నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ హైడ్రోజన్ కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ: సుస్థిరమైన ఇంధన ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో అగ్రగామిగా ఉండేలా ప్రణాళికలు


బలమైన విధానాలు, అత్యాధునిక పరిశోధన, వ్యూహాత్మక అంతర్జాతీయ సహకారాలతో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లనున్న ప్రభుత్వం

రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 6 లక్షల ఉద్యోగాలను సృష్టించడం”: గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ విజన్ ని వివరించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి: గ్రీన్ హైడ్రోజన్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఆవిష్కరించిన మంత్రి హర్దీప్ పూరి

Posted On: 11 SEP 2024 2:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ అంతర్జాతీయ సదస్సు (ఐసిజిహెచ్-2024) రెండో  ఎడిషన్‌ను వీడియో సందేశం ద్వారా ప్రారంభించారు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఇంధన రంగానికి గ్రీన్ హైడ్రోజన్ ఆశావహమైన  అదనపు జోడింపు అని అన్నారు.

“స్వచ్ఛమైన, పచ్చటి ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది. గ్రీన్ ఎనర్జీపై మా పారిస్ ఒప్పంద హామీని షెడ్యూల్ కంటే చాలా ముందుగానే నెరవేర్చిన జీ20 దేశాలలో మేము మొదటి వాళ్ళం. మేము ఇప్పటికే ఉన్న పరిష్కారాలను బలోపేతం చేస్తూనే, కొత్త, వినూత్న విధానాలను స్వీకరించడంపై కూడా దృష్టి పెడుతున్నాం. శుద్ధి కర్మాగారాలు, ఎరువులు, ఉక్కు, హెవీ డ్యూటీ రవాణా వంటి హార్డ్-టు-ఎలక్ట్రిఫై రంగాలను డీకార్బనైజ్ చేయగల సామర్థ్యంతో జరుగుతున్న పురోగతిలో గ్రీన్ హైడ్రోజన్ ఒకటి" అని ప్రధాని స్పష్టం చేశారు.

"గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా చేయాలని  మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023లో ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఈ ఆశయాన్ని సాకారం చేయడంలో కీలకమైన అడుగు. ఇది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది, పరిశ్రమ వృద్ధిని ప్రేరేపిస్తుంది, ఇంకా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది" అని అన్నారు.

పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో దేశ నాయకత్వాన్నివివరిస్తూ, “గత దశాబ్దంలో భారత్ శిలాజేతర ఇంధన సామర్థ్యం దాదాపు 300 శాతం  పెరిగింది. అదే కాలంలో మన సౌరశక్తి సామర్థ్యం ఆశ్చర్యకరంగా 3000 శాతం వృద్ధిని సాధించింది.” అని ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడం, గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ వ్యూహాత్మక కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్రీన్‌ హైడ్రోజన్‌లో ప్రపంచ అగ్రగామిగా భారత్‌ దూసుకుపోతోందని ఆయన అన్నారు.

జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ (ఎన్జీహెచ్ఎం) గురించి ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో దేశాన్ని కీలక పాత్ర పోషించే లక్ష్యంతో ఈ మిషన్ ప్రారంభం అయిందని మంత్రి అన్నారు. ఇది ఇంధన స్వావలంబన, ఆర్థిక వృద్ధి రెండింటినీ నిర్ధారిస్తుందని ఆయన తెలిపారు.  “ఈ మిషన్ రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 6 లక్షల ఉద్యోగాలను సృష్టించడం మాత్రమే కాకుండా, సహజ వాయువు, అమ్మోనియా దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీని వల్ల లక్ష కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.  మేము ముందుకు సాగుతున్నప్పుడు, 2030 నాటికి 5 ఎంఎంటీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మా ప్రయత్నాలు దోహదపడతాయి, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా పయనింప జేస్తుంది" అని కేంద్ర మంత్రి అన్నారు.

