ఆర్థిక మంత్రిత్వ శాఖ
7 కోట్లకు చేరిన ‘అటల్ పెన్షన్ యోజన’ స్థూల నమోదు సంఖ్య
2024-25 సంవత్సరంలో 56 లక్షలకు పైగా చేరికలు
प्रविष्टि तिथि:
08 OCT 2024 9:01PM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా చేరిన 56 లక్షల మంది సహా, ‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) పథకంలో నమోదైన వారి స్థూల సంఖ్య 7 కోట్లకు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో ఈ పథకం పదో ఏడాదిలోకి ప్రవేశించింది. సమాజంలోని అట్టడుగు సమూహాలకి అటల్ పెన్షన్ యోజనలో చోటు కల్పించడం ద్వారా పథకం మరో మైలురాయిని చేరుకున్నట్లయ్యింది. రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల బ్యాంకింగ్ కమిటీలు సహా అన్ని బ్యాంకులు చేసిన అవిశ్రాంత కృషి ద్వారా ఈ విజయం సాధ్యమయ్యింది.
ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ‘పెన్షన్ నిధి- నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ-పీఎఫ్ఆర్డీఏ’ ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకొంది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఏర్పాటు చేస్తున్న ‘ఏపీవై ఔట్ రీచ్’ పథకం సహా అనేక అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. మీడియా సంస్థల ద్వారా ప్రచారం, హిందీ, ఆంగ్లంతోపాటు 21 స్థానిక భాషల్లో కరపత్రాల పంపిణీ, పథకం అమలు తీరుకు సంబంధించిన సమీక్ష వంటి కార్యక్రమాలతో అటల్ పెన్షన్ యోజన పట్ల అవగాహన కల్పిస్తోంది.
అటల్ పెన్షన్ యోజనలో నమోదైన వారికి నిర్ధారిత సొమ్మును జీవితకాలం పింఛనుగా అందించడం ద్వారా వారికి “సంపూర్ణ సురక్ష కవచాన్ని” సమకూర్చడమే కాక, లబ్దిదారుడు తదనంతరం అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి పింఛను అందిస్తారు. లబ్ధిదారులైన భార్యాభర్తలిద్దరి మరణానంతరం, 60 ఏళ్ల వరకూ జమ అయిన సొమ్ము మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2015, మే 9 న ప్రారంభించింది. నిరుపేదలు, బడుగు వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులు సహా భారతీయులందరికీ సార్వజనీన సామాజిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
***
(रिलीज़ आईडी: 2063424)
आगंतुक पटल : 142