ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లో "జల్ సంచయ్ జన్ భాగీదారి" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Posted On: 04 SEP 2024 6:25PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 6న గుజరాత్‌ సూరత్‌లో సామాజిక భాగస్వామ్య కార్యక్రమం "జల్ సంచయ్ జన్ భాగీదారి"ను ప్రారంభించనున్నారు. ‘జల్ శక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపట్టు’ పథకాన్ని మరింత వేగంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. సామాజిక భాగస్వామ్యం, యాజమాన్యానికి గట్టి ప్రాధాన్యత ఇస్తూ సమాజం, ప్రభుత్వం మొత్తంగా నీటి సంరక్షణకు కృషి చేయాలన్న ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా భవిష్యత్‌లో నీటి విషయంలో సురక్షిత భవిష్యత్తును నిర్ధారించేందుకు ప్రజలు, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, ఇతర భాగస్వాములను సమీకరించేందుకు గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి భద్రతకు సంబంధించి మోదీ దార్శనికతకు ఏవిధంగా సామాజిక కార్యకలాపాలు, యాజమాన్యం సమర్థవంతంగా సహాయపడుతుందో, ముందుకు తీసుకెళ్లగలదో ఈ కార్యక్రమం ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమం కింద నిర్మించిన రీఛార్జ్‌ నిర్మాణాలు వర్షపు నీటి సంరక్షణను పెంచడానికి, దీర్ఘకాలిక నీటి సుస్థిరతను సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. 

 

జల్ సంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమం లక్ష్యం:

 

జలసంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమం నీటి సంరక్షణను జాతీయ ప్రాధాన్యాంశం చేయాలన్న ప్రధాని అచంచల సంకల్పానికి ప్రతీకగా ఉండనుంది. సుస్థిర నీటి నిర్వహణ కోసం ఆయన చేసిన హామీలు, తన ప్రసంగాలలో తరచూ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చాయి. నీటి భద్రత అనేది కేవలం విధానపరమైన లక్ష్యం కాదని, ప్రతి పౌరుడు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల సమిష్టి కృషి అవసరమని ప్రధాని తరచూ చెబుతుంటారు. 

 

జలసంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమం నీటి సంరక్షణలో గుజరాత్ మార్గదర్శక విధానాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని ప్రజలు పాల్గొనేలా, సీఎస్ఆర్ ఆధారిత ప్రాజెక్టులతో చేపట్టనున్నారు.  జల్ శక్తి అభియాన్: వర్షపు నీటిని ఒడిసిపట్టటం కార్యక్రమాన్ని, ప్రతి వర్షపు చుక్కను విలువైన వనరుగా మార్చాలన్న ప్రధాని దార్శనికతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. 

 

ఈ కార్యక్రమం భారతదేశం అంతటా భవిష్యత్తులో నీటి సంరక్షణకు తీసుకునే చర్యలకు వేదికను ఏర్పాటు చేసే ఒక మైలురాయిగా ఉండనుంది. గుజరాత్ మార్గదర్శక నమూనాను ప్రదర్శించడం ద్వారా, ఇది సమిష్టి చర్యను ప్రేరేపించడం, దేశ శ్రేయస్సు కోసం స్థిరమైన నీటి నిర్వహణకు సంబంధించి ప్రాముఖ్యతను తెలియజేయటం ఈ కార్యక్రమం లక్ష్యాలలో ఉంది. 

 

ప్రభావం,  భవిష్యత్ కార్యక్రమాలు: 

 

"జల్ సంచాయ్ జన్ భాగీదారి" కార్యక్రమం సీఎస్ఆర్ ఆధారిత కార్యక్రమాలకు ప్రతిరూప నమూనాను సృష్టించడం ద్వారా నీటి సంరక్షణ దిశగా చేసే ప్రయత్నాలను మరింత ఉత్తేజపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం గుజరాత్ విజయాన్ని ప్రదర్శించటమే కాక, ఇలాంటి వ్యూహాలను అవలంబించడానికి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర నోడల్ అధికారులు పాల్గొనడం ఈ కార్యక్రమ జాతీయ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 

 

"జల్ సంచాయ్ జన్ భాగీదారీ"ను ప్రారంభించడం నీటి భద్రత దిశగా దేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు. సామాజిక భాగస్వామ్యం, సీపీఆర్‌ నిధులను ఉపయోగించడం ద్వారా, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలకు ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా రాబోయే తరాలకు స్థిరమైన నీటి భవిష్యత్తు అందేలా చూస్తుంది. 

 

నేపథ్యం:

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో జల్ సంచాయ్‌పై చూపిన ప్రేరణతో, జల్ శక్తి అభియాన్ (జేఎస్ఏ) 2019 సంవత్సరంలో దేశంలోని 256 నీటి ఎద్దడి జిల్లాల్లోని 2,836 బ్లాకులకు గాను 1,592 బ్లాకుల్లో ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో జేఎస్ఏ చేపట్టలేకపోయారు. "వర్షాన్ని ఒడిసిపట్టండి - అది పడిపోయినప్పుడు ఎక్కడ పడుతుంది" అనే ఇతివృత్తంతో 2021 లో "జల్ శక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపట్టండి" (జెఎస్ఏ: సీటీఆర్) కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు) అన్ని బ్లాకులను పరిధిలో ప్రారంబించారు. "జల్ శక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపట్టు" కార్యక్రమం వార్షికంగా చేపడుతున్నారు. జేఎస్ఏ ఐదో విడత 09.03.2024 న " మహిళ శక్తి నుంచి జల శక్తి(నారీ శక్తి సే జల్ శక్తిఘ" అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రారంభించారు.

 

***



(Release ID: 2052691) Visitor Counter : 29