ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ర‌ష్యాలో భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించిన ప్ర‌ధాని ప్ర‌సంగం

Posted On: 09 JUL 2024 2:25PM by PIB Hyderabad

న‌మ‌స్కారాలు,

మీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను, మీ స‌మ‌యం కేటాయించి ఇక్క‌డకు వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఇక్క‌డ‌కు నేనొక్క‌డినే రాలేదు; నాతో పాటు చాలా తీసుకొచ్చాను. భార‌తదేశ నేల సారాన్ని, 140 కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల ప్రేమను, మీ కోసం వారి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌ను తీసుకొచ్చాను. మూడోసారి ఎన్నికైన త‌ర్వాత మాస్కోలో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో మొద‌టిసారి ప్ర‌వాస భార‌తీయుల‌ను క‌లుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మిత్రులారా,

ఇవాళ జూన్ 9, నేను ప్ర‌మాణ‌స్వీకారం చేసి స‌రిగ్గా నెల రోజులు గ‌డుస్తోంది. నెల క్రితం వ‌రుస‌గా మూడోసారి జూన్ 9న భార‌త‌దేశానికి ప్ర‌మాణ‌స్వీకారం చేశాను. నా మూడో ప‌ర్యాయంలో నేను మూడొంతుల శ‌క్తితో, మూడొంతుల వేగంతో ప‌ని చేస్తాన‌ని నేను నిబ‌ద్ధ‌త‌ను తీసుకున్నాను. మూడు అనే సంఖ్య మ‌న ప్ర‌భుత్వంలో చాలా ప్రముఖంగా క‌నిపిస్తుంది. ఈ ప‌ర్యాయంలో ప్ర‌పంచంలో భార‌త్‌ను మూడో అతి పెద్ద ఆర్థిక శ‌క్తిగా భార‌త్‌ను మార్చ‌డం, పేద‌ల‌కు మూడు కోట్ల నివాసాలు క‌ట్టించ‌డం, మూడు కోట్ల మంది లాఖ్‌ప‌తి దీదీల‌ను త‌యారుచేయ‌డం వంటివి మ‌న ల‌క్ష్యాలుగా ఉన్నాయి. బ‌హుశా ఈ ప‌దం మీకు కొత్త కావొచ్చు.

భార‌తదేశ వ్యాప్తంగా మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు చురుగ్గా ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి, వైవిద్యంపై దృష్టి సారించి వారికి గ‌ణ‌నీయంగా సాధికార‌త క‌ల్పించాల‌ని మేము ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. పేద గ్రామీణ ప్రాంతాల నుంచి మూడు కోట్ల మంది సోద‌రీమ‌ణుల‌ను ఐశ్వ‌ర్య‌వంతుల‌ను చేయాల‌నేది నా మూడో ప‌ర్యాయంలో ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. అంటే, వారి వార్షికాదాయం ల‌క్ష రూపాయాలు దాటి, స్థిరంగా కొన‌సాగాలి. ఇది చాలా పెద్ద ల‌క్ష్య‌మే అయిన‌ప్ప‌టికీ మీ లాంటి స్నేహితుల మ‌ద్ద‌తు, ఆశీర్వాదాల‌తో ఉన్న‌త‌మైన ల‌క్ష్యాల‌ను కూడా సాధించ‌వ‌చ్చు. ఆధునిక‌ భార‌త్ స్థిరంగా త‌న‌ ల‌క్ష్యాల‌ను అందుకుంటున్న సంగ‌తి మీకు తెలిసిందే. చంద్రుడిపైకి చంద్ర‌యాన్‌ను పంపించ‌డం, సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల్లో అగ్ర‌గామిగా ఉండ‌టం, సామాజిక రంగ విధానాల అమ‌లులో మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండ‌టం వంటి విశేష‌మైన విజ‌యాల‌ను భార‌త్ సాధించింది. అంతేకాదు, ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థ‌ల వ్య‌వ‌స్థను నేడు భార‌త్ క‌లిగి ఉంది.

మీరు 2014లో నాపై న‌మ్మ‌కంతో మ‌న దేశానికి సేవ చేసే అవ‌కాశం క‌ల్పించిన‌ప్పుడు కేవ‌లం వంద‌ల్లో అంకుర సంస్థ‌లు ఉండేవి. ఇవాళ ల‌క్ష‌ల్లో ఉన్నాయి. పేటెంట్ హ‌క్కుల కోసం ద‌ర‌ఖాస్తుల్లో, ప‌రిశోధ‌న ప‌త్రాల ప్ర‌చుర‌ణ‌ల్లో భార‌త్ ఇప్పుడు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. ఇది మ‌న యువ‌త అపార‌మైన ప్ర‌తిభ‌, సామ‌ర్థ్యాల‌ను చాట‌డంతో పాటు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తోంది.

మిత్రులారా,

గ‌త ద‌శాబ్ద‌కాలంలో భార‌త్ సాధించిన అభివృద్ధిని చూసి ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోతోంది. కొత్త నిర్మాణాలు, చోటుచేసుకుంటున్న గ‌ణ‌నీయ మార్పుల‌ను భార‌త్‌కు వ‌చ్చే ప‌ర్య‌ట‌కులు గుర్తిస్తున్నారు. జీ-20 స‌ద‌స్సు లాంటి కార్య‌క్ర‌మాల‌ను భార‌త్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ప్పుడు, ప్ర‌పంచం భార‌త‌దేశం మారుతున్న తీరును గుర్తిస్తోంది. కేవ‌లం ప‌దేళ్ల‌లో భార‌త్‌లో విమానాశ్ర‌యాల‌ను రెట్టింపు చేయ‌డం, 40,000 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ల‌ను విద్యుదీక‌ర‌ణ చేయ‌డం భార‌తదేశ సామ‌ర్థ్యాల‌ను చాట‌డంతో పాటు దేశం ప‌రిణామం చెందుతున్న తీరుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చెర‌గ‌ని ముద్ర వేసింది.

డిజిట‌ల్ చెల్లింపుల్లో కొత్త ప్ర‌మాణాల‌ను నిర్దేశించ‌డం, ఎల్‌-1 నుంచి సూర్యుడి క‌క్ష్య‌ను అందుకోవ‌డం, ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో రైలు వంతెన నిర్మించ‌డం,  ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌డం వంటివి భార‌త్‌లో వ‌స్తున్న అస‌లైన‌ మార్పుల‌కు ప‌రిశీల‌కుల‌కు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దేశంలో, విదేశాల్లో ఉన్న 140 కోట్ల మంది పౌరుల సామ‌ర్థ్యాల‌పై భార‌త్‌కు ఉన్న విశ్వాస‌మే ఈ మార్పు దిశ‌గా న‌డిపిస్తోంది. ప్ర‌జ‌ల ప‌ట్ల‌, దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాల‌నుకునే వారి స‌మ‌ష్టి ల‌క్ష్యం ప‌ట్ల భార‌త్ గ‌ర్వప‌డుతోంది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రైతు, యువ‌త‌, ప్ర‌తి నిరుపేద శ్ర‌ద్ధ‌తో చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ఈ అంకిత‌భావం క‌నిపిస్తోంది.

ఇవాళ నా తోటి భార‌తీయులు ప్ర‌పంచంలోని న‌లుమూల‌లా నివ‌సిస్తున్నారు. మీలో ప్ర‌తి ఒక్క‌రు మీ మాతృభూమి సాధిస్తున్న విజ‌యాల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్నారు. విదేశీ స్నేహితుల‌తో మీరు భార‌త్ గురించి మాట్లాడుతున్న‌ప్పుడు దేశం సాధించిన విజ‌యాల‌ను మీరు ఉత్సాహంగా చెప్తుంటే, వారు శ్రద్ధ‌తో వింటున్నారు. నేను నేరుగా అడుగుతున్నాను: నేను చెప్పేది నిజ‌మేనా? మీరు గ‌ర్వ‌ప‌డ‌టం లేదా? మీ ప‌ట్ల ప్ర‌పంచ ఆలోచ‌న మార‌లేదా? ఈ ధ్రువీక‌ర‌ణ 140 కోట్ల మంది స‌హ పౌరుల నుంచి నేరుగా వ‌చ్చింది. సుదీర్ఘ‌కాలంగా అపరిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఇవాళ‌ మొత్తం 140 కోట్ల మంది భార‌తీయులు క‌ట్టుబ‌డి ఉన్నారు.

