కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌ సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఉద్యోగ సమాచార సంబంధిత ఉన్నత స్థాయి సమావేశం


ఉద్యోగ సమాచార సేకరణ తో పాటు ఆ సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా సంకలనపరచడం కోసం ఓ యంత్రాంగం ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ కృషి

Posted On: 08 OCT 2024 3:30PM by PIB Hyderabad

ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, కొలువుల కోసం విదేశాలకు వలస పోవడం అనే అంశాలకు సంబంధించిన ముఖ్య విషయాల పైన దృష్టిని సారించడానికి నిన్న న్యూ ఢిల్లీ లో నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి  కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల  శాఖ మంత్రి డాక్టర్ మన్‌ సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు.  ఈ కార్యక్రమంలో కార్మిక, ఉద్యోగ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే కూడా పాల్గొన్నారు.

దేశంలో ఉద్యోగ అవకాశాల కల్పనకు, విదేశాలలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించడంతో పాటు బయటి దేశాలలో ఉద్యోగాల భర్తీకి తోడ్పాటును అందించే ఏజెన్సీల పర్యవేక్షణను పెంచడం, పరాయి దేశాలలో నౌకరీలను సంపాదించాలంటే అందుకు కావలసిన నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సమన్వయ పరచడాన్ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఎ) తోను, నీతి ఆయోగ్ తోను చర్చోపచర్చలు సాగాయి.

ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) నియమావళి వర్తించే దేశాలకు, ఈసీఆర్ నియమావళి అమలులో లేనటువంటి (Non-ECR) దేశాలకు వలస పోయే వారి తాలూకు సంపూర్ణ సమాచారాన్ని సేకరించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం  ఎంతైనా అవసరం అని మంత్రి డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు.  అంతేకాకుండా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎంత మంది ఉన్నారనే అంశాలను గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్, ‘మై భారత్ ప్లాట్‌ఫార్మ్’ (MY Bharat Platform), ‘మదద్’ (MADAD) పోర్టల్, ‘ఈమైగ్రేట్’ (eMigrate), ‘ఈశ్రమ్’ పోర్టల్స్ (eShram portals)ను,  ఇంకా స్టేట్ పోర్టల్స్ ను కలిపివేయాలని కూడా మంత్రి సూచించారు.
కొలువులకు సంబంధించినటువంటి సమాచారాన్ని క్రోడీకరించడంలో పరిశ్రమ సంఘాలు కీలక పాత్రను పోషించ వచ్చని కూడా మంత్రి  చెప్పారు.  వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఉద్యోగ సంబంధ సమాచారాన్ని సంకలన పరచే పని ని పర్యవేక్షించే సంస్థ గా  నీతి ఆయోగ్ కీలక పాత్ర ను పోషించగలుగుతుంది అని మంత్రి చెప్పారు.

విదేశాలలో నౌకరీలను ఇచ్చే సంస్థలతో ఒప్పందాలను నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండేవిగా తీర్చిదిద్దుకోవాలని, తత్సంబంధిత నియమావళి సమర్థంగా అమలు అవుతున్నదా అనే విషయంలో ప్రతిస్పందనలను సమీక్షించడానికి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అరేంజ్‌మెంట్స్ (ఎమ్ఎమ్‌పిఎ), ఇంకా సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ (ఎస్ఎస్ఎ)ను సమీక్షించాలని చెప్పారు.

దేశంలో ఉద్యోగ సంబంధిత పోర్టల్స్ గురించిన వేరు వేరు అధ్యయనాలు ఏమి చెబుతున్నదీ నీతి ఆయోగ్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చింది.  ప్రభుత్వ పథకాలు, రంగాలకు సంబంధించిన ఉద్యోగ సమాచారాన్ని అంతటిని కూర్చడానికి ఒక ఏకీకృత వేదికను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది.
 
సమాచారం పరంగా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి అంతరాలను
భర్తీ చేయడానికి, ప్రత్యేకించి అసాంప్రదాయిక రంగంలో ఉన్న అంతరాలను పూడ్చడానికి; అంతేకాకుండా, ఉద్యోగ కల్పన కార్యక్రమాలకు, తత్సంబంధిత విధానాలకు ఊతాన్ని ఇచ్చే బహుళ రంగాల ఉద్యోగాల సమాచారాన్ని అందించే ఒక సమగ్ర పోర్టల్ ను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఈ సమావేశంలో చాటిచెప్పారు.

ఉద్యోగాలకు సంబంధించిన సమాచారంలో సమన్వయాన్ని బలపరచడం, బయటి దేశాలలో నౌకరీ అవకాశాలను విస్తరింప చేయడం, పరాయిదేశాలలో పని చేస్తున్న భారతదేశ శ్రామికులకు సురక్షను కల్పించడం.. ఈ అంశాలలో బలమైన నిబద్ధతను వ్యక్తం చేస్తూ ఈ సమావేశాన్ని ముగించారు.  ప్రతిపాదించిన ఏకీకృత ఉద్యోగ సమాచార సంబంధ పోర్టల్ నౌకరీల డాటాను కేంద్రీకరించడంలో ఒక పనిముట్టుగా పని చేస్తుందన్న ఆశ తో పాటు  ‘ఈమైగ్రేట్’ (eMigrate), ఎన్‌సీఎస్ ల ఏకీకరణ అంతర్జాతీయ కొలువుల బజారులను ఇప్పటితో పోలిస్తే మరింత ఎక్కువ అందుబాటులోకి తీసుకు రాగలదన్న ఆశాభావం  కూడా వ్యక్తమైంది.

 

***



(Release ID: 2063345) Visitor Counter : 26