలిక సదుపాయాలు సమకూరగలవంటూ- ఇందుకుగాను రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.

ఇటీవలి తన ముంబయి, థానె నగరాల పర్యటన సందర్భంగా రూ.30,000 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులను వివిధ జిల్లాల పరిధిలో ప్రారంభించానని ప్రధాని గుర్తుచేశారు. వీటిలో మెట్రో నెట్‌వర్క్ విస్తరణ, విమానాశ్రయాల ఆధునికీకరణ, రహదారి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, టెక్స్‌టైల్ పార్కులు వంటి వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులున్నాయని వివరించారు. రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టామని శ్రీ మోదీ చెప్పారు. అంతేగాక వడవాన్ రేవు నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా దేశంలోనే అతిపెద్ద కంటైనర్ నౌకాశ్రయం మహారాష్ట్రలో రూపుదిద్దుకోనుందని తెలిపారు. ‘‘ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత వేగంగా... ఇంత భారీగా వివిధ రంగాల్లో ప్రగతి మునుపెన్నడూ కనీవినీ ఎరుగం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇటీవల ‘మరాఠీ’కి ప్రాచీన భాషగా గుర్తింపు ఇవ్వడాన్ని గుర్తుచేస్తూ- ఒక భాషకు సముచిత గౌరవం లభిస్తే, అది ఆ భాషకు మాత్రమేగాక ఆ తరానికంతటికీ గళమిచ్చినట్లు కాగలదని ప్రధాని అన్నారు. ఈ గుర్తింపుతో కోట్లాది మరాఠీ సోదరుల కల నెరవేరిందని, రాష్ట్ర ప్రజలంతా వేడుక చేసుకున్నారని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే అనేక గ్రామాల ప్రజల నుంచి హర్షామోదాలు వెలిబుచ్చుతూ తనకు కృతజ్ఞత సందేశాలు వెల్లువెత్తాయని ఆయన తెలిపారు. అయితే, మరాఠీకి ప్రాచీన భాషగా గుర్తింపు లభించడం తన ఘనత కాదని, మహారాష్ట్ర ప్రజల ఆశీస్సుల ఫలితమని వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహనీయుల దీవెనలతోనే మహారాష్ట్రలో ప్రగతి పరుగులు తీస్తున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
హర్యానా, జమ్ముకశ్మీర్‌ శాసనసభల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో- హర్యానా ఓటర్లు దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించే తీర్పు ఇచ్చారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ మేరకు వరుసగా మూడోసారి తమ పార్టీ ప్రభుత్వం విజయం సాధించడం చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.
విచ్ఛిన్న రాజకీయాలతో స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను తప్పుదోవ పట్టించే వారి విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. దేశంలోని ముస్లింలలో భయాందోళనలు రేకెత్తించి, వారిని ఓటుబ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలను గమనించాలని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా రాజకీయ ప్రయోజనమే పరమావధిగా హిందూ మతంలో కులతత్వం రెచ్చగొట్టడం జుగుప్సా కరమని విమర్శించారు. ఇలాంటి చర్యలతో హిందూ సమాజ విచ్ఛిన్నానికి యత్నించేవారి విషయంలో జాగరూకత అవసరమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సమాజ విచ్ఛిన్నం దిశగా కుయుక్తులను మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించగలరని విశ్వాసం వెలిబుచ్చారు.
   దేశాభివృద్ధికి అవిరళ కృషిలో భాగంగా గ‌డచిన పదేళ్లలో ప్ర‌భుత్వం అత్యాధునిక మౌలిక స‌దుపాయాల‌ కల్పనకు ‘మ‌హా యజ్ఞం’ ప్రారంభించిందని ప్ర‌ధానమంత్రి అన్నారు. రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ- ‘‘మేమివాళ కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన ఒక్కటే కాదు... ఆరోగ్యకర, సుసంపన్న మహారాష్ట్రకు పునాది కూడా వేస్తున్నాం’’ అన్నారు. థానె, అంబర్‌నాథ్, ముంబయి, నాసిక్, జల్నా, బుల్దానా, హింగోలి, వాషిమ్, అమరావతి, భంక్‌దారా, గడ్చిరోలి జిల్లాలు సేవా కేంద్రాలుగా మారుతాయన్నారు. తద్వారా లక్షలాది ప్రజల జీవితాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 10 కొత్త వైద్య కళాశాలల వల్ల 900 అదనపు సీట్లతో రాష్ట్రంలో మొత్తం 6000 సీట్లు అందుబాటులోకి వస్తాయని ప్రధాని విశదీకరించారు. ఎర్రకోట పైనుంచి తన ప్రసంగం సందర్భంగా వైద్య విద్యలో 75,000 సీట్లను అదనంగా చేర్చడంపై తన సంకల్పాన్ని గుర్తుచేస్తూ, ఆ దిశగా నేటి కార్యక్రమం ఒక ముందడుగని పేర్కొన్నారు.