నా స్నేహితులారా, మ‌న దేశం స‌వాళ్ల‌ను త‌ప్పించుకోదు. ఇవాళ‌, ప్ర‌తి రంగంలో ముందుండేందుకు మొత్తం 140 కోట్ల మంది భార‌తీయులు అవిశ్రాంతంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కొవిడ్ సంక్షోభం నుంచి పున‌రుద్ధ‌రించ‌డంతో పాటు ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన వాటిల్లో ఒక‌టిగా నిలప‌డాన్ని మీరంతా చూశారు. మ‌నం కేవ‌లం మౌలిక వ‌స‌తుల లోపాల‌ను ప‌రిష్క‌రించ‌డం లేదు. ప్ర‌పంచంలో కొత్త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పుతున్నాం. ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌లు మెరుగుప‌ర్చ‌డ‌మే కాదు, ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భార‌త్ ద్వారా ప్ర‌తి పేద వ్య‌క్తికి ఉచిత చికిత్స అందేలా చూస్తున్నాం. ఇలాంటి ప‌థ‌కం ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌ది. ఇదంతా ఎలా సాధ్య‌మైంది స్నేహితురాలా? ఈ మార్పు దిశ‌గా ఎవ‌రు న‌డిపిస్తున్నారు? మ‌న 140 కోట్ల మంది పౌరుల అవిశ్రాంత ప్ర‌య‌త్నాలు, అంకిత‌భావం, దీక్ష‌, వారి క‌ల‌లు, సంక‌ల్పాలు, శ్ర‌ద్ధ‌తో చేస్తున్న ప్ర‌య‌త్నాలే ఈ విజ‌యానికి కార‌ణ‌మ‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటిస్తున్నాను.

మిత్రులారా,

భార‌త‌దేశంలో మార్పు.. వ్య‌వ‌స్థ‌లు, మౌలిక స‌దుపాయాల‌ను దాటింది. ప్ర‌తి పౌరుడి ఆత్మ‌విశ్వాసంలో, ముఖ్యంగా యువ‌త‌లో ఇది క‌నిపిస్తోంది. ఆత్మ‌విశ్వాస‌మే విజ‌యానికి కీల‌క‌మైన మొద‌టి అడుగు అని మీకు తెలుసు. 2014కి ముందు మ‌నం నిరాశ‌, నిస్పృహ‌ల‌లో మునిగిపోయాం. అయితే, ఇవాళ దేశంలో ఆత్మ‌విశ్వాసం నిండి ఉంది. ఆత్మ‌విశ్వాసం ఉన్న ఒక వ్య‌క్తి, నిరాశ‌తో ఉన్న మ‌రో వ్య‌క్తి ఒకేర‌క‌మైన జ‌బ్బుతో ఆసుప‌త్రిలో చేరి, స‌మానంగా స‌మ‌ర్థులైన ఇద్ద‌రు వైద్యులు చికిత్స అందించార‌ని అనుకోండి. ఆత్మ‌విశ్వాసం ఉన్న రోగి వేగంగా కొలుకొని కొన్ని వారాల్లోనే ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోతాడు. కానీ, నిరాశ‌తో ఉన్న రోగికి మాత్రం ఇంకా సాయం కావాల్సి వ‌స్తుంది. ఇవాళ భార‌త్ ఆత్మ‌విశ్వాసంతో నిండి ఉంది. ఇదే మ‌న గొప్ప ఆస్తి.

ఇటీవ‌ల టీ-20 ప్ర‌పంచ క‌ప్‌లో మ‌న విజ‌యాన్ని మీరు ఇక్క‌డ కూడా జ‌రుపుకున్నారు. జ‌రుపుకున్నారా? మీరు గ‌ర్వప‌డుతున్నారా? ఆటుపోట్ల‌ను త‌ట్టుకొని ప్ర‌యాణించే తీరును ప్ర‌పంచ క‌ప్‌లో సాధించిన ఈ విజ‌యం ప్ర‌తిబింబిస్తోంది. ఇవాళ భార‌తీయ యువ‌త చివ‌రి బంతి వ‌ర‌కు ఓట‌మిని అంగీక‌రించ‌డం లేదు. లొంగిపోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారిని విజ‌యం వ‌రిస్తుంద‌నే స్ఫూర్తిని క‌లిగి ఉంది. ఈ స్వ‌భావం కేవ‌లం క్రికెట్‌కే ప‌రిమితం కాలేదు. అన్ని క్రీడల్లో ఇదే స్వ‌భావం క‌నిపిస్తోంది. ఇటీవ‌లి సంవ‌త్స‌రాల్లో మ‌న క్రీడాకారులు అంత‌ర్జాతీయ పోటీల్లో చారిత్ర‌క విజ‌యాల‌ను అందుకున్నారు. రానున్న పారిస్ ఒలింపిక్స్ స‌త్తా చాటేందుకు భార‌త్ నుంచి ఎదురులేని జ‌ట్టు సిద్ధ‌మ‌వుతోంది. ఈ విశ్వాస‌మే భార‌త‌దేశ నిజ‌మైన పెట్టుబడి. 21వ శ‌తాబ్దంలో భార‌త్‌ను కొత్త శిఖ‌రాల‌కు చేర్చే  సామ‌ర్థ్యం క‌లిగి ఉంది.

మిత్రులారా,
మీరు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని ప‌రిశీలించి ఉండ‌వ‌చ్చు. వార్త‌ల‌ను చూసి ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారు, ఎవ‌రు ఏం చేస్తున్నారు అనే తాజా ప‌రిణామాల‌ను తెలుసుకొని ఉండ‌వ‌చ్చు.

మిత్రులారా,

గ‌త ద‌శాబ్ద కాలంగా భార‌త్ సాధించిన అభివృద్ధి గురించి ఎన్నిక‌ల సంద‌ర్భంగా నేను చెప్పింది కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే. మ‌రింత వేగ‌వంత‌మైన వృద్ధికి వ‌చ్చే ద‌శాబ్దం వాగ్దానం చేస్తోంది. సెమీ కండక్ట‌ర్ల నుంచి ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ వ‌ర‌కు, విద్యుత్ వాహ‌నాల‌కు గ్రీన్ హైడ్రోజెన్‌ అందించ‌డం, ప్ర‌పంచ‌స్థాయి మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ద్వారా భార‌తదేశ వేగం ప్ర‌పంచ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించ‌నుంది. ఈ మాట‌ను నేను చాలా బాధ్య‌త‌తో చెప్తున్నాను. ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆర్థిక వృద్ధికి భార‌త్ 15 శాతం తోడ్ప‌డుతుంది. రానున్న సంవ‌త్స‌రాల్లో ఇది చాలా గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌పంచ పేద‌రికం, వాతావ‌ర‌ణ మార్పు స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డంలో భార‌త్ నాయ‌క‌త్వం వ‌హించ‌నుంది. ఈ స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం నా డీఎన్ఏలోనే ఇమిడి ఉంది.

మిత్రులారా,

నాయ‌కుడికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య దూరం లేని చోట‌, నాయ‌కుడి ఆలోచ‌న‌లు ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను ప్ర‌తిబింబిస్తాయి. ఈ ఐక్య‌తాభావం ప‌ట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈ కూర్పు ఇప్పుడు నేను ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న అపార‌మైన శ‌క్తిని ఇస్తుంది.

మిత్రులారా,

ప్ర‌పంచ శ్రేయ‌స్సు కోసం భార‌త్‌, ర‌ష్యా క‌లిసి ప‌ని చేస్తుండ‌టం ప‌ట్ల సంతోషంగా ఉంది. ఇక్క‌డ‌కు హాజ‌రైన మీరంతా మీ శ్ర‌మ‌, చిత్త‌శుద్ధితో ర‌ష్యా స‌మాజానికి తోడ్పాటును అందిస్తూ మ‌న ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను కొత్త శిఖ‌రాల‌కు చేరుస్తున్నారు.

మిత్రులారా,

భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ఉన్న ప్ర‌త్యేక బంధాన్ని నేను చాలాకాలంగా ఆరాధిస్తున్నాను. ర‌ష్యా అనే ప‌దం వినిపించ‌గానే క‌ష్ట‌న‌ష్టాల్లో మ‌న భాగ‌స్వామిగా, న‌మ్మ‌క‌మైన స్నేహితుడిగా ప్ర‌తి భార‌తీయుడు భావిస్తారు. దీనిని మ‌న ర‌ష్యా స్నేహితులు "దృజ్బ" అని, హిందీలో మ‌నం "దోస్తీ"(స్నేహం అని పిలుస్తాం. ర‌ష్యాలోని తీవ్ర‌మైన చలిలోనూ, భార‌త్ - ర‌ష్యా స్నేహంలోని వెచ్చ‌ద‌నం మాత్రం ఎల్ల‌ప్పుడూ బ‌లంగా, సానుకూలంగా ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌తి ఇంట్లో వినిపించే ప్ర‌ముఖ పాట "సిర్ పే లాల్ టోపీ ర‌స్సి, ఫిర్ బీ? ఫిర్ బీ? ఫిర్ బీ? దిల్ హై హిందుస్తానీ.." లో చెప్పిన‌ట్టుగా ప‌ర‌స్ప‌ర విశ్వాసం, గౌర‌వం అనే బ‌ల‌మైన పునాదుల‌పై ఈ బంధం నిల‌బ‌డింది. ఈ పాట పాత‌దే అయిన‌ప్ప‌టికీ అందులోని భావాలు మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతాయి. గ‌తంలో రాజ్ క‌పూర్ గారు, మిథున్ దా లాంటి వారు భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య సంస్కృతిక సంబంధాల‌ను వారి క‌ళ‌తో సుసంప‌న్నం చేశారు. ఈ బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో మ‌న సినిమా కీల‌క‌పాత్ర పోషించింది. ఇవాళ‌, భార‌త్ - ర‌ష్యా బంధాన్ని మీలో ప్ర‌తి ఒక్క‌రు కొత్త శిఖ‌రాల‌కు చేరుస్తున్నారు. మ‌న స్నేహం అనేక ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొని, ప్ర‌తిసారి మ‌రింత బ‌లోపేతం అయ్యింది.

మిత్రులారా,

భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య శాశ్వ‌త‌మైన‌ స్నేహాన్ని దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా బ‌లోపేతం చేస్తూ వ‌స్తున్న నా ఆత్మీయ స్నేహితుడైన అధ్య‌క్షుడు పుతిన్ నాయ‌క‌త్వాన్ని నేను త‌ప్ప‌కుండా అభినందించాలి. నేను గ‌త ద‌శాబ్దకాలంలో ర‌ష్యాలో ఆరుసార్లు ప‌ర్య‌టించాను. ఈ కాలంలో నేను అధ్య‌క్షుడు పుతిన్‌తో 17 సంద‌ర్భాల్లో స‌మావేశం అయ్యాను. ప్ర‌తి స‌మావేశం మ‌న ప‌ర‌స్ప‌ర విశ్వాసాన్ని, గౌర‌వాన్ని బ‌లోపేతం చేసింది. సంక్షోభాల్లో మ‌న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్న‌ప్పుడు, వారు సుర‌క్షితంగా భార‌త్‌కు తిరిగి వ‌చ్చేలా అధ్య‌క్షుడు పుతిన్ త‌న స‌హాకారాన్ని అందించారు. ఈ మ‌ద్ద‌తు అందించినందుకు ర‌ష్యా ప్ర‌జ‌ల‌కు, నా స్నేహితుడైన అధ్య‌క్షుడు పుతిన్‌కు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను.

మిత్రులారా,

ఇవాళ‌, గ‌ణ‌నీయ సంఖ్య‌లో మ‌న యువ‌త చ‌దువుల కోసం ర‌ష్యా వ‌స్తోంది. వేర్వేరు భార‌తీయ రాష్ట్రాల‌కు ప్రాతినిథ్యం వ‌హించే సంఘాలు ఇక్క‌డ ఉన్నాయ‌ని, అవి ప్ర‌తి ప్రాంతానికి చెందిన‌ పండుగ‌లు, ఆహారం, భాష‌లు, పాట‌లు, సంగీతంలోని విభిన్న‌త‌ను ప‌రిర‌క్షిస్తున్నాయ‌ని నాకు తెలిసింది. హోళీ నుంచి దీపావ‌ళి వ‌ర‌కు ప్ర‌తి పండుగ‌ను మీరు ఇక్క‌డ ఎంతో ఉత్సాహంతో జ‌రుపుకుంటున్నారు. భార‌తదేశ స్వాతంత్య్ర దినోత్సం కూడా ఉత్సాహంతో జ‌రుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 15 వేడుకలు మ‌రింత అద్భుతంగా ఉంటాయ‌ని భావిస్తున్నాను. గ‌త నెల ఇక్క‌డ జ‌రిగిన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో కూడా వేలాది మంది పాల్గొన్నారు. ఈ వేడుక‌ల్లో మ‌న ర‌ష్యా స్నేహితులు సైతం మీతో క‌లిసి అంతే ఉత్సాహంగా పాల్గొన‌డాన్ని చూడ‌టం చాలా సంతోషంగా ఉంది. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న బంధం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను సైతం అధిగ‌మించింది. ఇది నిజంగా అద్భుత‌మైన బ‌లం.

మిత్రులారా,

ఈ సానుకూల వాతావ‌ర‌ణంలో మ‌రో శుభ‌వార్త‌ను కూడా సంతోషంగా మీతో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను. మీరు అది ఏంటోన‌ని ఆశ్చ‌ర్య‌పోతుండ‌వ‌చ్చు. క‌జ‌న్‌, యెకాటెరిన్‌బ‌ర్గ్‌లో రెండు కొత్త రాయ‌బార కార్యాల‌యాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ నిర్ణ‌యం మ‌న దేశాల మ‌ధ్య ప్ర‌యాణాన్ని సుల‌భం చేయ‌డంతో పాటు వ్యాపార అవ‌కాశాల‌ను ప్రోత్స‌హిస్తుంది.

మిత్రులారా,

మ‌న ద్వైపాక్షిక సంబంధాల‌కు ఆస్ట్రాఖాన్‌లోని ఇండియా హౌజ్ ఒక గుర్తు. 17వ శ‌తాబ్దంలో గుజ‌రాత్ నుంచి వ‌ర్త‌కులు వ‌చ్చి అక్క‌డ స్థిర‌ప‌డ్డారు. గుజ‌రాత్‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న కొత్త‌లో నేను ఒక్క‌డ ప‌ర్య‌టించాను. ఓడ‌రేవు న‌గ‌రాలైన ముంబై, ఆస్ట్రాఖాన్‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా ఉత్త‌ర‌-ద‌క్షిణ ర‌వాణా కారిడార్ నుంచి రెండేళ్ల క్రితం ఆస్ట్రాఖాన్‌కు మొద‌టి వాణిజ్య స‌రుకు అందింది. ప్ర‌స్తుతం, చెన్నై, వ్లాడివోస్టాక్ ఈస్ట‌ర్న్ మారిటైమ్ కారిడార్ కోసం కృషి జ‌రుగుతోంది. గంగా-వోల్గా నాగ‌రికల‌పై చ‌ర్చ ద్వారా మ‌న ఇరు దేశాలు పున‌రావిష్క‌రించుకుంటున్నాయి.

మిత్రులారా,

నేను 2015లో ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు 21వ శ‌తాబ్దం భార‌త్‌దేన‌ని చెప్పాను. త‌ర్వాత కూడా నేను ఇది పున‌రుద్ఘాటించాను. ఇవాళ ఈ భావ‌న‌ను ప్ర‌పంచం చెప్తోంది. ఈ విష‌యాన్ని ఇప్పుడు ప్ర‌పంచ ఎగుమ‌తిదారులు ఏక‌గ్రీవంగా చెప్తున్నారు. 21వ శతాబ్దం భార‌త్‌దేన‌ని ప్ర‌తిఒక్క‌రు నొక్కి చెప్తున్నారు. ఇవాళ‌, ప్ర‌పంచ తోబుట్టువుగా భార‌త‌దేశం ప్ర‌పంచంలో స‌రికొత్త విశ్వాసాన్ని నింపుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భార‌త‌దేశ సామ‌ర్థ్యాలు ప్ర‌పంచానికి స్థిర‌త్వం, శ్రేయ‌స్సుపై ఆశ‌ను క‌ల్పిస్తోంది. ఇప్పుడు ఉద్భ‌విస్తున్న బ‌హుళ‌ధ్రువాల ప్ర‌పంచంలో భార‌త్ ఒక దృఢ‌మైన స్తంభంగా గుర్తింపు పొందింది. భార‌త్ శాంతి, చ‌ర్చ‌లు, దౌత్యాన్ని స‌మ‌ర్థించిన‌ప్పుడు మిగ‌తా దేశాలు శ్ర‌ద్ధ‌గా వింటున్నాయి. సంక్షోభ స‌మ‌యాల్లో సాయాన్ని అందించేందుకు భార‌త్ మొద‌ట నిలుస్తోంది. ప్ర‌పంచ అంచ‌నాల‌ను అందుకోవ‌డానికి దేశం క‌ట్టుబ‌డి ఉంది. చాలాకాలం పాటు ప్ర‌పంచం ప్ర‌భావితం చేయ‌డం ద్వారా న‌డ‌వ‌డాన్ని చూసింది. ఇప్పుడు ప్ర‌పంచం సంగ‌మాన్ని కోరుకుంటోంది. ప్ర‌భావితం అవ్వాల‌నుకోవ‌డం లేదు. స‌మావేశాలు, సంగ‌మాల‌ను గౌర‌వించే భార‌త్ క‌న్నా దీనిని ఎవ‌రు బాగా అర్థం చేసుకోగ‌ల‌రు?

మిత్రులారా,

మీరంతా ర‌ష్యాలో భార‌త్‌కు ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదైనా రాయ‌బార కార్య‌క్ర‌మంపై ప‌ని చేసే వారిని 'రాజ్‌దూత్‌'(అంబాసిడ‌ర్‌) అంటారు. రాయ‌బార కార్య‌క్ర‌మం బ‌య‌ట ఉండేవారు 'రాష్ట్ర‌దూత్‌లు'(వీరూ అంబాసిడ‌ర్‌లే) . ర‌ష్యా, భార‌త్ మ‌ధ్య సంబంధాలు బ‌లోపేతం చేయ‌డంలో మీ కృషి కీల‌కం.

మిత్రులారా,

భార‌త్‌లో 60 ఏళ్ల త‌ర్వాత ప్ర‌భుత్వం వ‌రుస‌గా మూడోసారి ఎన్నికైన విష‌యాన్ని గుర్తించాలి. అయితే, ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో మొత్తం దృష్టి, అన్ని కెమెరాలు మోదీనే ఫోక‌స్ చేసి ఇత‌ర అనేక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు, ఇదే స‌మ‌యంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కిం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశాలోనూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ అన్ని ఎన్నిక‌ల్లోనూ ఎన్డీఏ క్లీన్ స్వీప్ మెజారిటీల‌తో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్‌జి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. జై జ‌గ‌న్నాథ్‌. ఒడిశా గ‌ణ‌నీయ మార్పు చెందింది. అందుకే, ఇవాళ నేను కూడా మీతో పాటు ఒరియా స్కార్ఫ్ ధ‌రించాను.

మిత్రులారా,

ఆ మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్‌జీ ఆశీస్సులు మీ అంద‌రిపై ఉండాల‌ని, మీరు ఆరోగ్యంగా, సుభీక్షంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.  మిత్రులారా, అపార‌మైన ప్రేమ‌లో ఇది కొంత మాత్ర‌మే. ఇది రోజురోజుకూ మ‌రింత వృద్ధి చెందుతుంది. కోరిక‌ల‌ను నిబ‌ద్ధ‌త‌గా మారుస్తూ, మ‌న కృషితో ప్ర‌తి ల‌క్ష్యం నెర‌వేరుతుంది. ఈ భావ‌న‌తో మ‌రోసారి మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. నాతో పాటు మీరూ నిన‌దించండి -

భార‌త్ మాతా కీ జై!

భార‌త్ మాతా కీ జై!


భార‌త్ మాతా కీ జై!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

వందేమాత‌రం!

ధ‌న్య‌వాదాలు!

****


(Release ID: 2054176) Visitor Counter : 38