రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతిని కలిసిన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు
Posted On:
30 SEP 2024 2:06PM by PIB Hyderabad
తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్న 76 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారుల బృందం (ఆర్ఆర్-2023 బ్యాచ్) భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు సమావేశమయ్యారు.
శిక్షణను పూర్తి చేసుకున్న అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ... వివిధ అఖిల భారత సర్వీసులలో, ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ప్రాముఖ్యం ఉన్నాయన్నారు. శాంతిభద్రతలు - ప్రభుత్వానికి పునాది మాత్రమే కాదనీ, ఆధునిక పాలనా వ్యవస్థకు గుర్తు అని ఆమె వ్యాఖ్యానించారు. అర్థమయ్యేలా చెప్పాలంటే, తోటి పౌరుల దృష్టిలో చాలా ప్రాంతాల్లో, చాలా సందర్భాల్లో, ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఐపీఎస్ అధికారులు ఉంటారనీ, పాలనా యంత్రాంగంలో పౌరులు మొదట కలిసేది ఐపీఎస్ అధికారులనేనని ఆమె అన్నారు.
రానున్న కాలంలో ఉన్నతోన్నత శిఖరాలను అందుకోవాలని దేశం ఒక లక్ష్యంగా పెట్టుకున్నందున, ఐపీఎస్ అధికారులు పోషించవలసిన పాత్ర మరింత కీలకమని రాష్ట్రపతి అన్నారు. శాంతిభద్రతలు బాగున్నప్పుడు మాత్రమే ఒక దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. శాంతిభద్రతలను కాపాడలేనపుడు, న్యాయాన్ని కాపాడుకోలేనప్పుడు, ప్రజల హక్కులకు రక్షణ లేనప్పుడు- అభివృద్ధికి అర్థం లేదన్నారు.
మహిళా ఐపీఎస్ అధికారుల సంఖ్య ఇటీవల కాలంలో పెరగడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన మహిళల సంఖ్య- పోలీసింగ్ తీరులో మార్పును తెస్తుందని, పోలీసు-సామాజిక సంబంధాలు మెరుగవుతాయని- ఈ పరిస్థితి దేశానికి మేలు చేస్తుందని అన్నారు.
కొత్తతరం టెక్నాలజీల వల్ల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను పసిగట్టడం, వాటిని ముందుగానే నిరోధించడం వంటివి నేటి కాలంలో సాధ్యమవుతున్నాయని, పోలీసింగ్ మెరుగయ్యిందనీ తెలిపారు. మరోవైపు నేరగాళ్లు, తీవ్రవాదులు కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు, సైబర్ దాడులూ పెరుగుతున్న నేపథ్యంలో- ఐపీఎస్ అధికారులు టెక్నాలజీ ప్రేమికులుగా ఉండాలనీ, నేరగాళ్ల కంటే ముందుండాలనీ ఆమె సూచించారు.
భుజస్కంధాలపై బరువైన బాధ్యతలను మోపుతున్నందున, ఐపీఎస్ అధికారులపై మానసిక ఒత్తిడి ఉండొచ్చని చెబుతూ- వారు మానసికంగా దృఢంగా తయారవ్వాలనీ, యోగా, ప్రాణాయామం, ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. ఐపీఎస్ అక్షరాల్లో చివరి ఇంగ్లిషు అక్షరం- ‘ఎస్’ అంటే సర్వీసు (సేవ) అన్న అర్థాన్ని కూడా గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి తెలిపారు. ప్రజలకూ, దేశానికి సేవ చేయడం అన్న పరమోన్నత లక్ష్యాన్ని మరవొద్దంటూ ఆమె- ప్రొబేషనరీ అధికారులతో అన్నారు.
Click here to see the President's Speech
***
(Release ID: 2060486)