రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ దళాల వైద్య సేవల డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ- సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్
Posted On:
01 OCT 2024 12:42PM by PIB Hyderabad
సాయుధ దళాల వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్ (డీజీఏఎఫ్ఎంఎస్)గా సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్ ఈ రోజు (అక్టోబర్ 1) బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె నిలిచారు. సాయుధ దళాలకు సంబంధించిన వైద్య విధాన విషయాల నిమిత్తం డీజీఎఎఫ్ఎంఎస్ నేరుగా రక్షణ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తుంది
46వ డీజీఏఎఫ్ఎంఎస్‌గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. నౌకాదళం, వాయుదళాల్లో మెడికల్ సర్వీసుల డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(ఏఎఫ్ఎంసీ) డైరెక్టర్, కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏఎఫ్ఎంసీ కళాశాలకు ఆమె పూర్వవిద్యార్థి. 1985లో సాయుధ దళాల వైద్య సేవల విభాగంలో ఆమె చేరారు. ఏఎఫ్ఎంసీ నుంచి రేడియో డయాగ్నసిస్‌లో ఎండీ పట్టభద్రురాలు. ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో రేడియేషన్ ఆంకాలజీలో డిప్లొమేట్ నేషనల్ బోర్డు పూర్తి చేశారు. గామా నైఫ్ సర్జరీలో పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు.
38 ఏళ్ల వృత్తిజీవితంలో ఎన్నో ప్రతిష్టాత్మక విద్య, పాలనా బాధ్యతలను ఆమె చేపట్టారు. వాటిలో ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్), కమాండ్ హాస్పిటల్(సదరన్ కమాండ్)/ఏఎఫ్ఎంసీ, పుణెలో ప్రొఫెసర్‌గా, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతిగా వ్యవహరించారు. ఐఎన్‌హెచ్ఎస్ అశ్వనికి కమాండింగ్ అధికారిగా, భారత నౌకాదళంలోని సదరన్, వెస్ట్రన్ నౌకాదళ కమాండ్స్ లో కమాండ్ వైద్యాధికారిణిగా సైతం పనిచేశారు.
త్రివిధ దళాల్లో సేవలు అందించిన అరుదైన ఘనత ఈ ఫ్లాగ్ ఆఫీసర్ సొంతం. ఆర్మీలో లెఫ్టినెంట్ స్థాయి నుంచి కెప్టెన్ వరకు, నౌకాదళంలో సర్జన్ లెఫ్టినెంట్ నుంచి సర్జన్ వైస్ అడ్మిరల్ స్థాయి వరకు పనిచేశారు. వాయుదళంలో ఎయిర్ మార్షల్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
రోగులకు నిబద్ధతతో అందించిన సేవలకు, విధి నిర్వహణలో చూపిన విధేయత, అంకితభావానికి గుర్తింపుగా ఈ ఏడాది అతి విశిష్ట సేవా పతకం, 2021లో విశిష్ట సేవాపతకం అందుకున్నారు. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ (2017), చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కమెండేషన్(2001), జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్-కమెండేషన్(2013) కూడా లభించాయి.
వైద్యులకు సురక్షితమైన పని ప్రదేశాలు, విధానాలను రూపొందించడానికి ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ లో సభ్యురాలిగా ఫ్లాగ్ ఆఫీసర్ ను సుప్రీంకోర్టు నియమించింది. అలాగే ప్రభుత్వ ప్రారంభించిన నారీశక్తికి చిహ్నంగా నిలవడంతో పాటు సాయుధ దళాల్లో చేరేందుకు యువతులకు ప్రేరణగా ఆమె నిలుస్తున్నారు
***
(Release ID: 2060763)
Visitor Counter : 107