పర్యటక మంత్రిత్వ శాఖ
15 వరకూ ‘దేఖో అప్నా దేశ్, పీపుల్స్ చాయిస్ 2024’ ఓటింగ్
అత్యంత ప్రాధాన్య పర్యాటక ప్రదేశాలను గుర్తించి ప్రపంచస్థాయి గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
Posted On:
06 SEP 2024 2:28PM by PIB Hyderabad
‘దేఖో అప్నా దేశ్, పీపుల్స్ చాయిస్ 2024’ పేరిట తొలిసారిగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన మేధోసంపత్తి కార్యక్రమంపై దేశ ప్రజల నాడిని తెలుసుకునేందుకు కేంద్ర పర్యాటక శాఖ కసరత్తు చోస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 7న శ్రీనగర్ లో దీనిని ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను సెప్టెంబరు 15 లోగా ఓటింగ్ ద్వారా తెలియజేయవచ్చు.
అత్యంత ప్రాధాన్యం గల పర్యాటక ప్రదేశాలను గుర్తించడంలో ప్రజల భాగస్వామ్యం; ఆధ్యాత్మిక, సాంస్కృతిక-వారసత్వం, ప్రకృతి-వన్యప్రాణులు, సాహసయాత్రలు, ఇతర ప్రదేశాలు అనే ఐదు కేటగిరీల్లో పర్యాటకుల అనుభవాలను తెలుసుకోవడం ఈ దేశవ్యాప్త పోలింగ్ ఉద్దేశం. ప్రధాన కేటగిరీలతో పాటు ‘ఇతరాలు’ కేటగిరీలో వ్యక్తిగత ఇష్టం మేరకు ఓటు వేసి ఎవరికీ పెద్దగా తెలియని ఉత్తమ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయొచ్చు. శక్తిమంతమైన సరిహద్దు గ్రామాలు, ఆరోగ్య పర్యాటకం, వివాహ పర్యాటకం మొదలైన అంశాల్లో వాటికి ప్రాచుర్యం కల్పించవచ్చు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://innovateindia.mygov.in/dekho-apna-desh/ పోర్టల్ లో మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా వివిధ కేటగిరీల వారీగా (ఆధ్యాత్మికం, సాంస్కృతిక-వారసత్వ, ప్రకృతి-వన్యప్రాణులు, సాహసయాత్రలు, ఇతరాలు) ఓటు వేయవచ్చు.
దేశంలో అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలను గుర్తించడానికి ఈ ఓటింగ్ దోహదపడుతుంది. తద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించడానికి వీలవుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా సాంస్కృతిక అస్తిత్వచిహ్నాలను, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సంరక్షించడం పర్యాటక మంత్రిత్వ శాఖ లక్ష్యం. ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు అంతగా సుపరిచితం కాని పర్యాటక ప్రాంతాలను కూడా ప్రజలు సందర్శించేలా అభివృద్ధి చేయడానికీ ఇది ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా వికసిత భారత్@ 2047 దిశగా అడుగులు వేసేందుకు పర్యాటక శాఖ యత్నిస్తోంది. పూర్తి ప్రభుత్వ భాగస్వామ్య విధానంతో స్వల్ప, మధ్యకాలిక తరహాలో త్వరితగతిన పర్యాటక ప్రదేశాలు, గమ్యస్థానాలను గుర్తించడంలో ఇది తోడ్పడుతుంది.
మరిన్ని వివరాల కోసం https://innovateindia.mygov.in/dekho-apna-desh/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
(Release ID: 2052683)
Visitor Counter : 123