ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వస్తుసేవల పన్ను మండలి 54వ సమావేశం సిఫారసులు


జీవిత/ఆరోగ్య బీమాపై ‘జిఎస్‌టి’ అంశంపై అధ్యయనం కోసం పన్ను శాతాల హేతుబద్ధీకరణపై ఇప్పటికేగల మంత్రుల బృందానికి (జిఒఎం) సిఫారసు... 2024 అక్టోబరు నెలాఖ‌రుక‌ల్లా నివేదిక సమర్పించాల‌ని సూచ‌న‌;

పరిహార సుంకం కొనసాగింపుపై అధ్యయనానికి కూడా ‘జిఒఎం’ ఏర్పాటు చేయాలని మండలి సిఫారసు;

ప్రభుత్వ సంస్థలు లేదా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 35 కిందగల ప్రభుత్వ/ప్రైవేట్ గ్రాంట్లతో పనిచేసే పరిశోధన సంస్థ.. విశ్వవిద్యాలయం.. కళాశాల లేదా ఇతర సంస్థల ద్వారా పరిశోధన-ఆవిష్కరణ సేవల ప్రదానాన్ని ‘జిఎస్‌టి’ నుంచి మినహాయించాలని సిఫారసు;

కేన్సర్ మందులు- ‘ట్రస్టు జ‌మాబ్ డెరుక్స్టిక‌న్‌, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్’లపై ప‌న్ను 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని సిఫార‌సు;

‘బి2సి’ ఇ-ఇన్‌వాయిస్ విధానం ప్రయోగాత్మక అమలుకు సిఫారసు

Posted On: 09 SEP 2024 7:57PM by PIB Hyderabad

   కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) మండలి ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైంది. ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరితోపాటు గోవా, మేఘాలయ ముఖ్యమంత్రులు సహా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు; రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర/రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

   సమావేశంలో వివిధ అంశాలపై చర్చల అనంతరం వస్తుసేవల పన్ను శాతాల్లో మార్పులు, వ్యక్తులకు ఉపశమనం, వాణిజ్య సౌలభ్య కల్పన, నిబంధనానుసరణలో క్రమబద్ధీకరణ చర్యలకు సంబంధించి దిగువ పేర్కొన్న మేరకు పలు సిఫారసులు చేసింది.

ఎ. వస్తుసేవల పన్నుశాతాల్లో మార్పులు/వివరణలు:

వస్తువులు

1. ఉపాహార/అల్పాహార (నమకీన్స్/స్నాక్స్) తినుబండారాలు

·         వస్తుసేవల పన్ను పరిధిలో ‘హెచ్ఎస్ 1905 90 30’ వర్గీకరణ కింద‌కు వ‌చ్చే వివిధ రకాల ఉపాహార/అల్పాహార (నమకీన్/స్నాక్స్) ఉత్పత్తులపై (వేయించని లేదా వండని చిరుతిండ్లు- పేరేదైనా ఎక్స్‌ ట్రూష‌న్‌ ప్రక్రియతో తయారయ్యేవి మినహా) పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. దీంతో ఈ ఉత్పత్తులన్నీ ప్రస్తుతం ఇదే శ్లాబులో ‘హెచ్ఎస్ 2106 90’ వర్గీకరణ కింద‌కు వ‌చ్చే వినియోగ సంసిద్ధ నమ్‌కీన్‌లు, భుజియా, మిక్చర్, చబేనా (ప్యాకేజ్/లేబుల్ గల) వంటి తినుబండారాలతో సమాన పన్ను స్థాయికి వస్తాయి. అయితే, వేయించని లేదా వండని చిరుతిండ్లు- పేరేదైనా ఎక్స్‌ ట్రూష‌న్‌ ప్రక్రియతో తయారయ్యేవాటిపై 5 శాతం పన్ను కొనసాగుతుంది.

·         ఈ విధంగా వివిధ ఉత్పత్తులపై 12 శాతానికి తగ్గించిన పన్ను ‘హెచ్ఎస్ 1905 90 30’ వర్గీకరణ కింద‌కు వ‌చ్చే ఉత్పత్తులపైనా భవిష్యత్తులో వర్తిస్తుందని స్పష్టీకరణ.

2. కేన్సర్ మందులు

·         కేన్సర్ మందులు- ‘ట్రస్టుజ‌మాబ్ డెరుక్స్టిక‌న్‌, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్’లపై ప‌న్ను 12 నుంచి 5 శాతానికి తగ్గుతుంది.

3. లోహపు తుక్కు

·         నమోదుకాని వ్యక్తి ద్వారా నమోదిత వ్యక్తికి లోహపు తుక్కు సరఫరాపై ‘రివర్స్ ఛార్జ్ మెకానిజం’ (ఆర్‌సిఎమ్‌) ప్రవేశపెడతారు. సరఫరా నిర్దిష్ట పరిమితికి మించితే సరఫరాదారు నమోదు (రిజిస్ట్రేషన్) చేసుకోవాలి. తద్వారా వారు సరఫరా పరిమితికి లోబడి ఉన్నప్పటికీ సరకు గ్రహీత ‘ఆర్‌సిఎమ్‌’ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

·         ‘బి2బి’ సరఫరా లావాదేవీలకు సంబంధించి లోహపు తుక్కు సరఫరాపై చెల్లింపుల మీద 2 శాతం వంతున మూలంలో పన్ను కోత వర్తిస్తుంది.

4. రైల్వేల కోసం రూఫ్ మౌంటెడ్ ప్యాకేజీ యూనిట్ (ఆర్ఎంపియు) ఎయిర్ కండిషనర్లు

·         రైల్వేల కోసం రూఫ్ మౌంటెడ్ ప్యాకేజీ యూనిట్ (ఆర్ఎంపియు) ఎయిర్ కండిషనర్లు 28 శాతం పన్ను విధించదగిన ‘హెచ్ఎస్ 8415’ వర్గీకరణ కింద‌కు వ‌స్తాయని స్పష్టం చేసింది.

5. కార్లు, మోటార్ సైకిల్ సీట్లు

·         కారు సీట్లు 9401 వర్గీకరణకు కిందకు వస్తాయని, అందువల్ల 18 శాతం పన్ను శ్లాబు కిందకు వస్తాయని స్పష్టం చేసింది.

·         ‘జిఎస్‌టి’ పరిధిలో 9401 వర్గీకరణ కిందకు వచ్చే కారు సీట్లపై పన్ను 18 నుంచి 28 శాతానికి పెరుగుతుంది. ఇప్పటికే 28శాతం పన్ను పరిధిలోగల మోటార్‌సైకిల్ సీట్ల స్థాయితో సమానంగా త్వరలో అమలుకు నిర్ణయం.

సేవలు

1. జీవిత/ఆరోగ్య బీమా

·         జీవిత/ఆరోగ్య బీమాపై ‘జిఎస్‌టి’ సంబంధిత అంశాలన్నిటిపై సమగ్ర అధ్యయనం కోసం  మంత్రుల బృందం (జిఒఎం) ఏర్పాటుకు మండలి సిఫారసు. బీహార్, ఉత్తరప్రదేశ్,  పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, గోవా, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, గుజరాత్‌ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ ‘జిఒఎం’ 2024 అక్టోబరు నెలాఖరు నాటికి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది.

2. హెలికాప్టర్ల ద్వారా ప్రయాణిక రవాణా

·         షేరింగ్ సీట్ల ప్రాతిపదికన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణిక రవాణాపై 5 శాతం ‘జిఎస్‌టి’ విధింపుతోపాటు ప్రకటిస్తూ, గత కాలానికిగాను ‘యథాతథ’ స్థితి ఆధారంగా క్రమబద్ధీకరణకు ప్రకటన. అలాగే ప్రైవేటు హెలికాప్టర్ సేవలపై 18 శాతం పన్ను కొనసాగుతుందని స్పష్టీకరణ.

3. పైలట్ శిక్షణ కోర్సులు

·         ‘డిజిసిఎ’ ఆమోదంగల పైలట్ శిక్షణ సంస్థలు  (ఎఫ్‌టిఒ) నిర్వహించే ఆమోదిత కోర్సులకు పన్ను మినహాయింపును సర్క్యులర్ ద్వారా స్పష్టీకరణకు నిర్ణయం.

4. పరిశోధన-ఆవిష్కరణ సేవల ప్రదానం సరళీకరణ

·         ప్రభుత్వ సంస్థలు లేదా ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 35లోని ఉప నిబంధ‌న (1) కిందగల నియ‌మం (ii) లేదా (iii) ప‌రిధిలో ప్రభుత్వ/ప్రైవేట్ గ్రాంట్లతో పనిచేసే పరిశోధన సంస్థ, విశ్వవిద్యాలయం, కళాశాల లేదా ఇతర సంస్థల ద్వారా పరిశోధన-ఆవిష్కరణ సేవల ప్రదానాన్ని ‘జిఎస్‌టి’ నుంచి మినహాయించాలని సిఫారసు

·         దీనికి సంబంధించి పాత అభ్యర్థలనపై ‘యథాతథ స్థితి’ ప్రాతిపదికన క్రమబద్ధీరణకు నిర్ణయం.

5. ప్రదేశం ఎంపికపై రుసుముల విధింపు (పిఎల్‌సి)

·        నిర్మాణ సమాప్తి ధ్రువీకరణ పత్రం జారీకి ముందు నివాస/వాణిజ్య/పారిశ్రామిక సముదాయ నిర్మాణ సేవల సంబంధిత మొత్తంతోపాటు చెల్లించిన ప్రాదేశిక రుసుము లేదా ప్రదేశం ఎంపిక రుసుములు (పిఎల్‌సి) నిర్మాణ సేవల సరఫరా ప్రధాన సేవగాగల మిశ్రమ సేవాప్రదానంలో అంతర్భాగమని స్పష్టీకరణ. ‘పిఎల్‌సి’ సహజంగా దానితో ముడిపడి ఉంటుంది కాబట్టి, ప్రధానమైన నిర్మాణ సేవ తరహాలోనే దానికీ పన్ను వర్తిస్తుంది.

6. అనుబంధ సేవలు

i       ‘సిబిఎస్ఇ’ వంటి విద్యా బోర్డుల ‘అనుబంధ’ సేవాప్రదానం పన్ను పరిధిలోకి వస్తుందని స్పష్టీకరణ. అయితే, రాష్ట్ర/కేంద్ర విద్యా బోర్డులు, విద్యా మండళ్లు, అదే తరహాలోగల ఇతర సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలకు ఈ సేవా ప్రదానంపై మినహాయింపు ఉంటుంది. కాగా, మునుపటి సేవప్రదానం విషయంలో 01.07.2017 నుంచి 17.06.2021 మధ్య వ్యవధికి సంబంధించి ‘యథాతథ స్థితి’ ప్రాతిపదికన క్రమబద్ధీకరణ ఉంటుంది.

ii      అయితే, విశ్వవిద్యాలయాలు తమ కళాశాలలకు అందించే అనుబంధ సేవాప్రదానానికి 28.06.2017 నాటి నోటిఫికేషన్ నం.12/2017-సిటి(ఆర్), ‘జిఎస్‌టి’ కింద విద్యా సంస్థలకు ఇచ్చిన మినహాయింపు వర్తించదని, దీనికి 18 శాతం పన్ను విధింపు ఉంటుందని స్పష్టీకరణ.

7. శాఖా కార్యాలయం ద్వారా సేవల దిగుమతి

·        భార‌త్‌లోని విదేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ శాఖ ఇతర దేశాల్లో తమకు సంబంధించిన వ్యక్తి లేదా సంస్థల నుంచి ఎలాంటి ప్రతిఫలం చెల్లించకుండా దిగుమతి చేసుకునే సేవలపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది. దీనిపై గతకాలానికి సంబంధించి ‘యథాతథ స్థితి’ ప్రాతిపదికన క్రమబద్ధీకరణకు సిఫారసు.

8. కిరాయికి వాణిజ్య ఆస్తులు

·        రాబడి నష్టనిరోధం దిశగా నమోదిత వ్యక్తికి నమోదుకాని వ్యక్తి వాణిజ్య ఆస్తి అద్దెకు ఇవ్వడాన్ని రివర్స్ చార్జి మెకానిజం (ఆర్‌సిఎం) కింద పన్ను పరిధిలోకి తెస్తూ నిర్ణయం.

9. ‘జిటిఎ’ ద్వారా అనుబంధ/మధ్యంతర సేవల ప్రదానం

·         రోడ్డు మార్గంలో వస్తు రవాణా సందర్భంగా ‘జిటిఎ’ ద్వారా అనుబంధ/మధ్యంతర సేవా ప్రదానంలో ‘జిటిఎ’ సరకు రవాణా పట్టికను కూడా జారీచేస్తే అది ఒక మిశ్రమ సరఫరాగా పరిగణించబడుతుంది. కాబట్టి, లోడ్/అన్‌లోడ్, ప్యాకింగ్/అన్‌ప్యాకింగ్, రవాణా, తాత్కాలిక గిడ్డంగి వసతి వగైరాలన్నీ అనుబంధ/మధ్యంతర సేవలలో అంతర్భాగంగా ఉంటాయని స్పష్టీకరణ. వస్తు రవాణా సమయంలో ఈ సేవలతో నిమిత్తం లేకుండా విడిగా బిల్లు (ఇన్వాయిస్) ఇచ్చినట్లయితే ఈ సేవలను వస్తు రవాణా మిశ్రమ సరఫరాగా పరిగణించరు.

ఇతరత్రా మార్పులు

10. చలనచిత్రాల కొనుగోలు, పంపిణీకి సంబంధించి పంపిణీదారు లేదా ఉప-పంపిణీదారుల ప్రధాన లావాదేవీలపై 01.10.2021కి ముందు కాలానికి సంబంధించి ‘యథాతథ స్థితి’ ప్రాతిపదికన పన్ను బకాయిల క్రమబద్ధీకరణ.

11. విద్యుత్ సంస్థలు తమ విద్యుత్ సరఫరా, పంపిణీ సేవలలో భాగంగా మిశ్రమ సేవా ప్రదానం కింద వినియోగదారులకు అందించే తక్షణ, అనుబంధ, సమీకృత సేవలకు సంబంధించి దరఖాస్తు రుసుము, విద్యుత్ మీటర్‌పై అద్దె ఛార్జీలు, మీటర్లు/ట్రాన్స్‌ ఫార్మర్లు/కెపాసిటర్ల పరీక్ష రుసుములు, మీటర్లు/సర్వీస్ లైన్ల మార్పు నిమిత్తం వినియోగదారుల నుంచి రుసుములు, డూప్లికేట్ బిల్లుల రుసుము తదితరాలపై గతకాలపు పన్ను మినహాయింపు ‘యథాతథ స్థితి’ ప్రాతిపదికన క్రమబద్ధీకరణ.

బి. వాణిజ్య సౌలభ్యం దిశగా చర్యలు:

1. ‘సిజిఎస్‌టి’ చట్టంలోని సెక్షన్ 128ఎ నిర్దేశిస్తున్న మేరకు ‘సిజిఎస్‌టి’ చట్టం-2017 సెక్షన్ 73 కింద 2017-182018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను బకాయిలపై వడ్డీ లేదా జరిమానా లేదా రెండింటి రద్దుకు విధివిధానాలు, షరతులు:

‘సిజిఎస్‌టి’ చట్టంలోని సెక్షన్ 128ఎ నిర్దేశిస్తున్న మేరకు ‘సిజిఎస్‌టి’ చట్టం-2017 సెక్షన్ 73 కింద 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను పన్ను బకాయిలపై వడ్డీ లేదా జరిమానా లేదా రెండింటి రద్దుకు విధివిధానాలు, షరతులను పొందుప‌ర‌చేందుకు వీలుగా ‘సిజిఎస్‌టి చ‌ట్టం-2017’ నిబంధ‌న‌ల‌లో 164 నిబంధ‌న‌తోపాటు కొన్ని ఫారాల‌ను జోడించాలని మండ‌లి సిఫార‌సు చేసింది. అలాగే నమోదిత వ్యక్తులు ఈ ప్రయోజనం పొందడం కోసం పన్ను చెల్లించాల్సిన గడువు తేదీని 31.03.2025గా నిర్దేశిస్తూ ‘సిజిఎస్‌టి’ చట్టంలోని సెక్షన్ 128ఎ పరిధిలోని ఉప సెక్షన్ (1) కింద ప్రకటన జారీచేయాలని కూడా సిఫారసు చేసింది. అంతేకాకుండా వడ్డీ లేదా జరిమానా లేదా రెండింటి రద్దు సంబంధిత వివిధ అంశాలను స్పష్టీకరిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేయాలని కూడా సూచించింది. దీంతోపాటు ఫైనాన్స్ (నం.2) చట్టం-2024లోని సెక్షన్ 146 ప్రకారం ‘సిజిఎస్‌టి’ చ‌ట్టం-2017లో సెక్షన్ 128ఎ జోడింపు 01.11.2024 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించవచ్చునని కూడా సిఫారసు చేసింది.

2. ‘సిజిఎస్‌టి’ చట్టం-2017 సెక్షన్ 16లో జోడించిన ఉప సెక్షన్లు (5), (6) అమలు యంత్రాంగం:

‘సిజిఎస్‌టి’ చట్టం-2017 సెక్షన్ 16లో ఉప సెక్షన్లు (5), (6) జోడింపును అనుమతించే ఆర్థిక (నం.2) చట్టం-2024లోని 118, 150 సెక్షన్లు ముందు తేదీ- 01.07.2017 నుంచి అమలులోకి వచ్చినట్లు వీలైనంత త్వరగా ప్రకటన జారీచేయాలని మండలి సిఫారసు చేసింది.

‘సిజిఎస్‌టి’ చట్టం సెక్షన్ 16లోని ఉపబ్-సెక్షన్ (4) కిందగల నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అక్రమ పద్ధతిలో పొందినవారికి ఆ మొత్తం రాబట్టడం కోసం

చట్టంలోని సెక్షన్ 73 లేదా 74 లేదా 107 లేదా 108 కింద ఏదైనా ఆదేశాలు జారీ అయిన పక్షంలో సెక్షన్ 148 కింద అవసరమైన దిద్దుబాట్ల కోసం పన్ను విధించదగిన వ్యక్తులు అనుసరించాల్సిన ప్రత్యేక విధానాన్ని ప్రకటించవచ్చునని మండలి సిఫారసు చేసింది. అయితే, వారు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అందుబాటులో ఉండి, చట్టంలోని సెక్షన్ 16 పరిధిలోని ఉపబ్-సెక్షన్ (5) లేదా (6) కింద సదరు ఆదేశాలపై అప్పీల్ దాఖలు చేయనివారై ఉండాలి. సంబంధిత నిబంధనల అమలుకు ప్రక్రియతోపాటు వివిధ అంశాలను స్పష్టీకరిస్తూ ఒక సర్క్యులర్‌ జారీ చేయాలని మండలి సిఫారసు చేసింది.

3. ‘సిజిఎస్‌టి’ నిబందనలు-2017లోని 89, 96 నిబంధనల కింద సవరణలతోపాటు ‘సిజిఎస్‌టి’ నిబంధనలు-2017లోని 96 (10) ప్రకారం ఉత్పాదకాలపై రాయితీ/ మినహాయింపు నోటిఫికేషన్ల ప్రయోజనం పొందిన పక్షంలో ఎగుమతులపై ‘ఐజిఎస్‌టి’ కింద వాపసులకు సంబంధించి స్పష్టత ఇచ్చింది:

కస్టమ్స్ శాఖ 13.10.2017న జారీచేసిన నోటిఫికేషన్ నంబర్ 78/2017 లేదా అదే తేదీనాటి నోటిఫికేషన్ నంబర్ 79/2017, ప్రకారం ప్రయోజనాలను పొందడం ద్వారా సమీకృత పన్ను, పరిహార సుంకం చెల్లించకుండా ఉత్పాదకాలను తొలుత ఎక్కడ దిగుమతి చేసుకున్నారో స్పష్టం చేయాలని సిఫారసు చేసింది. అయితే, ఆ తర్వాత సదరు ఉత్పాదకాలపై సమీకృత పన్ను, పరిహార సుంకాలపై వర్తించే వడ్డీతోపాటు చెల్లించి ఉంటే వాటికి సంబంధించిన ప్రవేశ బిల్లుపై ఈ మేరకు అధికార పరిధిగల కస్టమ్స్ అధికారులు తిరిగి అంచనా వేస్తారు. అనంతరం ఎగుమతులపై చెల్లించిన సమీకృత పన్ను వాపసు ఎగుమతిదారుకు లభిస్తుంది. ఆ విధంగా పొందిన పన్ను వాపసును ‘సిజిఎస్‌టి’ 96వ నిబంధన కిందగల ఉప-నిబంధన (10) నియమానికి విరుద్ధమైనదిగా పరిగణించరు.

   ఎగుమతులపై పన్ను వాపసు విషయంలో ‘సిజిఎస్‌టి’ నిబంధనలు-2017లోని 96(10), 89(4ఎ) 89(4బి) నిబంధనలతో పరిమితుల విధింపు వల్ల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మండలి పరిగణనలోకి తీసుకుంది. నిర్దేశిత రాయితీ/ మినహాయింపు నోటిఫికేషన్ల ప్రకారం ఉత్పాదకాలపై ప్రయోజనం పొందిన సందర్భంలో ‘సిజిఎస్‌టి’ నిబంధనలు-2017లోని 96(10), 89(4ఎ), 89(4బి)ల నుంచి మినహాయించాలని మండలి సిఫారసు చేసింది. తద్వారా సదరు ఎగుమతుల సంబంధిత పన్ను వాపసు ప్రక్రియ సరళం, వేగవంతం అవుతుంది.

4. కొన్ని అంశాలకు సంబంధించి అస్పష్టత, చట్టపరమైన వివాదాలకు స్వస్తి దిశగా సర్క్యులర్ల ద్వారా వివరణల జారీ:

విభిన్న భాష్యాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల రీత్యా కింది అంశాలపై తలెత్తే సందేహాలు, సందిగ్ధాల తొలగింపు స్పష్టత నిమిత్తం సర్క్యులర్లు జారీ చేయాలని మండలి సిఫారసు చేసింది:

i       భారతీయ ప్రకటనల కంపెనీలు విదేశీ సంస్థలకు అందించే ప్రాదేశిక ప్రకటన సేవలపై స్పష్టత.

ii      వాహన తయారీదారుల డీలర్లు నిర్వహించే డెమో వాహనాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభ్యతపై స్పష్టత.

iii     దేశంలోని సేవా ప్రదాతల నుంచి భారత్ వెలుపలగల క్లౌడ్ కంప్యూటింగ్ సేవా ప్రదాతలకు అందించిన డేటా హోస్టింగ్ సేవల ప్రాదేశికతపై స్పష్టీకరణ.

5. సిజిఎస్‌టి నిబంధనలు-2107లో మరికొన్ని సవరణలను కూడా మండలి సిఫారసు చేసింది.

సి. ఇతర చర్యలు

1. బి2సి ఇ-ఇన్‌వాయిస్:

‘బి2బి’ ఇ-ఇన్‌వాయిస్‌ పద్ధతి విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు ‘బి2సి’ ఇ-ఇన్‌వాయిస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని మండలి సిఫారసు చేసింది. ఈ మేరకు చిల్లర వ్యాపారంలోనూ ఈ పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఒనగూడుతాయని గుర్తించింది. ఉదాహరణకు వ్యాపార సామర్థ్యం మెరుగుదల, పర్యావరణ హితం కావడంతోపాటు వ్యాపార  వ్యయం తగ్గుదల కూడా సాధ్యమని అంచనా వేసింది.

అలాగే వినియోగదారులకు ‘జిఎస్‌టి’ రిటర్న్‌ ద్వారా ఇన్‌వాయిస్ ధ్రువీకరణ అవకాశం లభిస్తుంది. ఎంపిక చేసిన రంగాలు, రాష్ట్రాలలో స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ ప్రయోగాత్మక విధానం అమలు చేస్తారు.

1. ఇన్‌వాయిస్ నిర్వహణ వ్యవస్థ - కొత్త పద్దు పుస్తకాలు:

ప్రస్తుత ‘జిఎస్‌టి’ రిటర్నుల స్వరూపంలో మెరుగుదలను కూడా మండలి పరిగణనలోకి తీసుకుంది. ఈ జాబితాలో ‘రివర్స్ ఛార్జ్ మెకానిజం’ (ఆర్‌సిఎం) లెడ్జర్, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రీక్లెయిమ్ లెడ్జర్, ఇన్‌వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎంఎస్) ప్రవేశపెట్టడం వంటివి  ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదరు లెడ్జర్లకు సంబంధించి ప్రారంభ నిల్వను ప్రకటించేందుకు 2024 అక్టోబరు 31 నుంచి పన్ను చెల్లింపుదారులకు అవకాశం లభిస్తుంది.

   ‘ఐఎంఎస్’ ద్వారా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందే దిశగా ఇన్‌వాయిస్‌ల ఆమోదం, తిరస్కరణ లేదా పెండింగ్‌లో ఉంచే వెసులుబాటు పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిములో లోపాల తగ్గింపు, సామరస్యం మెరుగు దిశగా వారికి ఇదొక ఐచ్ఛిక సౌకర్యం కాగలదు. అలాగే దీనివల్ల రిటర్నులలో ‘ఐటిసి’ సరిపోలని కారణంగా నోటీసుల జారీకి దారితీసే పరిస్థితులు తప్పుతాయని అంచనా.

గమనిక: ‘జిఎస్‌టి’ మండలి సిఫారసులు, ప్రధాన నిర్ణయాలపై భాగస్వాములందరికీ సమాచారం కోసం సరళ భాషలో ఈ వివరణ జారీ అయింది. అయితే, ఇందులో పేర్కొన్న అంశాలన్నీ సర్క్యులర్లు/నోటిఫికేషన్లు/చట్ట సవరణల ద్వారా అమలులోకి వస్తాయి. అందువల్ల వాటికి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది.

 

 

***


(Release ID: 2053419) Visitor Counter : 262