   ప్రభుత్వం వైద్య విద్యను సులభ సాధ్యం చేసిందని, మహారాష్ట్ర యువతకు నేడు కొత్త అవకాశాలు అందివచ్చాయని ప్రధాని వ్యాఖ్యానించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు కావాలన్నదే ప్రభుత్వ ప్రాథమ్యమని, ఆ మేరకు వారి కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు. ఇటువంటి విశిష్ట విద్యకు ఒకనాడు మాతృభాషలో పాఠ్య పుస్తకాలు లేకపోవడం పెను సమస్యగా ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు.  ప్రభుత్వం ఈ వివక్షకు స్వస్తి పలికిన నేపథ్యంలో రాష్ట్ర యువత ఇక తమ మాతృభాషలో వైద్య విద్యఅభ్యాసం చేయగలదని పేర్కొన్నారు. తద్వారా వైద్యులు కావాలనే సంకల్పాన్ని వారు సాకారం చేసుకోగలరని చెప్పారు.
   జనజీవనాన్ని సౌకర్యవంతం చేసేదిశగా ప్రభుత్వం కృషి పేదరిక నిర్మూలనలో గొప్ప ఉపకరణమని ప్రధాని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు పేదరికాన్ని తమ రాజకీయ ఇంధనంగా మార్చుకున్నాయని తీవ్రంగా విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం కేవలం ఒక దశాబ్దంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరిక విముక్తులను చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా  ఆరోగ్య సేవలలో ప్రగతిశీల మార్పును శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- ‘‘ఇవాళ ప్రతి నిరుపేదకూ ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది’’ అన్నారు. దీనికితోడు ఇటీవలే 70 ఏళ్లు పైబడిన వృద్ధులకూ ఈ సదుపాయం వర్తింపజేశామని పేర్కొన్నారు. ఇక జనౌషధి కేంద్రాల్లో అత్యవసర మందులు చాలా తక్కువ ధరకు... హృద్రోగులకు స్టెంట్లు వంటి పరికరాలు కూడా 80-85 శాతం తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు. అలాగే కేన్సర్ చికిత్సలో వాడే అత్యవసర మందుల ధరను కూడా ప్రభుత్వం తగ్గించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల సంఖ్య పెరగడంతో వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిందని శ్రీ మోదీ అన్నారు. ఈ విధంగా ‘‘మోదీ ప్రభుత్వం నేడు నిరుపేదలందరికీ బలమైన సామాజిక భద్రత రక్షణ కల్పించింది’’ అని పేర్కొన్నారు.
   యువతలో ఉట్టిపడే ఆత్మవిశ్వాసాన్ని బట్టి, ఏ దేశాన్నైనా ప్రపంచం విశ్వసిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. తదనుగుణంగా నేటి యువభారత్ జాతి భవిష్యత్ ప్రగతి ప్రణాళికను సరికొత్తగా రచిస్తోందని చెప్పారు. కాబట్టే విద్య, ఆరోగ్య సంరక్షణ, సాఫ్ట్‌ వేర్ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార‌త్‌ను విస్తృత మానవ వనరుల కూడలిగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తున్నదని చెప్పారు. ఈ అవకాశాల సద్వినియోగం దిశగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం యువతను తీర్చిదిద్దుతున్నదని ప్రధాని తెలిపారు. మహారాష్ట్రలో విద్యావ్యవస్థను ముందుకు నడిపే  పర్యవేక్షణ కేంద్రంతోపాటు ముంబయిలో ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ప్రారంభోత్స‌వం తదితరాలను ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. వీటిద్వారా మార్కెట్ డిమాండుకు తగినట్లు యువ‌త ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దడంతోపాటు భ‌విష్య‌త్ అవకాశాల ఆధారిత శిక్ష‌ణ ఇస్తారని తెలిపారు. అంతేగా యువతకు నెలవారీ భృతితో అనుభవ శిక్షణ (ఇంటర్న్‌షిప్‌) ఇప్పించే ప్రభుత్వ కార్యక్రమం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటిది దేశ చరిత్రలోనే ప్రప్రథమమని, ఈ శిక్షణలో వారికి రూ.5,000 దాకా భృతి అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి వేలాది కంపెనీలు సంసిద్ధత తెలుపుతున్నాయన్నారు. తద్వారా యువత విలువైన అనుభవ శిక్షణతోపాటు కొత్త అవకాశాలు అందిరాగలవని హర్షం వెలిబుచ్చారు.
   యువత కోసం భారత్ చేస్తున్న కృషి గణనీయ ఫలితాలిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. మన విద్యా సంస్థలు ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు దీటుగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. నిన్న ప్రకటించిన ‘అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌’ ప్రకారం భారతదేశంలో ఉన్నత విద్య-పరిశోధనల పరంగా నాణ్యత పెరుగుతున్నదని వివరించారు.
   ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిన నేపథ్యంలో యావత్ ప్రపంచం నేడు మనవైపు దృష్టి సారించిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఇవాళ భారత్ ప్రగతిలోనే ఇమిడి ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఒకనాడు నిర్లక్ష్యానికి గురైన, వెనుకబడిన అనేక రంగాల్లో ఈ ఆర్థిక పురోగమనం కొత్త అవకాశాలను కల్పించిందని చెప్పారు. ఈ మేరకు లోగడ పర్యాటక రంగంలో మహారాష్ట్ర గతంలో ఎన్నో అవకాశాలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర అమూల్య వారసత్వం, సుందర ప్రకృతి ప్రదేశాలు, అధ్యాత్మిక కేంద్రాల సంపూర్ణ సద్వినియోగానికి నేడు అవకాశం ఏర్పడిందన్నారు. మహారాష్ట్రను బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో పర్యాటక రంగం ప్రగతి కీలక పాత్ర పోషించగలదని స్పష్టం చేశారు. ఆ మేరకు నేటి ప్రభుత్వం ప్రగతి, వారసత్వాలను సమ్మిళితం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నదని చెప్పారు.
   భారత సుసంపన్న గతం స్ఫూర్తితో ఉజ్వల భవిష్యత్తు దిశగా సాగుతున్న కార్యక్రమాలను ప్రధాని ఉదాహరించారు. ఈ మేరకు షిర్డీ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనం, నాగ్‌పూర్ విమానాశ్రయ ఆధునికీకరణ, మహారాష్ట్రలో ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. షిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ వల్ల సాయిబాబా భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకుల రాకకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఆధునికీకరించిన షోలాపూర్ విమానాశ్రయం ప్రారంభంతో శని షింగనాపూర్, తుల్జా భవానీ ఆలయం, కైలాస్ టెంపుల్ వంటి సమీప అధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు వీలు కలిగిందని చెప్పారు. తద్వారా మహారాష్ట్ర పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఊపు లభిస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయని ఆయన పేర్కొన్నారు.
   ‘‘మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, అనుసరించే ప్రతి విధానం ఏకైక లక్ష్యం- వికసిత భారత్!’’ అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అందుకే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పేద గ్రామీణులు,  కూలీలు, రైతులకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశవిదేశాలకు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి షిర్డీ విమానాశ్రయంలో నిర్మించే ప్రత్యేక సరకుల ప్రాంగణం ఎంతగానో తోడ్పడుతుందని శ్రీ మోదీ తెలిపారు. షిర్డీ, లాసల్‌గావ్, అహల్యానగర్, నాసిక్ ప్రాంతాల రైతులు ఈ ప్రాంగణం ద్వారా ఉల్లి, ద్రాక్ష, జామ, దానిమ్మ వంటి ఉత్పత్తులను సులువుగా రవాణా చేయగలరని ఆయన అన్నారు. ఈ విధంగా వారికి మరింత విస్తృత మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
   దేశంలోని రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర రద్దు, బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం తొలగింపు, ఉప్పుడు బియ్యంపై ఎగుమతి సుంకం సగానికి తగ్గింపు వంటివాటిని ఆయన ఉటంకించారు. మహారాష్ట్ర రైతుల ఆదాయం పెంపు దిశగా ఉల్లిపై ఎగుమతి పన్నును కూడా ప్రభుత్వం సగానికి తగ్గించినట్లు గుర్తుచేశారు. ఆవాలు వంటి పంటలకు అధిక ధరలతో దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా వంటనూనెల దిగుమతిపై 20 శాతం పన్ను విధించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే రిఫైన్డ్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్‌పై కస్టమ్స్ సుంకం గణనీయంగా పెంచాలని కూడా నిర్ణయించామని శ్రీ మోదీ తెలిపారు. ఇవన్నీ మహారాష్ట్రలోని రైతులకూ ఎంతో ప్రయోజనం కల్పిస్తాయని పేర్కొన్నారు.