దేశ జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ద్వారా నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలను పెట్రోలియం, సహజ వాయువు మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి వివరించారు. "2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి భారత్ నిబద్ధతతో ఉంది. ఇందుకు గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రత్యేక దృష్టితో సహా బహుముఖ విధానం ఉంటుంది. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనే మా లక్ష్యం మన ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజ్ చేయడంలో కీలకమైన దశ. దీనికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 125 గిగావాట్ల కొత్త పునరుత్పాదక శక్తి సామర్థ్యం అభివృద్ధి అవసరం" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

"ఈ మిషన్ ఏటా 15 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా దిగుమతులలో గణనీయమైన పొదుపును కూడా చేస్తోంది. మేము సమర్థవంతమైన  ఆర్థిక వ్యయం, సమగ్ర ప్రోత్సాహక విధానంతో ఈ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పైలట్ ప్రాజెక్ట్‌లు, హైడ్రోజన్ హబ్‌లు, ఆర్ అండ్ డీ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే పరిశ్రమ భాగస్వాములు రెండింటి సహకార ప్రయత్నాలపై ఈ మిషన్ విజయం ఆధారపడి ఉంటుంది" అని శ్రీ హర్దీప్ ఎస్ పూరి తెలిపారు.

కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపిందర్ ఎస్ భల్లా భారతదేశ పునరుత్పాదక ఇంధన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సున్నా కర్బన ఉద్గారాలతో స్వచ్ఛమైన శక్తి వనరుగా గ్రీన్ హైడ్రోజన్ పాత్రను,  బహుళ రంగాలలో దాని విభిన్న అనువర్తనాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి పంచామృత పథకానికి అనుగుణంగా భారతదేశం ప్రతిష్టాత్మక గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాలను వివరించారు. ఇందులో 2030 నాటికి 500 జీడబ్ల్యూ శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.
రవాణా, షిప్పింగ్ రంగాలలో పైలట్ ప్రాజెక్ట్‌లు, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ఏర్పాటు, పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, అలాగే నిల్వ, రవాణా వంటి విభాగాల కోసం కేటాయించిన బడ్జెట్‌పై కూడా శ్రీ భూపిందర్ ఎస్. భల్లా మాట్లాడారు. దేశంలో హైడ్రోజన్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందన్న అంచనా ఉందని, 2050 నాటికి సంవత్సరానికి 29 ఎంఎంటీకి చేరుకునే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఎస్ఐజీహెచ్టీ (గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ కోసం వ్యూహాత్మక జోక్యం) కార్యక్రమం, నిబంధనలు, సంకేతాలు, ప్రమాణాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వీటికి 152 ప్రమాణాలు సిఫార్సు చేయగా, 81 ఇప్పటికే ప్రచురణ అయ్యాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కె. సూద్ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో శాస్త్రీయ పరిశోధన పాత్రపై అంతర్ దృష్టులను పంచుకున్నారు. "గ్రీన్ హైడ్రోజన్‌ను సరసమైనదిగా, వినియోగవంతంగా మార్చడానికి వినూత్న పరిశోధన, సాంకేతిక పురోగతులు చాలా ముఖ్యమైనవి. సవాళ్లను అధిగమించడానికి, గ్రీన్ హైడ్రోజన్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనం పరిశోధనలు, అభివృద్ధికి మద్దతునిస్తూనే ఉండాలి, ”అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారతదేశ పురోగతి, భవిష్యత్తు ఆకాంక్షలను వివరిస్తూ "ఇండియాస్ జర్నీ టువర్డ్స్ ఎ గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ" పేరుతో వీడియో ప్రదర్శించారు.
సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్‌ఐఆర్) సెక్రటరీ డాక్టర్ ఎన్. కలైసెల్వి వందన సమర్పణతో ప్రారంభ సెషన్ ముగిసింది. “గ్రీన్ హైడ్రోజన్‌లో జరుగుతున్న పరివర్తనలో దేశం ముందంజలో ఉంది. పుష్కలంగా పునరుత్పాదక వనరులు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో, మన దేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది” అని ఆమె అన్నారు.

గ్రీన్ హైడ్రోజన్ 2024 రెండవ అంతర్జాతీయ సమావేశం ( ఐసిజిహెచ్-2024) ను పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం నిర్వహిస్తున్నాయి. అమలు, విజ్ఞాన భాగస్వాములుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసిఐ) ఈవై ఉన్నాయి. పారిశ్రామిక భాగస్వామిగా ఫిక్కీ ఉంది.


 

***


(Release ID: 2053994) Visitor Counter : 132