ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 07 OCT 2024 2:25PM by PIB Hyderabad

మాన‌నీయ అధ్య‌క్షులు ముయిజ్జుగారు,

రెండు దేశాల ప్ర‌తినిధులు,

ప‌త్రికా, ప్ర‌సార మాధ్య‌మ మిత్రులారా...

అంద‌రికీ న‌మ‌స్కారం!

    మున్ముందుగా అధ్య‌క్షులు ముయిజ్జు, ఆయ‌న ప్రతినిధి బృందానికి నా హృదయపూర్వక స్వాగతం.

   భార‌త్‌-మాల్దీవ్స్ సంబంధాల‌కు శతాబ్దాల చ‌రిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత స‌న్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుస‌రిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శ‌నిక‌ సాగ‌ర్  కార్య‌క్ర‌మంలో మాల్దీవ్స్‌కు కీల‌క స్థాన‌ముంది. మాల్దీవ్స్ విష‌యంలో ఎల్ల‌ప్పుడూ మొట్ట‌మొద‌ట స్పందించి, త‌న‌వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించేది భార‌త‌దేశ‌మే. నిత్యావసరాల కొర‌త తీర్చ‌డంలోనైనా, ప్రకృతి విప‌త్తుల సమయంలో తాగునీటి స‌ర‌ఫ‌రాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించ‌డంలోనైనా పొరుగు దేశం విష‌యంలో భార‌త్ స‌దా త‌న కర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశ‌ను నిర్దేశించ‌డం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.

మిత్రులారా!

   మ‌న సంబంధాల‌కు ప్ర‌గ‌తి భాగస్వామ్యం కీల‌క పునాది. అంతేగాక మేము స‌దా మాల్దీవ్స్ ప్రజల అవ‌స‌రాల‌కు ప్రాధాన్యమిస్తాం. ఈ ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్దీవ్స్ ప్ర‌భుత్వ చెల్లింపుల కోసం 100 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా అంద‌జేసింది. అదేవిధంగా మాల్దీవ్స్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 400 మిలియన్ డాలర్లు, 3 వేల కోట్ల రూపాయల కరెన్సీ మార్పిడిపై నేడు ఒప్పందం కూడా కుదిరింది. మాల్దీవ్స్‌లో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి సమగ్ర సహకారంపైనా మేము చర్చించాం. ఈ రోజున పునర్నిర్మిత ‘హనిమధు’ విమానాశ్రయాన్ని ప్రారంభించాం. ఇప్పుడిక ‘గ్రేట‌ర్ మాలె’ అనుసంధాన ప్రాజెక్టు ప‌నుల్లో వేగం కూడా పెరుగుతుంది. అలాగే ‘థిలాఫుషి’లో కొత్త వాణిజ్య ఓడ‌రేవు నిర్మాణంలోనూ మా సహకారం లభిస్తుంది. ఇవాళ్టి కార్య‌క్ర‌మంలో భాగంగా భారత్ సహకారంతో నిర్మించిన 700కుపైగా సామాజిక గృహాలను ప్ర‌జ‌ల‌కు అందించాం. మాల్దీవ్స్‌లోని 28 దీవుల్లో నీటి స‌ర‌ఫ‌రా-మురుగు పారుద‌ల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో ఆరు దీవుల్లో పనులు కూడా త్వరలో ముగుస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 30 వేల మందికి సుర‌క్షిత తాగునీరు అందుతుంది. ‘‘హ దాలు’’లో వ్య‌వ‌సాయార్థిక మండ‌లి, ‘‘హా అలీఫు’’లో చేపల ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటులోనూ సహ‌క‌రిస్తాం. భూజ‌ల అధ్య‌య‌నం (హైడ్రోగ్ర‌ఫీ), నీలి ఆర్థిక వ్య‌వ‌స్థ అంశాల్లోనూ సంయుక్త కృషిని కొన‌సాగిస్తాం.

మిత్రులారా!

   ఆర్థిక సంబంధాల బలోపేతంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు శ్రీ‌కారం చుట్టాల‌ని మేం నిర్ణ‌యించుకున్నాం. అంతేకాకుండా స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీల‌పైనా చ‌ర్చిస్తాం. వీటితోపాటు డిజిటల్ అనుసంధానంపైనా దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఇటీవలే మాల్దీవ్స్‌లో ‘రూపే’ కార్డును ప్ర‌వేశ‌పెట్టాం. భ‌విష్య‌త్తులో భారత్‌-మాల్దీవ్స్‌ను ‘యుపిఐ’తో అనుసంధానించే ప్ర‌క్రియ చేప‌డ‌తాం. ‘అడ్డూ’లో భార‌త దౌత్య కార్యాల‌యం, బెంగళూరులో మాల్దీవ్స్ కాన్సులేట్ ప్రారంభించడంపైనా మేము చర్చించాం. ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజల మ‌ధ్య స్నేహ‌ సంబంధాలను మ‌రింత బలోపేతం చేస్తాయి.

మిత్రులారా!

   రెండు దేశాల మ‌ధ్య రక్షణ-భద్రత రంగాల్లో సహకారం సంబంధిత అంశాలపై లోతుగా చర్చించాం. ఏక్తా హార్బర్‌ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మాల్దీవ్స్ జాతీయ రక్షణ దళాలకు శిక్షణ-సామర్థ్య వికాస కల్ప‌న‌లో మా వంతు తోడ్పాటునందిస్తాం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శ్రేయస్సు కోసం సంయుక్తంగా కృషి చేస్తాం. హైడ్రోగ్రఫీ,  విపత్తు ప్రతిస్పందనలోనూ సహకారం విస్త‌రిస్తుంది. కొలంబో భ‌ద్ర‌త కూట‌మిలో వ్యవస్థాపక సభ్యత్వ స్వీక‌ర‌ణ‌కు మాల్దీవ్స్‌ను ఆహ్వానిస్తున్నాను. వాతావరణ మార్పు స‌మ‌స్య మన రెండు దేశాలకూ పెనుస‌వాలే అన‌డంలో సందేహం లేదు. దీనికి సంబంధించి సౌరశ‌క్తి, ఇంధన సామర్థ్యం దిశ‌గా తన అనుభవాన్ని మాల్దీవ్స్‌తో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.

గౌర‌వ‌నీయ అధ్య‌క్షా!

మీకు, మీ ప్ర‌తినిధి బృందానికి భార‌త్ మ‌రోసారి సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతోంది. మీ ప‌ర్య‌ట‌న మ‌న సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది ప‌లికింది. ఈ నేప‌థ్యంలో మాల్దీవ్స్ ప్ర‌జ‌ల పురోగ‌మ‌నం, శ్రేయస్సుకు మేము అన్నివేళ‌లా చేయూత‌నిస్తూనే ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇస్తున్నాను.

 

అనేకానేక ధన్యవాదాలు!

 

 

****


(Release ID: 2063021) Visitor Counter : 42