భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
మిషన్ మౌసం ఆవిష్కరణ: 2 వేల కోట్లతో 2026 నాటికి భారత వాతావరణ, శీతోష్ణస్థితి అంచనా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమం
‘మిషన్ మౌసం’పై భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ స్థాయి పత్రికా సమావేశం
Posted On:
13 SEP 2024 12:05PM by PIB Hyderabad
మిషన్ మౌసంపై న్యూఢిల్లీలోని పృథ్వి భవన్‌లో భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్(ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్) హెడ్ డాక్టర్ వీఎస్ ప్రసాద్‌తో కలిసి భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి(ఎంఓఈఎస్) డాక్టర్ ఎం రవిచంద్రన్ మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 11న రెండేళ్ల కాలంలో చేపట్టేందుకు రూ.2,000 కోట్లతో ప్రతిష్ఠాత్మక మిషన్ మౌసం కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా భారత్‌ను సన్నద్ధం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. దేశంలో వాతావరణ, శీతోష్ణస్థితిని పరిశీలించడం, ఆర్థం చేసుకోవడం, అధ్యయనం చేయడం, అంచనా వేయడాన్ని మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మరింత మెరుగ్గా, ఉపయోగకరంగా, సమయానుగుణంగా సేవలు అందించడం దీని ఉద్దేశ్యం.
ఫోటో రైటప్: న్యూఢిల్లీలోని ఎంఓఈఎస్ కేంద్ర కార్యాలయంలో మిషన్ మౌసంపై విలేకరుల సమావేశంలో ఎంఓఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ (మధ్యలో), ఐఎండీ డీజీ (ఎడమ వైపు), ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్ హెడ్ (కుడి వైపు).
ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ ను సన్నద్ధంగా చేయాలనే లక్ష్యంతో మిషన్ మౌసం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాతావరణ మార్పు ప్రభావాన్ని, తీవ్ర వాతావరణ పరిస్థితులను తగ్గించడం, ప్రజలు వీటిని తట్టుకునేలా పటిష్టం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. 2024-26 మధ్యకాలంలో మిషన్ మౌసంను అమలు చేస్తారు.
ప్రతిపాదిత “మిషన్ మౌసం” లక్ష్యాల్లో కొన్ని:
* అధునాతన వాతావరణ పర్యవేక్షణ సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం.
* ప్రాంతాల వారీగా, స్వల్పకాలంలో మెరుగ్గా వాతావరణాన్ని అత్యంత కచ్చితత్వంతో పరిశీలించే వ్యవస్థల అమలు.
* ఆధునిక పరికరాలతో కూడిన అత్యాధునిక రాడార్లు, ఉపగ్రహాల ఏర్పాటు.
* అత్యంత సామర్ధ్యంతో పని చేసే కంప్యూటర్ల ఏర్పాటు.
* వాతావరణ, శీతోష్ణస్థితి ప్రక్రియలను మరింత మెరుగ్గా అర్థం చేసుకొని, అంచనా వేసే సామర్థ్యాలను పెంచుకోవడం.
* కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను వినియోగించి భూవ్యవస్థ నమూనాలను, డాటా ఆధారిత పద్ధతులను అభివృద్ధి చేయడం.
* వాతావరణ నిర్వహణకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేయడం.
* దూర ప్రాంతం వారికి చేరే విధంగా అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేయడం.
* సామర్థ్యాలను పెంచుకోవడం.
నూతనంగా 50 డాప్లర్ వెదర్ రాడార్లు(డీడబ్ల్యూఆర్), 60 రేడియో సాండే/రేడియో విండ్(ఆర్ఎస్/ఆర్‌డబ్ల్యూ) కేంద్రాలు, 100 డిస్డ్రోమీటర్లు, 10 విండ్ ప్రొఫైలర్లు, 25 రేడియోమీటర్లు, ఒక అర్బన్ టెస్ట్ బెడ్, ఒక ప్రాసెస్ టెస్ట్ బెడ్, ఒక సముద్ర పరిశోధన కేంద్రం, ఎగువ వాయువును పరిశీలించగల సామర్థ్యంతో 10 మెరైన్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రాంతాలవారీగా, స్వల్పకాలంలో మెరుగ్గా వాతావరణ అంచనాలు, వాయు నాణ్యత సమాచారం చెప్పడానికి, దీర్ఘకాలంలో వాతావరణ నిర్వహణను మిషన్ మౌసం మెరుగుపరుస్తుందని ఎంఓఈఎస్ కార్యదర్శి తెలిపారు. “2026 మార్చి నాటికి వాతావరణాన్ని మెరుగ్గా పరిశీలించేందుకు రాడార్ల వ్యవస్థను విస్తృతం చేయాలని, విండ్ ప్రొఫైలర్లను, రేడియో మీటర్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. వాతావరణ అంచనాకు సంబంధించిన ప్రక్రియలను, శాస్త్రాలను మెరుగ్గా అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం. వాతావరణ పరిశీలనలకు సంబంధించి మెరుగైన సమాచారాన్ని సేకరిస్తాం. వాతావరణ అంచనాలను మెరుగుపర్చడానికి మేం భౌతికశాస్త్ర ఆధారిత సంఖ్యా పద్ధతులను, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సమాచారాన్ని వినియోగిస్తాం. వాతావరణ శాస్త్రాల్లో పురోగతి కోసం మరిన్ని ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చూడబోతున్నాం” అని డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు.
ప్రజలకు మేలు జరిగేలా సామర్థ్య నిర్మాణంతో పాటు సమాచార, సేవలను విస్తరించనున్నారు. దేశంలో ఏ వాతావరణ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వదిలిపెట్టరు. వాతావరణ, శీతోష్ణస్థితి, ప్రకృతి విపత్తులకు సంబంధించి ఎంఓఈఎస్ మెరుగైన సేవలు అందిస్తుందని, తద్వారా వివిధ రంగాలకు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందటానికి దోహదపడుతుందని డాక్టర్ రవిచంద్రన్ పేర్కొన్నారు.
ఎంఓఈఎస్‌కు చెందిన మూడు సంస్థలైన ఐఎండీ, ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీ ప్రాథమికంగా మిషన్ మౌసం కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. ఈ సంస్థలకు ఎంఓఈఎస్‌కు చెందిన ఇతర సంస్థలు (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ) సహకరిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యం ఉంటుంది. తద్వారా వాతావరణ, శీతోష్ణస్థితి శాస్త్రాలు, సేవల్లో భారత్ నాయకత్వాన్ని మరింత పెంపొందించవచ్చు.
***
(Release ID: 2054531)
Visitor Counter : 161