రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav g20-india-2023

మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి

Posted On: 03 OCT 2024 1:56PM by PIB Hyderabad

రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ లోని మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన 32వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.

 



విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలు సహా అనేక రంగాలలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న రాష్ట్రపతి, విద్యార్థులు తమలోని “విద్యా కాంక్షను” సదా నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర పరిశ్రమ, అంకితభావం వంటి లక్షణాలు జీవితంలో ఎల్లప్పుడూ దన్నుగా నిలుస్తాయని చెప్పారు.  

 



విద్యార్థులు ఉన్నత ఆకాంక్షలు, సామాజిక బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించాలన్నారు. సున్నితత్వం మనిషి సహజ లక్షణమనీ, అయితే చుట్టుపక్కల గల వాతావరణం, విద్య, విలువల స్థాయిని బట్టి  కొందరు అలవికాని స్వార్థానికి లోనవుతారని హెచ్చరించారు. ఇతరుల సంక్షేమానికి పాటుపడడం వల్ల సహజంగానే వ్యక్తి సంక్షేమం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.



వ్యక్తిత్వానికి మచ్చతెచ్చే ఏ పనీ చేయవద్దని వారించిన రాష్ట్రపతి, నడవడిక, పని చేసే విధానాల్లో ఉన్నత విలువలని పాటించాలని హితవు పలికారు. జీవితంలోని ప్రతి దశలో నిజాయితీతో మెలగాలనీ,  చేసే ప్రతి పని న్యాయబద్ధంగా, నైతిక విలువలకు ప్రాధాన్యాన్నిస్తూ సాగాలన్నారు.

సాధికారత పొందేందుకు చదువుని మించినది లేదన్న రాష్ట్రపతి, గత ఆరు దశాబ్దాలుగా మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉన్నతస్థాయిని విద్యను అందించడంలో నిమగ్నమైందని ప్రశంసించారు. ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో అధిక సంఖ్యాకులు షెడ్యూల్డు కులాలు, తరగతులకు చెందిన వారేనని, సమ్మిళిత విద్య ద్వారా సాంఘిక న్యాయం అందించడంలో విశ్వవిద్యాలయ పాత్రను ప్రస్తావించారు.



మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం సమీపంలోని అనేక గ్రామాలను దత్తత తీసుకుని, ఆయా గ్రామాల అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేసిందని శ్రీమతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యత గుర్తెరిగి ఆ దిశగా పనులు చేపట్టడాన్ని రాష్ట్రపతి కొనియాడారు.

రాష్ట్రపతి ప్రసంగం ఇక్కడ:



(Release ID: 2061547) Visitor Counter : 32