ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఒడిశాలోని భువనేశ్వర్‌లో అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం ‘సుభద్ర’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


10 లక్షల మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీ ప్రారంభం

రూ.2800 కోట్లకుపైగా విలువైన రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపన.. జాతికి అంకితం

రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన

26 లక్షల మంది ‘పిఎంఎవై’ లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలో ప్రధాని మమేకం

అదనపు గృహవసతిపై కుటుంబాల అధ్యయనం కోసం ‘ఆవాస్+ 2024’ అనువర్తనం ప్రారంభం

‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన- పట్టణ 2.0’ (పిఎంఎవై-యు) అమలుకు మార్గదర్శకాలు జారీ

‘‘మాపై ఎనలేని నమ్మకం ప్రదర్శించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అనుక్షణం శ్రమిస్తాం’’

‘‘కేంద్రంలోని ‘ఎన్‌డిఎ’ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలనలో పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారతకు
కీలక నిర్ణయాలు తీసుకుంది’’

‘‘జనాభాలో సగమైన మహిళా శక్తికి సమాన భాగస్వామ్యం ఉన్నపుడే ఏ దేశమైనా... రాష్ట్రమైనా పురోగమించగలదు’’

‘‘భారతదేశంలో మహిళా సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక ప్రతీక’’

‘‘అసాధారణ సంకల్ప బలంతో సర్దార్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేశారు’’

Posted On: 17 SEP 2024 2:37PM by PIB Hyderabad

   మహిళా సాధికారత లక్ష్యంగా ఒడిషా ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక ‘సుభద్ర’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భువనేశ్వర్‌ నగరంలో శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలో విశిష్ట, అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం కాగా, దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇందులో భాగంగా 10 లక్షల మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీని కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ’ లబ్ధిదారులకు ‘ఆన్‌లైన్’ మార్గంలో తొలి విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. దేశంలోని 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారి గృహప్రవేశ వేడుకలోనూ ఆయన మమేకమయ్యారు. ‘పిఎంఎవై-గ్రామీణ’ కింద అదనపు గృహవసతి కల్పనపై కుటుంబాల అధ్యయనం కోసం ‘ఆవాస్+ 2024’ పేరిట రూపొందించిన అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0 (పిఎంఎవై-యు) అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

   ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నేటి కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామినయ్యే అవకాశం ఇచ్చారంటూ ప్రజలకు తొలుత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పూరీ జగన్నాథునికి, ప్ర‌జ‌ల‌కు సేవచేసే అవ‌కాశం ఆ దేవదేవుని ఆశీర్వాదంతోనే లభిస్తుందని భక్తిపూర్వకంగా ప్రకటించారు. ఇది గణేశ ఉత్సవాల కీలక సమయం కావడంతోపాటు అనంత చతుర్దశి, విశ్వకర్మ పూజ కూడా కలిసివచ్చిన పవిత్ర సందర్భమని ప్రధాని వ్యాఖ్యానించారు. భగవాన్ విశ్వకర్మ రూపంలో నైపుణ్యాన్ని, శ్రమశక్తిని పూజించే ఏకైక దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటేనని ప్రధాని అన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి పవిత్ర పర్వదినాన ఒడిషా తల్లులు, సోదరీమణుల కోసం ‘సుభద్ర’ పథకాన్ని ప్రారంభించడం తనకు లభించిన మహదవకాశంగా అభివర్ణించారు.

   జగన్నాథ స్వామి వెలసిన ఈ నేలనుంచి దేశంలోని 30 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు  స్వాధీనం చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 26 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 4 లక్షల మందికి ఇళ్ల తాళాలు అప్పగించామని ఆయన తెలిపారు. అదే సమయంలో ఇవాళ ఒడిషాలో రూ.వేలాది కోట్లకుపైగా విలువైన అనేక  అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించడాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలతోపాటు దేశ పౌరులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

   ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తాను, నేడు తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. ‘‘రెండు ఇంజన్ల’’ ప్రభుత్వం ఏర్పడితే ఒడిషా రాష్ట్రం ప్రగతి-శ్రేయస్సు దిశగా దూసుకెళ్లగలదని ఎన్నికల ప్రచార సభల్లో తాను ప్రకటించడాన్ని ప్రజలకు గుర్తుచేశారు. గ్రామీణులు, అట్టడుగువర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, యువకులు, మధ్యతరగతి ప్రజానీకంసహా సమాజంలోని అన్ని వర్గాల కలలూ ఇప్పుడు తప్పక నెరవేరగలవని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తామిచ్చిన వాగ్దానాలు త్వరితగతిన సాకారం అవుతున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటిదాకా నెరవేర్చిన హామీలను ఏకరవు పెడుతూ- ప్రజల సౌకర్యార్థం పూరీలోని శ్రీ  జగన్నాథ  ఆలయ నాలుగు ద్వారాలనూ తెరిచామన్నారు. అలాగే ఆలయ రత్న భాండాగారాన్ని తెరిపించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సేవకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని, సమస్యల పరిష్కారం దిశగా వారి ముంగిటకు వస్తున్నదని హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని ప్రశంసించారు.

   కేంద్రంలో ‘ఎన్‌డిఎ’ కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ రోజుకు ఒక ప్రత్యేకత  ఏర్పడిందని ప్రధాని అన్నారు. తొలి వందరోజుల్లో దేశంలోని పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ప్రధాన నిర్ణయాలను వివరిస్తూ- పేదల కోసం 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, యువతరానికి రూ.2 లక్షల కోట్ల విలువైన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్యాకేజీ కింద ప్రైవేటు రంగంలో తొలి ఉద్యోగం పొందినవారికి ప్రభుత్వం మొదటి జీతం చెల్లిస్తుందని చెప్పారు. మరోవైపు వైద్య కళాశాలల్లో అదనంగా 75,000 సీట్లతోపాటు పక్కా రహదారులతో 25,000 గ్రామాల అనుసంధానానికి ఆమోదం తెలిపామన్నారు. అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు దాదాపు రెట్టింపైందని చెప్పారు. సుమారు 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టుతోపాటు ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ పథకం ప్రకటించామన్నారు. వృత్తి నిపుణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఆదాయపు పన్ను తగ్గించామని తెలిపారు.

   దేశవ్యాప్తంగా 11 లక్షల మందికిపైగా మహిళలు ‘లక్షాధికారి సోదరీమణులు’గా మారడాన్ని గత 100 రోజుల్లో చూశామని ప్రధాని గుర్తుచేశారు. అలాగే నూనెగింజలు, ఉల్లి రైతుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మన రైతులను ప్రోత్సహించడంలో భాగంగా విదేశీ నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచామని తెలిపారు. ఎగుమతులకు ప్రోత్సాహం దిశగా బాస్మతి బియ్యంపై సుంకాన్ని తగ్గించామని, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పెంచామని చెప్పారు. ఈ నిర్ణయాల వల్ల కోట్లాది అన్నదాతలకు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ‘‘మొత్తంమీద గడచిన 100 రోజుల పాలనలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కల్పించే అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం’’ అని ప్రధాని మోదీ ఉద్వేగభరిత వివరణ ఇచ్చారు.

   జనాభాలో సగభాగమైన మహిళా శక్తికి సమాన భాగస్వామ్యం ఉంటేనే ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోగమించగలవని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఆ మేరకు మహిళల ప్రగతి, సాధికారతలపైనే ఒడిషా పురోగమనం ఆధారపడి ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఓ జానపద గాథను ఉటంకిస్తూ- పూరీ జగన్నాథునితో పాటు సుభద్రా దేవి కూడా ఇక్కడ పూజలందుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో  ‘‘సుభద్రా దేవికి ప్రతిరూపాలైన ఇక్కడి తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరికీ నమస్కరిస్తున్నాను’’ అన్నారు.

   రాష్ట్రంలో పాలన పగ్గాలు స్వీకరించిన బీజేపీ కొత్త ప్రభుత్వం తన తొలి నిర్ణయాల్లో భాగంగా ఒడిషాలోని తల్లులు, సోదరీమణులకు ‘సుభద్ర యోజన’ను బహూకరించడం హర్షణీయమని ప్రధాని అన్నారు. దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.50,000 వంతున నేరుగా జమ అవుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఈ పథకాన్ని భారత రిజర్వు బ్యాంకు ‘డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టు’తో అనుసంధానించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు దేశంలోనే తొలి డిజిటల్ కరెన్సీ పథకంలో భాగమైనందుకు ఒడిషా మహిళలను అభినందించారు.

   రాష్ట్రంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు ‘సుభద్ర’ పథకం ప్రయోజనం అందేవిధంగా అనేక ప్రచార యాత్రలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. తద్వారా ఈ పథకం సంబంధిత  సమస్త సమాచారంపై వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంతో ఈ సేవలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచేదిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు చూపుతున్న చొరవను ప్రధాని అభినందించారు.

   ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘దేశంలో మహిళా సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక ప్రతీక’’ అని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద మంజూరు చేసే గృహాలను కుటుంబంలోని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కుటుంబాలు నేడు గృహప్రవేశం చేశాయని, 15 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆమోద పత్రాలు అందజేశామని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వం తొలి 100 రోజుల స్వల్ప వ్యవధిలోనే 10 లక్షల మందికిపైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ అయినట్లు గుర్తుచేశారు. ‘‘ఈ పవిత్ర కార్యాన్ని ఇవాళ ఒడిషా నుంచి నిర్వర్తించాం. రాష్ట్రంలోని పేద కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో ఇందులో భాగమయ్యాయి’’ అని ప్రధాని మోదీ తెలిపారు. పక్కా ఇళ్లు పొందిన లక్షలాది కుటుంబాలకు నేడు కొత్త జీవితం ప్రారంభం అవుతోందన్నారు.

   దీనికిముందు రోజున ఓ గిరిజన కుటుంబం గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న తన అనుభవాన్ని ప్రధాని సభికులతో పంచుకున్నారు. ఆ సమయంలో వారి హృదయాల్లో పెల్లుబికిన సంతోషం, వారి ముఖాల్లో పూసిన చిరునవ్వులు, హావభావాల్లో ఎనలేని సంతృప్తిని తాను ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. ‘‘ఈ అనుభవం.. అనుభూతి నా జీవితాంతం అమూల్య సంపదగా మిగిలిపోతాయి. పేదలు, దళితులు, అణగారిన, గిరిజన వర్గాల జీవితంలో రూపాంతరీకరణే నా ఆనందానికి కారణం... ఇది మరింత కష్టపడి పనిచేసేలా నాకు ఉత్తేజమిస్తుంది’’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.

   అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదడానికి అవసరమైన వనరులన్నీ ఒడిషా సొంతమని శ్రీ మోదీ అన్నారు. యువతరం ప్రతిభ, మహిళా శక్తి, సహజ వనరులు, పరిశ్రమల స్థాపన అవకాశాలు, పర్యాటక రంగ ప్రగతికి పలు మార్గాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలోగల బీజేపీ ప్రభుత్వం ఒడిషాకు సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలంతో పోలిస్తే నేడు కేంద్రం నుంచి మూడు రెట్లు అధిక నిధులు అందుతున్నాయని తెలిపారు. మునుపెన్నడూ వెలుగు చూడని పథకాల ఇప్పుడు అమలులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా- ఆయుష్మాన్ యోజనను ప్రస్తావిస్తూ- ఒడిషా పేదలకు ఇవాళ ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం లభిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వార్షికాదాయంతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని వెల్లడించారు. ‘‘ఇది లోక్‌సభ ఎన్నికల నాడు మోదీ ఇచ్చిన హామీ... ఇప్పుడు దాన్ని నెరవేర్చారు’’ అని వ్యాఖ్యానించారు.

   పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఒడిషాలోని దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు ప్రధాన లబ్ధిదారులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, గిరిజన మూలాలైన అడవులు-భూమిపై హక్కుల పరిరక్షణ, యువతకు విద్య-ఉపాధి అవకాశాల కల్పన, ఒడిషా గిరిజన మహిళను దేశానికి రాష్ట్రపతిని చేయడం వంటివన్నీ ఈ ప్రభుత్వం తొలిసారి చేపట్టినవేనని ప్రధాని ఉద్ఘాటించారు.

   ఒడిషాలో అనేక గిరిజన ప్రాంతాలు, సమాజాలు తరతరాలుగా ప్రగతికి దూరమయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గిరిజన తెగలలో అత్యంత వెనుకబడిన వారి సముద్ధరణ దిశగా ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి జన్మన్ యోజన’ గురించి ఆయన ప్రస్తావించారు. దీనికింద ఇప్పటిదాకా రాష్ట్రంలో 13 వెనుకబడిన తెగలను గుర్తించామని చెప్పారు. ఈ వర్గాలన్నింటికీ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పథకాల ప్రయోజనాలను చేరువ చేస్తున్నదని ప్రధాని మోదీ వివరించారు. ముఖ్యంగా కొడవలి కణ రక్తహీనత (సికిల్ సెల్) వ్యాధి నుంచి గిరిజన ప్రాంతాల విముక్తి కార్యక్రమం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికింద గడచిన 3 నెలల్లో 13 లక్షల మందికిపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

   ‘‘సంప్రదాయ నైపుణ్యాల పరిరక్షణపై భారత్ నేడు మునుపెన్నడూ లేనిరీతిలో దృష్టి సారిస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో వందల-వేల ఏళ్లుగా కమ్మరి, కుమ్మరి, స్వర్ణకార, శిల్పకళ వంటి వృత్తుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుడు విశ్వకర్మ జయంతి నాడు వారి సంక్షేమం కోసం రూ.13వేల కోట్లతో ‘విశ్వకర్మ యోజన’ను ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా 20 లక్షల మంది నమోదు చేసుకుని, నైపుణ్య శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అటుపైన వారికి ఆధునిక ఉపకరణాల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రూ.వేలలో హామీరహిత రుణాలు లభిస్తాయన్నారు. పేదలకు ఆరోగ్యంతోపాటు సామాజిక-ఆర్థిక భద్రతలకు హామీ ఇవ్వడం వంటివి వికసిత భారతదేశానికి నిజమైన బలమని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

   అపార ఖనిజ నిక్షేపాలు, సహజ సంపదతో విలసిల్లే సుదీర్ఘ ఒడిషా తీరప్రాంత ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- రాష్ట్రాన్ని బలోపేతం చేసేదిశగా ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘రాబోయే ఐదేళ్లలో ఒడిషాలోని రహదారులు-రైల్వేల అనుసంధానాన్ని కొత్త శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత మనమీద ఉంది’’ అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన రైలు-రోడ్డు సంబంధిత ప్రాజెక్టుల గురించి శ్రీ మోదీ వివరించారు. ఈ మేరకు లాంజీగఢ్ రోడ్-అంబోదలా-డోయికలు రైలు మార్గం, లక్ష్మీపూర్ రోడ్-సింగారం-తిక్రీ రైలు మార్గం, ఢెంకణాల్-సదాశివపూర్-హిందోల్ రోడ్ రైలు మార్గాలను జాతికి అంకితం చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. అలాగే జైపూర్-నవరంగ్‌పూర్ కొత్త రైలు మార్గానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే పారాదీప్ రేవునుంచి అనుసంధానం మెరుగు దిశగా నేటినుంచి పని ప్రారంభమైందని తెలిపారు. ఒడిషాలో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని శ్రీ మోదీ తెలిపారు. పూరి-కోణార్క్ రైలు మార్గంతోపాటు అత్యాధునిక ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ పనులు కూడా త్వరలో మొదలవుతాయిన తెలిపారు. ఈ విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు ఒడిషాకు అపార అవకాశాలను చేరువ చేస్తాయన్నారు.

   దేశం ఇవాళ ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించుకుంటున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆనాటి అత్యంత కల్లోల పరిస్థితుల నడుమ భారత వ్యతిరేక ఛాందస శక్తుల నిరోధం ద్వారా హైదరాబాద్‌ విముక్తిలో సర్దార్ పటేల్ అసాధారణ సంకల్ప బలం ప్రదర్శించారని గుర్తుచేశారు. దేశాన్ని ఏకీకృతం చేయడంలో ఆ మహనీయుడి కృషిని కొనియాడుతూ- ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవమంటే కేవలం ఒక తేదీ కాదు... దేశ సమగ్రతకు, మాతృభూమిపై మన కర్తవ్యానికీ స్ఫూర్తి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   దేశాన్ని వెనక్కి నెట్టే సవాళ్లను ప్రస్తావిస్తూ- స్వాతంత్ర్య పోరాటంలో గణేశ ఉత్సవాల ప్రాముఖ్యాన్ని ప్రధాని వివరించారు. జాతీయ స్ఫూర్తిని రగిలించే ఉపకరణంగా, వలస పాలకుల విభజించి పాలించే వ్యూహాలపై పోరులో ఆయుధంగా లోకమాన్య తిలక్ ఈ వేడుకలను బహిరంగంగా నిర్వహించారని గుర్తుచేశారు. ‘‘గణేశ ఉత్సవం ఐక్యతకు ప్రతీకగా, వివక్ష-కులతత్వానికి అతీతంగా మారుతోంది’’ అన్నారు. ఈ ఉత్సవాల సమయంలో యావత్ సమాజంలో ఐక్యత ఇనుమడిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

   కులమతాల ప్రాతిపదికన సమాజాన్ని విచ్ఛిన్నం చేయజూసే శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. గణేశ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై కొన్ని వర్గాలు విద్వేషం వెళ్లగక్కడం, కర్ణాటకలో గణేశ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం వంటివి దురదృష్టకర సంఘటనలుగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి విద్వేషపూరిత ధోరణులు, సమాజాన్ని కలుషితం చేసే మనస్తత్వం దేశానికి అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఇటువంటి శక్తులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు.

   చివరగా- ఒడిషాతోపాటు దేశాన్ని విజయవంతంగా సరికొత్త శిఖరాగ్రాలకు చేర్చడంలో అనేక భారీ మైలురాళ్లను అధిగమించగలమని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తదనుగుణంగా భవిష్యత్ ప్రగతి పయనంలో వేగం ఇనుమడిస్తుందని హామీ ఇస్తూ ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఒడిషా గవర్నర్ శ్రీ రఘువర్ దాస్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝీ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుభద్ర’ పథకం కింద 21-60 ఏళ్ల మధ్య వయస్కులైన అర్హతగల లబ్ధిదారులకు 2024-25 నుంచి 2028-29 మధ్య ఐదేళ్లలో రూ.50,000/- అందుతాయి. ఈ మేరకు ఏటా రూ.10,000 వంతున రెండు సమాన వాయిదాల్లో వారి డిబిటి-ఆధారిత బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. ఈ నిధుల పంపిణీలో భాగంగా ప్ర‌ధానమంత్రి తొలివిడతగా 10 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాలకు సొమ్ము బదిలీని ప్రారంభించారు.

   ప్ర‌ధానమంత్రి భువనేశ్వర్‌లో రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిద్వారా ఒడిషాలో రైల్వే మౌలిక సదుపాయాలు, అనుసంధానం మెరుగుపడటమే కాకుండా ప్రాంతీయ వృద్ధికి బాటలు పడతాయి.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 14 రాష్ట్రాల పరిధిలోని ‘పిఎంఎవై-జి’ కింద సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులకు తొలివిడత ఆర్థిక సహాయాన్ని ప్రధాని విడుదల చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగాగల 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలో భాగంగా వారికి ఇళ్ల తాళాలను అందజేశారు. మరోవైపు ‘పిఎంఎవై-జి’ కింద అదనపు గృహవసతి కల్పన దిశగా కుటుంబాలపై అధ్యయనం కోసం ‘ఆవాస్ + 2024’ అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0’ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేశారు.

 

 

***

MJPS/SR/TS



(Release ID: 2055848) Visitor Counter : 46