వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మొబైల్ - ఎలక్ట్రానిక్స్ రంగంలో రిపేరబిలిటి ఇండెక్స్ సంబంధిత ఫ్రేమ్ వర్క్ రూపకల్పనకో సంఘాన్ని నియమించిన కేంద్రం


వినియోగదారులకు సాధికారిత కల్పన, సాంకేతిక పరిశ్రమలో దీర్ఘకాలిక విధానాల ప్రోత్సాహానికి ఉద్దేశించిన రిపేరబిలిటి ఇండెక్స్ కోసం ఈ సంఘం ఒక పటిష్ట ఫ్రేమ్ వర్క్ ను సిఫారసు చేయనుంది

Posted On: 24 SEP 2024 3:14PM by PIB Hyderabad

మరమ్మతు యోగ్యతా సూచి (రిపేరబిలిటి ఇండెక్స్)  కోసం ఒక పటిష్ట ఫ్రేమ్‌వర్క్ ను సిఫారసు చేయడం, వినియోగదారులకు సాధికారితను అందించడం, సాంకేతిక పరిశ్రమలో దీర్ఘకాలం పాటు కొనసాగే విధానాలను ప్రోత్సహించడానికి వినియోగదారు వ్యవహారాల విభాగం (డిఒసిఎ) ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీకి డిఒసిఎ అదనపు కార్యదర్శి శ్రీ భరత్ ఖేడా అధ్యక్షత వహిస్తారు.  రిపేరబిలిటి ఇండెక్స్ ను రూపొందించడం ద్వారా వినియోగదారులకు వారు ఉపయోగించే ఉత్పాదనల సంబంధిత మరమ్మతు సమాచారంలో అధికతమ పారదర్శకత్వాన్ని అందించడంతో పాటు మరింత ఎక్కువ కాలం మనుగడలో ఉండే సాంకేతిక పరిశ్రమను పెంచి పోషించాలన్నదే డిఒసిఎ ఆశయం.

వినియోగదారు హక్కులను, సుస్థిరతను ప్రోత్సహించే దిశ లో కీలక నిర్ణయాన్ని తీసుకొంటూ మొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరమ్మతు సంబంధిత హక్కు పై జాతీయ కార్యశాలను గత ఆగస్టు 29న నిర్వహించారు.  ఈ కార్యశాల రిపేరబిలిటి ఇండెక్స్ కు దోహదం చేసే  అంశాల మదింపునకు ఉద్దేశించిన ఫ్రేమ్‌వర్క్ పై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కృషి చేయడానికి, ఉత్పాదన రూపురేఖలలో దీర్ఘకాలికత్వాన్ని  ప్రోత్సహించడానికి, మరమ్మతు సంబంధిత సమాచారాన్ని పొందడంలో ప్రజాస్వామ్యీకరణకు, ఇంకా ఉత్పాదనల తయారీని ఆపివేసిన తరువాత సైతం విడి భాగాల లభ్యతకు  వీలు కల్పించడానికి సంబంధిత వర్గాలన్నిటిని ఒక చోటుకు చేర్చింది.

మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ కు గిరాకీ అమిత వేగంగా పెరుగుతుంటుందని, ఈ రంగంలో ఉత్పాదనలకు జీవన కాలం చాలా తక్కువగా ఉంటుందన్న భావన ఉంది.  కార్యశాలలో జరిగిన చర్చోపచర్చలలో రిపేరబిలిటి ఇండెక్స్ తాలూకు ఫ్రేమ్‌వర్క్ కు ఆయా ఉత్పాదనల మరమ్మతు యోగ్యతను గురించిన ముఖ్య సమాచారాన్ని వినియోగదారులకు అందించడంతో పాటు విడిభాగాలు నిరంతరాయంగా లభ్యమయ్యేటట్టు చూడడమే ధ్యేయంగా ఉండాలన్న అంశంపై విస్తృత స్థాయి ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఇది  వినియోగదారులు అన్నిటినీ తెలుసుకొని ఆ తరువాతనే ఆ యా ఉత్పాదనల కొనుగోలు విషయంలో తగిన నిర్ణయాలను తీసుకో గలుగుతారన్న అభిప్రాయానికి దారితీసింది.

రిపేరబిలిటి ఇండెక్స్  వినియోగదారుల ప్రయోజనాలపై దృష్టి పెట్టేదిగా ఉండాలి.  ఇది వినియోగదారులు ఒక ఉత్పాదనకు సంబంధించిన మరమ్మతు యోగ్యత పట్ల కలిగే అవగాహన ఆధారంగా ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారని సూచిస్తోందన్న మాట. పైపెచ్చు, ఈ ఇండెక్స్ ఒక ఉత్పాదన తాలూకు మరమ్మత్తు యోగ్యతను ఏ విధంగా అంచనా కట్టాలో ప్రామాణికీకరిస్తుంది.  దీనితో రిపేరబిలిటి ఇండెక్సింగ్ సాయంతో వినియోగదారులు వివిధ ఉత్పాదనలను ఇట్టే పోల్చుకోవడం సాధ్యపడుతుంది.  అంతేకాకుండా మొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పాదనలలో సూక్ష్మాలను ఎరిగి మరీ నిర్ణయాలు తీసుకోగలిగే వ్యవస్థ (ఇకోసిస్టమ్) రూపుదాల్చగలదు.

మరమ్మతు యోగ్యత తాలూకు మదింపును ప్రామాణికీకరించడం ద్వారా సదరు ఇండెక్స్, ఉత్పాదనలను వినియోగదారులు సులభంగా పోల్చుకొని ఆయా ఉత్పాదనల యుక్తాయుక్త వినియోగంతో తులతూగే ఐచ్ఛికాలను ఎంపిక చేసుకొనేందుకు తగిన వ్యవస్థను ఏర్పరచ గలుగుతుంది.   ఈ ప్రకారంగా, మరమ్మతుకు అనువైన స్థితిని సృష్టించడం అంటే అది తక్కువ ఖర్చులో మరమ్మతు ఐచ్ఛికాల ప్రాప్తికి పూచీ పడడం ఒక్కటే కాకుండా ఉత్పాదనల మరమ్మతులో సమాచారం పరంగా ఎలాంటి అంతరాలకు తావు ఇవ్వకుండా వినియోగదారు సంతృప్తిని మెరుగు పరచనూ గలుగుతుంది.

మరమ్మతు సంబంధిత వ్యవస్థలోని కీలక అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

i.        మరమ్మతుకు సంబంధించిన సమగ్ర సమాచారం:  మరమ్మతులకు సంబంధించిన విశేషాలతో కూడిన ఒక చిన్న పుస్తకం/మీకు మీరుగా పూర్తి చేసుకో దగిన కార్యాలు (DIYs), డయాగ్నోస్టిక్స్ లతో పాటు అవసర పడే పనిముట్లు, భాగాల జాబితా.

ii.        విడిభాగాల లభ్యత: తేలికగా గుర్తించ దగినటువంటి,  సకాలంలో అందే విడిభాగాలు.

  iii.     తక్కువ ఖర్చులో పనిముట్లు : పెద్ద ఖరీదేమీ కానటువంటి, ఎక్కడైనా లభించే, వినియోగదారులకు సురక్షితంగా ఉండేటటువంటి పనిముట్లు

  iv.        మాడ్యులర్ డిజైన్: స్వతంత్ర లభ్యత, మాడ్యులారిటీ లను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ముఖ్య భాగాలు.
   v.       చౌకగా లభ్యత:  మరమ్మతుకు అయ్యే ఖర్చు, శ్రమ సంబంధి వ్యయాలు వినియోగదారులు భరించ గలిగే స్థాయిలో ఉండేటట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

పైన ప్రస్తావించిన అవసరాలను లెక్క లోకి తీసుకొని సంఘం  విధానాలు/నియమాలు/మార్గదర్శకాలతో కూడిన ఒక ఫ్రేమ్‌వర్క్ ను సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు.  ఈ ఫ్రేమ్ వర్క్ మరమ్మతు యోగ్యత తో పాటు రిపేరబిలిటి ఇండెక్స్ ను వర్తమాన క్రమబద్ధీకరణ నిబంధనలకు తులతూగే విధంగా ఉంటూ, వినియోగదారులు వారి వద్ద ఉన్న మొబైల్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత ఉత్పాదనలను మళ్ళీ మళ్ళీ వినియోగించుకొనేందుకు మొగ్గు చూపే విధంగా కూడా తీర్చి దిద్దుతుంది.

సంఘం సభ్యులలో డిఒసిఎ  సంయుక్త కార్యదర్శి శ్రీ అనుపమ్ మిశ్రా; ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MiETY), ఇంకా ఎమ్ఎస్ఎమ్ఇ ల సీనియర్ ప్రతినిధులు; నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్‌టిహెచ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆలోక్ కుమార్ శ్రీవాస్తవ;  డిఒసిఎ డైరెక్టట్ డాక్టర్ ఎ.బి.ఎస్. శాలిని; ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్‌మన్ శ్రీ పంకజ్ మొహింద్రూ లు ఉన్నారు.  వారితో పాటు పలు కంపెనీల నుంచి మరికొందరు ప్రతినిధులూ ఈ కమిటీలో సభ్యులే.  వారిలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్  సీనియర్ డైరెక్టర్, గ్రూప్ లీడర్ శ్రీ రాజ్ శావు; గూగల్ ఇండియా లో ప్రభుత్వ వ్యవహారాలు మరియు ప్లాట్ ఫార్మ్ & డివైసెస్ పాలసీ అధికారిణి అదితి చతుర్వేది; హెచ్‌ఎమ్ డి మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ (ఇండియా రీజన్) అధికారి శ్రీ వాసుదీప్; వినియోగదారు హక్కుల తరఫున పోరాడుతున్న కార్యకర్త పుష్ప గిరిమాజీ ఇంకా ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా ఉన్నారు.  ఈ కమిటీ దేశ స్థితిగతులకు సరిపోలే రిపేరబిలిటి ఇండెక్స్ సంబంధిత ఫ్రేమ్ వర్క్ తో సహా ఒక సమగ్ర నివేదిక ను ఈ ఏడాది నవంబరు 15వ తేదీ కల్లా సమర్పించనుంది.

 

***


(Release ID: 2058416) Visitor Counter : 59