సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వచ్ఛతా హీ సేవ లో భాగంగా ఆకాశవాణి ప్రాంగణంలో సఫాయి మిత్ర సురక్షా శిబిరం, యోగ శిక్షణ
ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించేలా అందరినీ ప్రోత్సహిస్తూ.. సురక్షితమైన వాతావరణం దిశగా యత్నాలు
Posted On:
03 OCT 2024 9:27AM by PIB Hyderabad
స్వచ్చతా హీ సేవా – 2024లో భాగంగా పారిశుధ్య కార్మికుల కోసం ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రం రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నెల 1,2 తేదీల్లో పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు, సఫాయి మిత్ర శిబిరాలు, యోగా శిక్షణ ఏర్పాటు చేసింది. అలాగే సెప్టెంబర్ ౩౦, అక్టోబర్ 1 లలో స్వచ్చతా హీరోల కోసం ఉచితంగా కంటి, దంత, గైనకాలజీ, చర్మ, జీర్ణసంబంధ, సాధారణ పరీక్షలు నిర్వహించారు. వివిధ ఆసుపత్రుల సహకారంతో ఆకాశవాణి ప్రాంగణంలో వీటిని ఏర్పాటు చేశారు.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికై చేతులు కలిపిన ఆకాశవాణి, ఈఎస్ఐసీ
సఫాయి మిత్రలతో దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కల్పించేందుకు ఫరీదాబాద్ లోని ఈఎస్ఐసీ ఆసుపత్రి, వైద్యకళాశాల(ఎన్ఐటీ) సహకారంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జనరల్ ఫిజీషియన్లను సంప్రదించేందుకు తక్షణ రిజిస్ట్రేషన్, ఓపీడీ స్లిప్పులను ఈఎస్ఐసీ అందిస్తుంది. అవసరానికి అనుగుణంగా సంబంధిత వైద్య నిపుణులను ఉచితంగా సంప్రదించేందుకు వీలు కల్పించింది. అలాగే ప్రిస్క్రిప్షన్లు, పరీక్షల నివేదికలను భద్రపరిచేందుకు ప్రతి సఫాయి మిత్రకు ఒక ఫైలును కేటాయించారు.
ఉచిత వైద్య పరీక్షలు, ఏబీహెచ్ఏ నమోదు
కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న 200 మంది సఫాయి కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు, ఎంటీఎస్ ఉద్యోగులకు డా.లాల్ పాత్ ల్యాబ్స్ ఉచితంగా రక్త పరీక్షలు చేసింది. అలాగే ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై, ఏబీహెచ్ఏ కార్డుల ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరించేందుకు ఈ నెల 1న ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి భవన్ లో పనిచేసే సఫాయి మిత్రలు, ఇతర ప్రసారభారతి ఉద్యోగుల్లో అర్హులైన వారి వివరాలను ఈ కేంద్రంలో నమోదు చేశారు.
పారిశుధ్య కార్మికులకు యోగా శిక్షణ, మోసాలపై అవగాహన కార్యక్రమం
పారిశుధ్య కార్మికులకు యోగాపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగ సంస్థకు చెందిన విద్యార్థులు దీన్ని నిర్వహించారు. దీనితో పాటుగా కోటక్ మహీంద్ర బ్యాంకు సహకారంతో మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50 మంది అధికారులు పాల్గొన్నారు.
మహిళా సఫాయి మిత్రలకు సురక్షా శిబిర్‌లో ఉచిత గైనకాలజీ పరీక్షలు
సురక్షా శిబిర్‌లో గురుగ్రామ్ కు చెందిన ఆర్టెమిస్ ఆసుపత్రి సహకారంతో మహిళా సఫాయి మిత్రలకు ఉచితంగా స్త్రీ సంబంధిత వ్యాధుల పరీక్షలు నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల్లో మహిళా ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అలాగే స్త్రీలల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచి, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా సఫాయి మిత్రలను ప్రోత్సహిస్తుంది.
సురక్షా శిబిర్ లో ఉచిత కంటి పరీక్షలు
సఫాయి మిత్రలు సంపూర్ణ దృష్టి 6/6 సాధించేలా ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రాన్ని సురక్షా శిబిర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి లారెన్స్&మేయో సంస్థ సహకారం అందించింది. పారిశుధ్య కార్మికులకు నేత్రారోగ్య ప్రాధాన్యాన్ని తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన కంటి సంరక్షణ సౌకర్యాలను కల్పించాల్సిన ప్రాధాన్యతను ఈ కార్యక్రమం వివరిస్తుంది.
ఆకాశవాణి డైరెక్టరేట్‌లో స్వచ్ఛతా సెల్ఫీ పాయింట్
పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో అందరినీ భాగం చేసేందుకు గాను ఆకాశవాణి డైరెక్టరేట్ లో ‘స్వచ్ఛతా సెల్ఫీ పాయింట్’ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, సందర్శకులు నిర్దేశించిన ఈ ప్రదేశంలో సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా, పారిశుధ్యం, వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల కలిగే గౌరవాన్ని ఈ సెల్ఫీ పాయింట్ తెలియజేస్తుంది. ఇక్కడ తీసుకున్న స్వీయచిత్రాలను స్వచ్ఛభారత్ సెల్ఫీ హ్యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగం చేయవచ్చు. అలాగే పరిశుభ్రత ప్రాధాన్యంపై అవగాహన పెంచవచ్చు.
స్వచ్చతా హీ సేవాలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, వారి సంక్షేమం పట్ల ఆకాశవాణికి ఉన్న నిబద్ధతను తెలుపుతున్నాయి. పెద్ద ఎత్తున ఆరోగ్య శిబిరాలు, సఫాయి మిత్ర సురక్షా శిబిరాలు, యోగ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా పారిశుధ్య కార్మికుల శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించి, వారిలో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరాన్ని సైతం వివరిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలపై అవగాహన పెంచుతూ ఆరోగ్యకరమైన పద్దతులు పాటించేలా ప్రోత్సహిస్తాయి. అంతిమంగా అందరికీ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో దోహదపడతాయి.
***
(Release ID: 2061441)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam