ప్రధాన మంత్రి కార్యాలయం
సింగపూర్ ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రన మోదీ వ్యాఖ్యలు
Posted On:
05 SEP 2024 9:42AM by PIB Hyderabad
మాననీయ మహోదయా,
మీరందించిన హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు.
మీరు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనిద్దరి మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇది. మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ 4జీ నాయకత్వంలో సింగపూర్ మరింత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
మాననీయ మహోదయా,
సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం కాదు. ప్రతీ వర్థమాన దేశానికి అది స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతదేశంలో ఎన్నో ‘సింగపూర్’ లను సృష్టించాలన్నది మా లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మనం సహకరించుకుంటున్నామని తెలియచేసేందుకు నేను ఆనందిస్తున్నాను. మనం ఏర్పాటు చేసుకున్న మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ ఒక విప్లవాత్మక మార్గం.
నైపుణ్యాల కల్పన, డిజిటలైజేషన్, మొబిలిటీ, ఆధునిక తయారీ, సెమీ కండక్టర్లు, ఏఐ, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఉమ్మడిగా సహకరించుకోవచ్చని గుర్తించాం.
మాననీయ మహోదయా,
మేం అనుసరిస్తున్న “యాక్ట్ ఈస్ట్ విధానం” పురోగతిలో కీలక భాగస్వామి సింగపూర్. ప్రజాస్వామ్య విలువలపై మన రెండు దేశాలకు గల విశ్వాసం ఉభయదేశాలను అనుసంధానం చేస్తుంది. నా మూడో విడత అధికార సమయం ప్రారంభంలోనే సింగపూర్ ను సందర్శించే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది.
మన వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమై దశాబ్ది పూర్తవుతోంది. గత 10 సంవత్సరాలుగా మన దేశాల మధ్య వాణిజ్యం రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది. పరస్పర పెట్టుబడులు మూడింతలు పెరిగి 150 బిలియన్ డాలర్లు దాటాయి. వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయాన్ని మేం మొట్టమొదటిగా సింగపూర్ దేశంతోనే ప్రారంభించాం.
గత 10 సంవత్సరాల కాలంలో 17 సింగపూర్ ఉపగ్రహాలను భారత భూభాగం నుంచి ప్రయోగించాం. రక్షణ రంగానికి నైపుణ్య కల్పనతో మన భాగస్వామ్యం జోరందుకుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా మధ్య భాగస్వామ్యం అనుసంధానతను శక్తిమంతం చేసింది.
నేడు మన దేశాల మధ్య బాంధవ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా విస్తరించుకోవడం ఆనందంగా ఉంది. మాననీయ మహోదయా, సింగపూర్‌లో నివశిస్తున్న 3.5 లక్షల మంది భారత సంతతి ప్రజలు మన ఉభయుల బంధానికి బలమైన పునాదిగా నిలుస్తున్నారు. సుభాష్ చంద్ర బోస్, అజాద్ హింద్ ఫౌజ్, లిటిల్ ఇండియాకు స్థానం, గౌరవం కల్పించినందుకు సింగపూర్ దేశం యావత్తుకు మేం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం.
2025 సంవత్సరంలో మన ఉభయ దేశాల బాంధవ్యానికి 60వ వార్షికోత్సవ వేడుక నిర్వహించుకుంటున్నాం. ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకునేందుకు మనం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
భారతదేశానికి చెందిన తొలి తిరువళ్లువార్ సాంస్కృతిక కేంద్రం త్వరలో సింగపూర్‌లో ప్రారంభం కానుందని తెలియచేయడానికి నేను ఆనందిస్తున్నాను. ప్రముఖ కవి తిరువళ్లువార్ ప్రపంచంలోనే పురాతన భాష తమిళంలో ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలు అందించారు. ఆయన రచన తిరుక్కురళ్ 2000 సంవత్సరాల నాటిది కావచ్చు...నేటికీ ఆదర్శనీయమే. అందులో ఆయన
నయనోడు నన్ని పురింత పయనుదియార్ పంబు పరట్టుం ఉళగు అని రాశారు.
“న్యాయగుణం, సేవాభావం ఉన్న వారిని ప్రపంచం గౌరవిస్తుంది” అని దాని అర్దం.
సింగపూర్‌లో నివశిస్తున్న లక్షలాది మంది భారతీయులు ఈ సిద్ధాంతం పట్ల స్ఫూర్తి పొంది ఉభయ దేశాల బంధం పటిష్ఠం కావడానికి దోహదపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను.
మాననీయ మహోదయా,
భారతదేశానికి చెందిన ఇండో-పసిఫిక్ విజన్‌ను షాంగ్రి-లా చర్చల్లో నేను ప్రతిపాదించాను. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, సుసంపన్నతలను ప్రోత్సహించడంలో సింగపూర్‌తో కలిసి మేం కృషిని కొనసాగిస్తాం. నాకు అందించిన గౌరవానికీ, హార్థిక స్వాగతానికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
గమనిక - ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం మాత్రమే.
***
(Release ID: 2054159)
Visitor Counter : 32
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam