ప్రధాన మంత్రి కార్యాలయం

తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

Posted On: 05 SEP 2024 1:21PM by PIB Hyderabad

గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.

మిత్రులారా,

వేదాలు వేల సంవత్సరాల నాడు కూర్చిన గ్రంథాలు. వాటిలో సూర్యుడి గురించిన ముఖ్యమైన మంత్రమొకటి ఉంది. నేటికీ లక్షలాది మంది భారతీయులు రోజూ ఆ మంత్రాన్ని పఠిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతుల ప్రజలు తమదైన విధానాల్లో సూర్యుడిని ఆరాధిస్తున్నారు. సూర్యుడితో ముడిపడి ఉన్న పండుగలూ ప్రతీ మతంలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సౌర ఉత్సవం ద్వారా ప్రపంచమంతా ఒకచోట చేరి సూర్యుడి తేజస్సును ప్రస్తుతిస్తోంది. మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం ఈ ఉత్సవం దోహదపడుతుంది.

మిత్రులారా,

2015లో ఓ చిన్న మొక్కగా ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఐఎస్ఏ ప్రస్థానం మొదలైంది. అది నేడు మహావృక్షంగా ఎదిగి విధానాలు, కార్యాచరణకు స్ఫూర్తినిస్తోంది. అనతికాలంలోనే ఐఎస్ఏ సభ్యదేశాల సంఖ్య వంద దాటింది. మరో 19 దేశాలు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందడానికి దీని మౌలిక రూపానికి అంగీకారం చెబుతున్నాయి.‘ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్’ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా ఈ సంస్థ వృద్ధి చెందడం చాలా ముఖ్యం.

మిత్రులారా,

గడిచిన కొన్నేళ్లుగా కాలుష్య రహిత ఇంధనాల దిశగా భారత్ ప్రగతి పథంలో సాగుతోంది. పునరుత్పాదక ఇంధన అంశంలో పారిస్ ఒప్పంద వాగ్దానాలను నెరవేర్చిన తొలి జీ 20 దేశం భారత దేశమే. సౌరశక్తిలో విశేషమైన వృద్ధిని సాధించడమే ఇందుకు కారణం. పదేళ్లలో మన సౌర శక్తి సామర్థ్యం 32 రెట్లు పెరిగింది. ఈ వేగం, ఈ పరిమాణం 2030 నాటికి 500 గిగా వాట్ల శిలాజేతర ఇంధన సమర్థతను సాధించడంలోనూ దోహదపడతాయి.

మిత్రులారా,

స్పష్టమైన విధానాల ఫలితంగానే సౌర శక్తి రంగంలో భారత్ వృద్ధి సాధించింది. భారత్ లో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా అవగాహన, లభ్యత, సేకరణ శక్తులే సౌర శక్తిని అందిపుచ్చుకునే మంత్రాలు. అందుకోసం, ఈ రంగంలో దేశీయ తయారీని ప్రోత్సహించడం, సుస్థిర శక్తి వనరులపై అవగాహన పెంచడం ముఖ్యం. నిర్దిష్ట పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా కూడా సౌరశక్తిని మేం మరింత అందుబాటులోకి తెచ్చాం.

మిత్రులారా,

సౌరశక్తి అవలంబన దిశగా ఆలోచనలు, ఉత్తమ ఆచరణ పద్ధతులను పంచుకోవడానికి ఐఎస్ఏ ఆదర్శవంతమైన వేదిక. భారత్ కూడా ఎన్నో విషయాలను మీతో పంచుకోవాల్సి ఉంది. ఇటీవలి విధానపరమైన కార్యక్రమానికి సంబంధించి మీకో ఉదాహరణ చెప్తాను. కొన్ని నెలల కిందట పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను మేం ప్రారంభించాం. ఈ పథకంపై రూ. 750 బిలియన్లను మేం వెచ్చిస్తున్నాం. కోటి ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా వారికి సహాయం అందిస్తున్నాం. ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తున్నాం. తక్కువ వడ్డీతో పాటు అదనంగా నిధులు అవసరమైతే పూచీకత్తు లేని రుణాలను కూడా అందిస్తున్నాం. ఇప్పుడు, ఆ ఇళ్లలో వారి అవసరాల కోసం పర్యావరణ హిత విద్యుదుత్పత్తి జరుగుతోంది. అంతేకాకుండా, అదనపు విద్యుత్తును వారు గ్రిడ్ కు విక్రయించి, డబ్బు కూడా సంపాదించగలరు. ప్రోత్సాహకాలు, ఆదాయానికి అవకాశం ఉండడం వల్ల ఈ పథకం ప్రజాదరణ పొందుతోంది. అందుబాటు వ్యయంలో లభిస్తున్న సౌరశక్తి ప్రజలను ఆకట్టుకుంటోంది. శక్తి పరివర్తన దిశగా కృషిచేయడానికి చాలా దేశాలకు ఇదే తరహా విలువైన ఆలోచనలున్నాయని నేను కచ్చితంగా చెప్పగలను.

మిత్రులారా,

అనతికాలంలోనే ఐఎస్ఏ భారీ పురోగతి సాధించింది. 44 దేశాల్లో, దాదాపు 10 గిగావాట్ల విద్యుత్తును పెంచడంలో ఇది దోహదపడింది. అంతర్జాతీయంగా సోలార్ పంపుల ధరలను తగ్గించడంలో కూడా కూటమి కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఆఫ్రికా సభ్య దేశాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నారు. ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, భారత్ నుంచి అనేక ఆశాజనకమైన అంకుర సంస్థలకు ప్రోత్సాహం లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని త్వరలో లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కూడా విస్తరించబోతున్నారు. సరైన దిశలో పడుతున్న అడుగులుగా వీటిని గుర్తించవచ్చు.

మిత్రులారా,

ఇంధన పరివర్తనలో భరోసా కల్పించే దిశగా కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రపంచం సమష్టిగా చర్చించాల్సి ఉంది. పర్యావరణ హిత ఇంధనంపై పెట్టుబడుల కేంద్రీకరణలో అసమతౌల్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తయారీ, సాంకేతిక రంగాలను ప్రజాస్వామ్యీకరించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాలి. స్వల్పంగా అభివృద్ధి చెందిన దేశాలు, చిన్న ద్వీప దేశాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అట్టడుగు వర్గాలు, మహిళలు, యువతను ఇందులో సమ్మిళితం చేయడం కీలకం. అంతర్జాతీయ సౌర ఉత్సవం ఇలాంటి విషయాల్లో చర్చలకు వీలు కల్పిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

హరిత భవిష్యత్తు కోసం ప్రపంచంతో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. గతేడాది జరిగిన జీ20 సదస్సులో అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి  ఏర్పాటుకు మేం ముందుకొచ్చాం. అంతర్జాతీయ సౌర కూటమి సభ్యదేశాల్లోనూ భారత్ ఒకటిగా ఉంది. సమ్మిళిత, శుద్ధ, పర్యావరణ హిత ప్రపంచ నిర్మాణం లక్ష్యంగా చేసే ప్రతి కృషికీ భారత్ మద్దతిస్తుంది.

మరోసారి, అంతర్జాతీయ సౌర ఉత్సవానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సూర్యశక్తి ప్రపంచాన్ని సుస్థిర భవిష్యత్తు దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.

ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

 

***



(Release ID: 2052699) Visitor Counter : 31