ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను , అత్యధిక సామర్ధ్యం కలిగిన కంప్యూటింగ్ సిస్టమ్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 26 SEP 2024 9:50PM by PIB Hyderabad

నమస్కారం!

గౌరవ ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలోని వివిధ పరిశోధనా సంస్థల గౌరవ డైరెక్టర్లు, ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు మహిళలు , పెద్దలు!

శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ సాధించిన ఒక ముఖ్యమైన విజయానికి  ఈ రోజు ఒక సంకేతంగా నిలుస్తుంది. 21 వ శతాబ్దంలో భారత్ శాస్త్ర, సాంకేతిక, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ఎలా పురోగమిస్తోందో చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ రోజు భారత్ అమితమైన అవకాశాల ప్రపంచంలో కొత్త వాటిని అందిపుచ్చుకుంటోంది. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు మూడు ' పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను' విజయవంతంగా రూపొందించారు. ఈ అత్యాధునిక సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ, పుణె, కోల్ కతాల్లో ఏర్పాటు చేశారు. వీటికి తోడు, అత్యధిక సామర్ధ్యంతో పని చేసే రెండు  కంప్యూటింగ్ సిస్టమ్స్, ఆర్కా , అరుణికా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం లోని శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సోదర సోదరీమణులారా,

నా మూడో పర్యాయం పదవీకాలం ప్రారంభంలో, ప్రస్తుతం ఉన్న 100 రోజుల పరిధికి మించి యువతకు అదనంగా 25 రోజులు ఇస్తామని నేను హామీ ఇచ్చాను. ఆ నిబద్ధతకు అనుగుణంగా, ఈ సూపర్ కంప్యూటర్లను నేటి మన దేశ యువతకు అంకితం చేయడం నాకు సంతోషంగా ఉంది. భారత యువ శాస్త్రవేత్తలు  దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ఈ అధునాతన వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. నేడు ప్రారంభించిన మూడు సూపర్ కంప్యూటర్లు ప్రపంచ వేదికపై శాస్త్ర సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దే భౌతిక శాస్త్రం, ఎర్త్ సైన్సెస్ , కాస్మోలజీ సహా వివిధ రంగాలలో అధునాతన పరిశోధనలకు వీలు కల్పిస్తాయి.

స్నేహితులారా,

ఈ డిజిటల్ విప్లవ యుగంలో కంప్యూటింగ్ శక్తి జాతీయ సామర్ధ్యానికి  పర్యాయపదంగా మారింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనా అవకాశాలు,  ఆర్థిక వృద్ధి, జాతీయ వ్యూహాత్మక సామర్థ్యం, విపత్తుల నిర్వహణ, జీవన సౌలభ్యం, సులభతర వాణిజ్యం ఇలా ప్రతి రంగం సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటింగ్ సామర్ధ్యంతో నే పురోగమిస్తున్నాయి. ఇండస్ట్రీ 4.0లో భారత్ విజయానికి ఇదే పునాది. ఈ విప్లవానికి మన సహకారం కేవలం బిట్స్ అండ్ బైట్లలో కాకుండా, టెరాబైట్లు , పెటాబైట్లలో ఉండాలి. మనం సరైన దిశలో, సరైన వేగంతో పురోగమిస్తున్నాం అనడానికి నేటి విజయం నిదర్శనం.

స్నేహితులారా,

నేటి నవ భారతం కేవలం అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాలతో పోటీ పడటంతో మాత్రమే సంతృప్తి చెందడం లేదు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా మానవాళికి సేవ చేయడం ఈ నవ భారతం బాధ్యతగా భావిస్తోంది. 'పరిశోధన ద్వారా స్వావలంబన’  మన కర్తవ్యం. స్వావలంబన కోసం సైన్స్ మనకు మార్గదర్శక మంత్రంగా మారింది. ఈ మేరకు డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన భావితరాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి పాఠశాలల్లో 10 వేలకు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశాం.

ఇంకా స్టెమ్ సబ్జెక్టుల్లో విద్య కోసం స్కాలర్ షిప్ లను గణనీయంగా పెంచాం. . ఈ ఏడాది బడ్జెట్ లో రూ.లక్ష కోట్ల రీసెర్చ్ ఫండ్ ను ప్రకటించాం. 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ఆవిష్కరణలతో శక్తిమంతం చేయడం, ప్రపంచ సమాజాన్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం.

స్నేహితులారా,

నేడు భారత్ కొత్త నిర్ణయాలు తీసుకోని, కొత్త విధానాలను రూపొందించని రంగం అంటూ ఏదీ లేదు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఇప్పుడు ప్రధాన శక్తిగా అవతరించడమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఇతర దేశాలు బిలియన్ డాలర్లతో సాధించింది, మన శాస్త్రవేత్తలు పరిమిత వనరులతో సాధించారు. ఈ సంకల్పంతోనే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. అదే సంకల్పంతో భారత్  ఇప్పుడు మిషన్ గగన్ యాన్ కు సిద్ధమవుతోంది.. 'భారత్ మిషన్ గగన్ యాన్ కేవలం అంతరిక్షాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, మన శాస్త్రీయ ఆకాంక్షల అపరిమిత శిఖరాలకు ఎదగడం.”  2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం (స్పేస్ స్టేషన్ ) నిర్మించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలిదశకు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

స్నేహితులారా,

సెమీకండక్టర్లు కూడా ఆధునిక అభివృద్ధిలో కీలకంగా మారాయి. అందుకే భారత ప్రభుత్వం 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' అనే ప్రధానమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చాలా తక్కువ సమయంలోనే మనం  ఇప్పటికే సానుకూల ఫలితాలను చూస్తున్నాం. భారత్ తన సొంత సెమీకండక్టర్ అనుకూల వ్యవస్థను  అభివృద్ధి చేస్తోంది, ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగం అవుతుంది. నేడు, భారత దేశ బహుముఖ శాస్త్రీయ పురోగతి మూడు పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల ద్వారా మరింత బలపడుతుంది.

స్నేహితులారా,

ఒక దేశం సాహసోపేతమైన , ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు గొప్ప విజయాన్ని సాధిస్తుంది. సూపర్ కంప్యూటర్ల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు భారత్ ప్రయాణం ఈ దార్శనిక దృక్పథానికి నిదర్శనం. ఒకప్పుడు సూపర్‌కంప్యూటర్లు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే సొంతమనే అభిప్రాయం ఉండేది. అయితే 2015లో మనం నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ను ప్రారంభించాం. నేడు సూపర్ కంప్యూటర్ల రంగంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం చేరుకుంది.  మనం ఇక్కడితో ఆగేది లేదు. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ముందంజలో ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ లో భారత్ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మన జాతీయ క్వాంటమ్ మిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని సమూలంగా మారుస్తుంది, ఐటి, తయారీ, ఎంఎస్ఎం ఇ లు , స్టార్టప్స్ వంటి రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించే అసాధారణ మైన మార్పులను తెస్తుంది,  ప్రపంచానికి నాయకత్వం వహించి కొత్త దిశానిర్దేశం చేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. మిత్రులారా, "సైన్స్ నిజమైన ప్రాముఖ్యత ఆవిష్కరణ,  అభివృద్ధిలో మాత్రమే కాదు, అత్యంత వెనుకబడిన వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో కూడా ఉంది."

మనం అత్యాధునిక సాంకేతికతను స్వీకరిస్తున్నప్పుడు ఈ సాంకేతికతలు పేదలకు సాధికారత వనరుగా మారేలా చూస్తున్నాం. మన యు పి ఐ వ్యవస్థ ద్వారా ప్రతిఫలించే భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఇందుకు స్పష్టమైన నిదర్శనం. భారత్ ను వాతావరణానికి సన్నద్ధంగా, వాతావరణ పరిజ్ఞానం లో సునిశితంగా మార్చాలన్న మన కలను సాకారం చేసే లక్ష్యంతో ఇటీవల 'మిషన్ మౌసం'ను ప్రారంభించాం. సూపర్ కంప్యూటర్లు , హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ (హెచ్ పి సి ) వంటి ఈ రోజు మనం జరుపుకొనే విజయాలు అంతిమంగా మన దేశంలోని పేదలు , గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందిస్తాయి. హెచ్ పి సి వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో వాతావరణాన్ని అంచనా వేసే దేశ శాస్త్రీయ సామర్థ్యం బాగా పెరుగుతుంది. మనం ఇప్పుడు హైపర్-లోకల్ స్థాయిలో మరింత కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించగలుగుతాం, అంటే మనం గ్రామాల వారీగా కూడా కచ్చితమైన అంచనాలను అందించగలం. ఒక సూపర్ కంప్యూటర్ ఒక మారుమూల గ్రామంలోని వాతావరణాన్ని, భూసార పరిస్థితులను విశ్లేషిస్తే, అది కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, లక్షల్లో కాకపోయినా వేలాది మంది జీవితాల్లో పరివర్తనాత్మక మార్పు. ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా చిన్న స్థాయి రైతులకు కూడా ప్రపంచంలోనే అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.

ఈ పురోగతి రైతులకు, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాలలో రైతులకు అనేక లాభాలను అందిస్తుంది.  ఎందుకంటే వారికి ప్రపంచ స్థాయి విజ్ఞానం అందుబాటులో ఉంటుంది. వారు తమ పంటల గురించి మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు , మత్స్యకారులు సముద్రానికి వెళ్ళేటప్పుడు మరింత కచ్చితమైన సమాచారంతో ప్రయోజనం పొందుతారు. రైతులకు నష్టాలను తగ్గించడానికి కొత్త మార్గాలను కూడా కనుగొంటాం. వారు బీమా పథకాలను మరింత మెరుగ్గా పొందడానికి ఇది దోహదపడుతుంది.ఇంకా , ఈ సాంకేతికత భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూర్చే కృత్రిమ మేధ , మెషిన్ లెర్నింగ్ నమూనాలను సృష్టించడానికి మనకు అనుమతిస్తుంది. దేశీయంగా సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేయగల మన సామర్థ్యం కేవలం దేశం గర్వపడేలా చేయడం మాత్రమే కాదు, సమీప భవిష్యత్తులో సాధారణ పౌరుల దైనందిన జీవితంలో పరివర్తనాత్మక మార్పులకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యుగంలో సూపర్ కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ తన 5జీ నెట్వర్క్ ను అభివృద్ధి చేసినట్లే, ప్రధాన కంపెనీలు ఇప్పుడు భారత్ లో మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్నందున, ఇది దేశ డిజిటల్ విప్లవానికి కొత్త ఊపునిచ్చింది. ఫలితంగా దేశంలోని ప్రతి పౌరుడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని, దాని ప్రయోజనాలను విస్తరించగలిగాం. అదేవిధంగా భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే మన సామర్థ్యం, మేకిన్ ఇండియా విజయం సామాన్యులను భవిష్యత్తు కోసం సన్నద్ధం చేస్తాయి. సూపర్ కంప్యూటర్లు అన్ని రంగాల్లో కొత్త పరిశోధనలను ముందుకు నడిపిస్తాయి, కొత్త మార్గాలను, , అవకాశాలను సృష్టిస్తాయి. దీని ద్వారా సాధారణ ప్రజలు వెనుకబడకుండా ప్రపంచంతోపాటు ముందుకు వెళ్లగలిగీలా నేరుగా లబ్ది పొందుతారు,

భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అతి పిన్న వయసు దేశంగా ఉన్నప్పుడు- ఇప్పుడు భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నప్పుడు  ఇది నా దేశ యువతకు- లెక్కలేనన్ని కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే క్షణం. ఈ అద్భుతమైన విజయాలు సాధించినందుకు యువతతో పాటు నా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మన యువత, పరిశోధకులు ఈ అధునాతన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని సైన్స్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతారని ఆశిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు!


(Release ID: 2059720) Visitor Counter : 73