మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
7వ జాతీయ పోషకాహార మాసాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి
దేశవ్యాప్తంగా చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు మిషన్ పోషణ్ 2.0 కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి
రక్తహీనత, పెరుగుదల పర్యవేక్షణ, కాంప్లిమెంటరీ ఆహారం, పోషణ కూడా చదువు కూడా, మెరుగైన పాలన కోసం సాంకేతికత, తల్లిపేరు మీద ఒక చెట్టు వంటి ఇతివృత్తాలపై దృష్టిసారించనున్న ఈ 7వ పోషకాహార మాసం
Posted On:
31 AUG 2024 5:57PM by PIB Hyderabad
7వ జాతీయ పోషకాహార మాసాన్ని గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఈవేళ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పోషకాహార సంబంధిత అవగాహన, శ్రేయస్సును పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి.. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్.. గుజరాత్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి భానుబెన్ బబారియా.. కేంద్ర, ఆ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' పేరుతో దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుజరాత్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీనియర్ అధికారులతో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. పోషకాహారం, పర్యావరణ సుస్థిరత ప్రాముఖ్యతను సూచించేలా గాంధీనగర్‌లోని అంగన్ వాడీ కేంద్రంలో పండ్ల మొక్కలను నాటారు.
మహాత్మా మందిర్‌లో ప్రధాన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి పటిష్ఠమైన, ఆరోగ్యకరమైన మానవ వనరులను నిర్మించడంలో పౌష్టికాహారం ప్రాముఖ్యతను చెప్పారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ.. పిల్లలు, కౌమారదశలోని వారు మెరుగైన ఆరోగ్యాన్ని పొందేలా చూడటం, జీవితచక్ర విధానంపై దృష్టి సారించడం ద్వారా పోషకాహార లోపంతో పోరాడటం గురించి చెప్పారు. సుపరిపాలన, ప్రభుత్వాల సమన్వయం(కన్వర్జెన్స్), సామర్థ్య పెంపు, సమాజ భాగస్వామ్యం, యాజమాన్యం అనే నాలుగు స్తంభాలపై పోషణ్ 2.0 విజయం ఆధారపడి ఉంది అన్నారు.
భారత ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ ప్రసంగిస్తూ.. ఆహార వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా పండించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజువారీ భోజనాల్లో చేర్చటానికి సంబంధించిన ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. వహ్లీ దిక్రీ యోజన, వితంతు పింఛను పథకం, వితంతు పునర్వివాహ సహాయ పథకం, మహిళా స్వావలంబన్ యోజన తదితర పథకాల కింద లబ్ధిదారులకు ఆయా పథకాల ప్రయోజనాలను ఉన్నతాధికారులు అందజేశారు.
పోషణ్ ట్రాకర్, పోషణతో పాటు చదువు వంటి ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు 'వంగి ప్రదర్శన్', 181 హెల్ప్‌లైన్ వంటి పోషకాహార, మహిళల భద్రతకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేసేందుకు ఒక ప్రదర్శనను వేదిక వద్ద నిర్వహించారు.
తల్లి పాలివ్వడం, కాంప్లిమెంటరీ ఆహారం వంటి ముఖ్యమైన ఇతివృత్తాలపై అనేక ప్రాంతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, నాటకాలు పోషకాహారానికి సంబంధించి ప్రాముఖ్యతను వెల్లడించాయి.
7వ రాష్ట్రీయ పోషణ్ మా 2024లో రక్తహీనత, గ్రోత్ మానిటరింగ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్, పోషణ్ భీ పధాయ్ భీ, టెక్నాలజీ ఫర్ బెటర్ గవర్నెన్స్, ఏక్ పెడ్ మా కే నామ్ అనే అంశాలపై దృష్టి సారించనున్నారు.
రక్తహీనత, పెరుగుదల పర్యవేక్షణ, కాంప్లిమెంటరీ ఆహారం, పోషణ కూడా చదువు కూడా, మెరుగైన పాలన కోసం సాంకేతికత, తల్లిపేరు మీద ఒక చెట్టు వంటి ఇతివృత్తాలపై ఈ 7వ పోషకాహార మాసం దృష్టిసారించనుంది.
'సుపోషిత్ భారత్' అనే ప్రధాన మంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి, "పోషకాహార మాసం దేశవ్యాప్త పండుగగా మారుతోంది, ప్రజా ఉద్యమం రూపాన్ని తీసుకుంటోంది. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తన మిషన్ పోషణ్ 2.0 ద్వారా దేశవ్యాప్తంగా పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపంపై పోరాడటానికి కట్టుబడి ఉంది" అని అన్నారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు, దేశవ్యాప్తంగా సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలనే లక్ష్యంతో ఈ నెల రోజుల కార్యక్రమం జరగనుంది.
***
(Release ID: 2050679)
Visitor Counter : 106