ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024లో


భారత ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన సెమీకండక్టర్ సంస్థల సీఈఓలు

మోదీ సూత్రం...అమేయవృద్ధికి సూత్రం: అజిత్ మనోచా, సీఈఓ, సెమీ

భారత డిజిటల్ భవిష్యత్తును కాపాడుకునే తరుణమిదే…

ఆ సమయం వచ్చేసిందన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ రణధీర్ ఠాకూర్

దీర్ఘకాలంలో వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన సృజనాత్మకత,

ప్రజాస్వామ్యం, విశ్వాసం అనే మూడింటిని ప్రధాన మంత్రి తీసుకొచ్చారు: శ్రీ కర్ట్ సీవర్స్, సీఈఓ, ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్

భారతతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం విలువ ఆధారిత అధునాతన సెమీకండక్టర్ డిజైన్ కార్యకలాపాలను చేపట్టేందుకు ఇక్కడ ఉద్యోగులను రెట్టింపు చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం: శ్రీ హిడెతోషి షిబాటా, సీఈఓ, రెనెసాస్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కంటే మంచి నమ్మకమైన భాగస్వామి ఎవరు: లూక్ వాన్ డెన్ హోవ్, సీఈఓ, ఐఎంఈసీ

Posted On: 11 SEP 2024 3:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సదస్సును సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ‘సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు. ఈ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకత్వ స్థాయి వ్యక్తులు, కంపెనీలు, నిపుణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సదస్సులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకత్వం పాల్గొంటోంది. సదస్సులో 250 మందికి పైగా ప్రదర్శనదారులు,  150 మంది వక్తలు పాల్గొంటున్నారు.

 

సెమీకాన్ ఇండియా 2024 లో లభించిన స్వాగతాన్ని సెమీ సీఈఓ శ్రీ అజిత్ మనోచా ప్రశంసించారు. ఈ కార్యక్రమం అపూర్వం, అమోఘమని ఆయన వర్ణించారు. మొత్తం ఎలక్ట్రానిక్ సరఫరా వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న 100 మందికి పైగా సీఈఓలు, సీఎక్స్ఓలు ఒక వేదిక పంచుకునే ఈ కార్యక్రమం స్థాయి చాలా పెద్దదని ఆయన మెచ్చుకున్నారు. దేశం, ప్రపంచం, పరిశ్రమ, మానవాళి ప్రయోజనం కోసం సెమీకండక్టర్ కేంద్రంగా మారాలనే భారత ప్రయాణంలో విశ్వసనీయ భాగస్వామిగా మారే విషయంలో పరిశ్రమ నిబద్ధతపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ సూత్రమే అమేయమైనవృద్ధికి మూలమన్న ఆయన.. సెమీ కండక్టర్ పరిశ్రమ ప్రపంచంలోని ప్రతి పరిశ్రమకు, మరీ ముఖ్యంగా మానవాళికి ఆధారమని అన్నారు. ‌భారత్‌లోని 140 కోట్ల మంది, ప్రపంచంలోని 800 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

టాటా ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ రణధీర్ ఠాకూర్ ఈ చరిత్రాత్మక సమావేశాన్ని సుసాధ్యం చేసినందుకు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమను భారత్‌కు తీసుకొచ్చే విషయంలో ఆయన దార్శనికతను ప్రశంసించారు. ఈ ఏడాది మార్చి 13న ధోలేరాలో దేశంలోనే మొట్టమొదటి వాణిజ్య ఫ్యాబ్రికేషన్ కేంద్రానికి, అస్సాంలోని జాగిరోడ్‌లో తొలి స్వదేశీ ఓశాట్ కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు పరిశ్రమలకు అనుమతులు రికార్డు సమయంలో ఇచ్చారని పేర్కొన్నారు. భారత సెమీకండక్టర్ మిషన్  భాగస్వామ్యం, ప్రకటించిన వాటిలో కార్యచరణలోనికి తీసుకొచ్చే వాటి సంఖ్య అద్భుతంగా ఉందనిఇవి అత్యవసర పద్ధతిలో పనిచేయాలన్న ప్రధాని సందేశానికి అనుగుణంగా ఉన్నాయని కొనియాడారు. చిప్ తయారీలో కీలకమైన 11 రకాల వ్యవస్థల గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలు సెమీకాన్ 2024 లో ఈ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చాయని అన్నారు. మరింత వృద్ధిని సాధించేందుకు ప్రధాని అంతర్జాతీయ స్థాయికి చేరువవటంతో పాటు భారత సెమీకండక్టర్ మిషన్‌కు ఇస్తోన్న ప్రాధాన్యత వల్ల ఈ వ్యవస్థలతో కీలకభాగస్వామ్యాలు నెలకొన్నాయని అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు పునాదిగా మారుతుందని, ఇది ఉద్యోగాల కల్పనపై గుణాత్మక ప్రభావాన్ని చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత సెమీ కండక్టర్ కలను సాకారం చేయడంలో ప్రధాని నాయకత్వం, దార్శనికతను ప్రశంసిస్తూ… 'ఇదే సమయం, సరైన సమయం' అని పేర్కొన్నారు.

ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ సీఈఓ శ్రీ కర్ట్ సీవర్స్ సెమీకాన్ 2024లో భాగం కావడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం భారత్‌లో భారీ మార్పుకు సంబంధించిన ప్రయాణాన్ని సూచిస్తుందని అన్నారు. విజయానికి కావాల్సిన మూడు లక్షణాలైన ఆశయం, విశ్వాసం, సహకారం వాటి గురించి ప్రధానంగా మాట్లాడారు. ఈ రోజు కార్యక్రమం భాగస్వామ్యానికి నాంది పలుకుతుందని అన్నారు. దేశంలో వస్తోన్న భారీ మార్పు గురించి ఆయన మాట్లాడుతూ… ప్రపంచం కోసమే కాకుండా దేశం కోసం కూడా భారత్‌లో కృషి జరుగుతోందన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ ఇతర రంగాలపై చూపే ప్రభావాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది రాబోయే కొన్ని సంవత్సరాలలో భారత్‌ను అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉపకరిస్తుందని అన్నారు. ఎన్ఎక్స్‌పీ పరిశోధన, అభివృద్ధి వ్యయం బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడం గురించి ఆయన తెలియజేశారు. దీర్ఘకాలంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు అవసరమైన సృజనాత్మకత, ప్రజాస్వామ్యం, విశ్వాసం అనే మూడింటిని వ్యవస్థలోకి ప్రధాని తీసుకొచ్చారని కొనియాడారు.

ఇక్కడ ఇంత విజయవంతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రెనెసాస్ సీఈఓ శ్రీ హిడేతోషి షిబాటా ప్రధాన మంత్రిని అభినందించారు. ఇంతటి ప్రఖ్యాత సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, భారతదేశపు మొట్టమొదటి అసెంబ్లీ, పరీక్ష(టెస్టింగ్) కేంద్రాలను గుజరాత్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మక లైన్ (పైలట్ లైన్) నిర్మాణం జరుగుతోందని.. బెంగళూరు, హైదరాబాద్, నోయిడా నగరాల్లో కార్యకలాపాలను విస్తరించడం గురించి మాట్లాడారు. భారత, అంతర్జాతీయ మార్కెట్ కోసం విలువ ఆధారిత అధునాతన సెమీకండక్టర్ డిజైన్ కార్యకలాపాలు చేపట్టేందుకు వచ్చే ఏడాది నాటికి భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సెమీకండక్టర్ టెక్నాలజీని దేశానికి తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సెమీకాన్ 2024 విషయంలో ప్రధాని మోదీని అభినందించిన ఐఎంఈసీ సీఈఓ శ్రీ లూక్ వాన్ డెన్ హోవ్, సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి భారతదేశానికి ఆయన దార్శనికత, నాయకత్వం స్పష్టమైన మార్గాన్ని అందిస్తుందని అన్నారు. దీర్ఘకాల దృష్టిలో అర్&డీ వ్యూహాన్ని ఏర్పాటు చేయడానికి, పెట్టుబడి పెట్టేందుకు ప్రధాని నిబద్ధతతో ఉన్నారని.. ఇది పరిశ్రమకు చాలా ముఖ్యమైనదని అన్నారు. ప్రధాని ప్రతిష్టాత్మక ప్రణాళికలకు మద్దతు ఇవ్వడానికి బలమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఐఎంఈసీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. విశ్వసనీయమైన సరఫరా గొలుసు అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం కంటే ఎవరు బాగా నమ్మకమైన భాగస్వామి కాగలరు" అని అన్నారు.

***


(Release ID: 2054082) Visitor Counter : 89