హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్(ఐఎంసీటీ)ను ఏర్పాటు చేసిన హోం శాఖ


ఐఎంసీటీకి నేతృత్వం వహించనున్న ఎన్ఐడీఎం కార్యనిర్వహక డైరెక్టర్.. త్వరలో గుజరాత్‌లోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న ఐఎంసీటీ




ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం




2019 ఆగస్టులో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ప్రకారం, ప్రభావిత రాష్ట్రాల నుంచి మెమోరాండం కోసం వేచి ఉండకుండా నష్టాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి ముందుగానే ఐఎంసీటీలను ఏర్పాటు చేసిన కేంద్ర హోం శాఖ


ఈ సంవత్సరం, రాష్ట్రాల మెమోరాండం కోసం వేచి చూడకుండా.. వరద/కొండచరియలు విరిగిపడిన అస్సాం, కేరళ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలను ముందుగానే సందర్శించి, నష్టాలను అక్కడికక్కడే అంచనా వేసిన ఐఎంసీటీలు

Posted On: 01 SEP 2024 3:41PM by PIB Hyderabad

గుజరాత్‌లో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్- ఎన్ఐడీఎం) కార్యనిర్వహక డైరెక్టర్ నేతృత్వంలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(ఐఎంసీటీ)ను హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాల్లో ఐఎంసీటీ త్వరలో పర్యటించనుంది.

ఆగస్టు 25-30 మధ్య రాజస్థాన్, గుజరాత్‌లలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు(క్లౌడ్ బరస్ట్), కొండచరియలు విరిగిపడటంతో అతలాకుతలమైంది. హోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాల సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. తీవ్రమైన నష్టం జరిగినట్లు నివేదిక అందితే ఐఎంసీటీలను ఆయా రాష్ట్రాలకు కూడా పంపనుంది. ప్రస్తుత వర్షాకాలంలో, మరికొన్ని ఇతర రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు, వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం మొదలైన వాటితో ప్రభావితమయ్యాయి.

ప్రభావిత రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం అందించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా 2019 ఆగస్టులో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరంలో ఐఎంసీటీలను ఏర్పాటు చేసింది. ఇవి అస్సాం, కేరళ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో వరదలు/ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ముందుగానే సందర్శించి, రాష్ట్రాల మెమోరాండం కోసం వేచి చూడకుండా నష్టాలను అక్కడికక్కడే అంచనా వేశాయి. నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఐఎంసీటీని ఏర్పాటు చేశారు. ఇది త్వరలో రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించనుంది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెమోరాండం అందిన తర్వాతే ఐఎంసీటీలు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేవి.

 

***


(Release ID: 2050843) Visitor Counter : 58