   చివరగా- మహారాష్ట్రను మరింత బలోపేతం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుండటం హర్షణీయమని, ఈ నేపథ్యంలో నేటి  అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అభినందనలు తెలుపుతున్నానని చెబుతూ తన ప్రసంగం ముగించారు.
   ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   నాగ్‌పూర్‌లో రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ ప‌నుల‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని తయారీ, విమానయానం, పర్యాటకం, రవాణా, ఆరోగ్య సంరక్షణ సహా అనేక రంగాలలో వృద్ధికి ఈ విమానాశ్రయం ఉత్ప్రేరకం కాగలదు. అంతేగాక నాగ్‌పూర్ నగరంతోపాటు విదర్భలో విస్తృత ప్రాంతానికీ ప్రయోజనం కలుగుతుంది.
   దీంతోపాటు షిర్డీ విమానాశ్రయంలో రూ.645 కోట్లతో కొత్త స‌మీకృత టెర్మినల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే ఈ క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులకు, పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, సౌకర్యాలు లభిస్తాయి. ప్రతిపాదిత టెర్మినల్ నిర్మాణం సాయిబాబా అధ్యాత్మిక ప్రాధాన్యంగల వేపచెట్టు రూపం ప్రాతిపదికగా ఉంటుంది.
   మరోవైపు అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యంపై నిబద్ధతకు అనుగుణంగా  మహారాష్ట్రలోని ముంబై, నాసిక్, జల్నా, అమరావతి, గడ్చిరోలి, బుల్దానా, వాషిమ్, భండారా, హింగోలి, అంబర్‌నాథ్ (థానె)లలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రధాని ప్రారంభించారు. వీటిద్వారా వైద్యవిద్యలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్ల సంఖ్య పెరగడమేగాక అనుబంధ ఆస్పత్రులలో ప్రజలకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కూడా లభ్యమవుతుంది.
  భార‌త్‌ను ‘నైపుణ్య రాజధాని’గా నిలపాలన్న తన ధ్యేయానికి అనుగుణంగా, అత్యాధునిక సాంకేతికత-అనుభవపూర్వక శిక్షణ ద్వారా పరిశ్రమలకు సంసిద్ధ మానవ వనరులను అంచాలని ప్రధాని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయిని ఆయన ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వ -ప్రైవేట్ భాగస్వామ్యం కింద టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ మేరకు ‘‘మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్’’ వంటి అత్యంత ప్రధాన ప్రత్యేక రంగాల్లో శిక్షణ ఇవ్వాలని సంస్థ యోచిస్తోంది.
   ఈ కార్యక్రమాల్లో భాగంగా మహారాష్ట్ర విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కీలక విద్యా, పరిపాలన సమాచార నిధిని ఇది అందుబాటులో ఉంచుతుంది. ఈ మేరకు ‘‘స్మార్ట్ ఉపస్థితి, స్వాధ్యాయ్’’ వంటి ‘లైవ్ చాట్‌బాట్‌’లద్వారా సౌలభ్యం కల్పిస్తుంది. వనరుల సమర్థ నిర్వహణతోపాటు తల్లిదండ్రులు-ప్రభుత్వం మధ్య సంబంధాల బలోపేతంసహా ప్రతిస్పందనాత్మ మద్దతు దిశగా పాఠశాలలకు అత్యున్నత నాణ్యతతో సలహాలు, సూచనలు అందిస్తుంది. అలాగే బోధన పద్ధతులు, విద్యార్థుల్లో అభ్యసన రీతుల మెరుగుకు తగిన నాణ్యమైన వనరులు కూడా సమకూరుస్తుంది.

*****

MJPS/SR/TS



(Release ID: 2063642) Visitor Counter : 30