ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలో రూ. 7600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న పీఎం
నాగపూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్న పీఎం
షిర్డీ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవనానికి శంకుస్థాపన చేయనున్న పీఎం
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబయి, విద్యా సమీక్ష కేంద్ర మహారాష్ట్ర సంస్థలను ప్రారంభించనున్న పీఎం
Posted On:
08 OCT 2024 7:31PM by PIB Hyderabad
మహారాష్ట్రలో రూ.7600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం 1 గంటకు వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
నాగపూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీని మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.7000 కోట్లు. తయారీ, విమానయానం, పర్యాటకం, సరుకు రవాణా, ఆరోగ్య సంరక్షణ సహా బహుళ రంగాలలో వృద్ధికి ఇది ఊతమివ్వనుంది. నాగపూర్ నగరంతో పాటు విదర్భ ప్రాంతం అంతటికీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
షిర్డీ విమానాశ్రయంలో 645 కోట్ల రూపాయల విలువైన నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది షిర్డీకి వచ్చే పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సదుపాయాలను అందిస్తుంది. ప్రతిపాదిత టెర్మినల్ నిర్మాణ శైలి సాయిబాబా ఆసీనులయ్యే వేప చెట్టును పోలి ఉండనుంది.
అందరికీ సరసమైన, అందుబాటులో గల ఆరోగ్య సంరక్షణను అందించాలనే తమ ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా, మహారాష్ట్రలోని ముంబయి , నాసిక్, జల్నా, అమరావతి, గడ్చిరోలి, బుల్దానా, వాషిం, భండారా, హింగోలి, అంబర్‌నాథ్ (థానే)ల్లోని 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కార్యకలాపాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల పెంపుతో పాటు, ఈ కళాశాలల్లో ప్రజలకు ప్రత్యేక తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
భారతదేశాన్ని "ప్రపంచ నైపుణ్య రాజధాని"గా నిలపాలన్న లక్ష్యానికి అనుగుణంగా, అత్యాధునిక సాంకేతికత, ప్రత్యక్ష అనుభవాలు, సాధనతో కూడిన శిక్షణ ద్వారా పరిశ్రమ అవసరాలకు తగిన సిబ్బందిని రూపొందించే లక్ష్యంతో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్) ముంబయిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఇది టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, భారత ప్రభుత్వ సహకారంతో స్థాపించబడింది. మెకాట్రోనిక్స్, కృత్రిమ మేధ, డేటా అనాలిటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి అత్యంత ప్రత్యేక రంగాలలో శిక్షణను అందించేందుకు ఈ సంస్థ ప్రణాళిక చేస్తోంది.
ఇంకా, మహారాష్ట్ర విద్యా సమీక్షా కేంద్రం (వీఎస్‌కే)ను ప్రధాని ప్రారంభిస్తారు. వీఎస్‌కే విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులకు స్మార్ట్ ఉపస్థితి, స్వాధ్యాయ్ వంటి లైవ్ చాట్‌బాట్‌ల ద్వారా కీలకమైన విద్యాసంబంధమైన, నిర్వహణ సంబంధమైన డేటా అందుబాటులో ఉంటుంది. వనరులను సమర్ధంగా నిర్వహించడానికి, తల్లిదండ్రులు, సంస్థకు మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, జవాబుదారీతనంతో కూడిన సహాయం అందించడం కోసం ఇది పాఠశాలలకు మంచి అవగాహనను అందిస్తుంది. ఇది బోధనా పద్ధతులను, విద్యార్థుల అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి మంచి బోధనా వనరులను కూడా అందిస్తుంది.
***
(Release ID: 2063343)
Visitor Counter : 52
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam