జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

మానవ హక్కుల లఘుచిత్రాల పోటీ ప్రవేశాల గడువును పెంచిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ


సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు ఆహ్వానం

Posted On: 11 SEP 2024 4:41PM by PIB Hyderabad

ప్రస్తుత సంవత్సరం నిర్వహించనున్న 10వ వార్షిక మానవ హక్కుల లఘు చిత్రాల పోటీ కోసం ప్రవేశాలను పంపేందుకు చివరి తేదీని ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పొడిగించింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
లఘ చిత్రాల అవార్డులను కమిషన్ 2015లో ప్రారంభించింది. మానవ హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి వయసుతో సంబంధం లేకుండా పౌరుల సినిమా, సృజనాత్మకను గుర్తించడం, ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. గతంలో జరిగిన అన్ని పోటీల్లోనూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విశేష స్పందన లభించింది.
లఘు చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏదైనా భారతీయ భాషలో ఉండొచ్చు. కానీ ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్ ఉండాలి. ఈ లఘు చిత్రం నిడివి కనీసం 3 నిమిషాలు, గరిష్ఠంగా10 నిమిషాలు ఉండాలి. ఇది డాక్యుమెంటరీ, వాస్తవ కథల నాటకీకరణ లేదా కాల్పనిక రచన అయి ఉండొచ్చు. యానిమేషన్‌తో సహా అన్ని రకాల టెక్నికల్ షూటింగ్‌, ఫిల్మ్ మేకింగ్ ఫార్మాట్‌లో ఈ చిత్రం ఉండొచ్చు.
లఘుచిత్రాల ఇతివృత్తాలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ హక్కుల ఆధారంగా ఉండాలి. ఈ చలన చిత్రం డాక్యుమెంటరీ, వాస్తవ కథల నాటకీకరణ లేదా కాల్పనిక రచన అయి ఉండొచ్చు. యానిమేషన్‌ సహా అన్ని రకాల టెక్నికల్ షూటింగ్‌, ఫిల్మ్ మేకింగ్ ఫార్మాట్‌లో ఈ చిత్రం ఉండొచ్చు. ఈ కింది వాటి పరిధిలో కాల్పనిక రచన ఉండొచ్చు :


• జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం

• వెట్టిచాకిరీ, బాలకార్మికులు..మహిళలు, బాలల హక్కులు

• వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన హక్కులు

• వికలాంగుల హక్కులు

• మాన్యువల్ స్కావెంజింగ్, ఆరోగ్య సంరక్షణ హక్కు

• ప్రాథమిక హక్కులకు సంబంధించిన సమస్యలు

• మానవ అక్రమ రవాణా

• గృహ హింస

• పోలీసుల దౌర్జన్యాల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన

• కస్టడీలో హింస, చిత్రహింసలు

• సామాజిక-ఆర్థిక అసమానతలు

• సంచార, డీనోటిఫైడ్ తెగల హక్కులు

• జైళ్ల సంస్కరణలు

• విద్యా హక్కు

• భూమిపై, జీవంపై ప్రభావం చూపే పర్యావరణ ప్రమాదాలు సహా పరిశుభ్రమైన పర్యావరణాన్ని పొందే హక్కు

• పనిచేసే హక్కు

• చట్టం ముందు సమానత్వ హక్కు

• ఆహార హక్కు, పోషకాహార భద్రత

• ఎల్జీబీటీక్యూఐ+ హక్కులు

• మానవ నిర్మిత, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన స్థాన చలనం కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన

• భారతీయ భిన్నత్వంలో మానవ హక్కులు, విలువలు

• జీవన, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి.

పోటీలో పాల్గొనేందుకు ఒక వ్యక్తి పంపే ప్రవేశాల సంఖ్య, రుసుం పై ఎలాంటి పరిమితి లేదు. ప్రతి చిత్రాన్ని పూర్తిగా నింపిన ప్రవేశ ఫారంతో విడిగా పంపాలి. ఎంట్రీ ఫారంతో పాటు నియమనిబంధనలను ఎన్‌హెచ్ఆర్‌సీ   వెబ్‌సైట్‌ www.nhrc.nic.in నుంచి పొందవచ్చు.
సినిమా, పూర్తిగా నింపిన ప్రవేశ ఫారం, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ ద్వారా ఎన్‌హెచ్‌ఆర్‌సీ nhrcshortfilm[at]gmail[dot]comకు పంపొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే ఇదే ఈ మెయిల్‌ చిరునామాకు పంపొచ్చు.

 

***


(Release ID: 2054091) Visitor Counter : 60