ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబై లో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ టవర్స్ ప్రారంభోత్సవం సందర్బంగా ప్రధాన మంత్రి ప్రసంగం
Posted On:
13 JUL 2024 9:07PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ జీ, అజిత్ దాదా పవార్ జీ, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడు రాకేష్ శర్మ జీ, విశిష్ట అతిథులు, మహిళలు!
ముందుగా, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు, మీకు ముంబైలో ఒక పెద్ద, ఆధునిక భవనం సమకూరింది. ఈ కొత్త భవనం మీ పని సామర్థ్యాన్ని, పని సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని, తద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. స్వాతంత్ర్యానికి ముందే స్థాపించిన సంస్థలలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ఒకటి. ఈ ప్రస్థానంలో మీరు అనేక ఎత్తు పల్లాలను నిశితంగా పరిశీలించి ఉంటారు, వాటిని సామాన్య ప్రజలకు తెలియజేసారు. అందువల్ల, మీ పని ఒక సంస్థగా ఎంత ప్రభావవంతంగా ఉంటుందో, దేశానికి అంత ప్రయోజనం ఉంటుంది.
మిత్రులారా,
మీడియా అంటే కేవలం దేశ పరిస్థితులను నిష్క్రియాత్మకంగా పరిశీలించడం మాత్రమే కాదు. మీడియాలోని మీరందరూ మార్పు తేవడంలో, దేశానికి మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. నేడు, భారత్ రాబోయే 25 సంవత్సరాల ప్రయాణం చాలా ముఖ్యమైన సమయంలో ఉంది. ఈ 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందాలంటే వార్తాపత్రికలు, మ్యాగజైన్ల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. దేశ పౌరులకు అవగాహన కల్పించేది మీడియానే. పౌరులకు వారి హక్కులను నిరంతరం గుర్తు చేసేది మీడియా. ప్రజలు తమ సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేసేది మీడియా. ఒక దేశంలోని పౌరులు తమ సామర్థ్యంపై విశ్వాసం పొందినప్పుడు, వారు అనేక విజయ శిఖరాలను సాధించడాన్ని మీరు చూస్తారు. నేడు భారత్‌లో కూడా ఇదే జరుగుతోంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డిజిటల్ లావాదేవీలు భారత్ ప్రజల సామర్థ్యానికి మించినవని కొందరు నేతలు బాహాటంగానే చెప్పేవారు. ఈ దేశంలో ఆధునిక సాంకేతికత పనికి రాదని భావించారు. కానీ దేశ ప్రజల జ్ఞానం, వారికున్న సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది. ఈ రోజు భారత్ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల్లో భారీ రికార్డులను బద్దలు కొడుతోంది.
నేడు, భారత్ లో విస్తృతంగా వినియోగిస్తున్న యూపీఐ, ఆధునిక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారణంగా, జీవన సౌలభ్యం పెరిగింది. డబ్బును ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేయడం సులభం అయిపోయింది. నేడు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న మన దేశీయులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి అత్యధికంగా డబ్బు పంపుతున్నారు. ఈ డిజిటల్ విప్లవం కారణంగా వారు చేసే ఖర్చు గణనీయంగా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాలు మన సాంకేతికత, అమలు నమూనాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇంతటి ఘన విజయం కేవలం ప్రభుత్వం వల్ల కాదు. మీడియాలో మీరందరూ కూడా ఈ విజయానికి సహకరించారు, కాబట్టి మీరందరూ అభినందనలకు అర్హులు.
మిత్రులారా,
సంభాషణలు, తీవ్రమైన అంశాలపై చర్చలను బలోపేతం చేయడం మీడియా సహజ పాత్ర. అయితే, మీడియా చర్చల దిశ తరచుగా ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలలో ప్రతి చర్యను ఓటుతో ముడిపెడతారని మీకు తెలుసు. మేము ఈ ఆలోచనను మార్చుకున్నాం. దశాబ్దాల కిందటే మన దేశంలో బ్యాంకులను జాతీయం చేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అయితే దేశంలో 2014 వరకు బ్యాంకు ఖాతా కూడా లేని పేదలు 40-50 కోట్ల మంది ఉన్నారనేది నిజం. జాతీయీకరణ జరిగినప్పుడు ఏం చెప్పారు, 2014లో వాస్తవం ఏమిటి? సగం దేశం బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల ఉంది. ఈ విషయం మన దేశంలో ఎప్పుడైనా చర్చనీయాంశంగా మారిందా? కానీ మేము జన్ ధన్ యోజనను ఒక ఉద్యమంలా స్వీకరించాం. దాదాపు 50 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేశాం. ఇది డిజిటల్ ఇండియా, అవినీతి నిరోధక ప్రయత్నాలలో మా అతిపెద్ద మాధ్యమంగా మారింది. అదేవిధంగా, పరిశుభ్రత ప్రచారం, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి ప్రచారాలను పరిశీలిస్తే! ఓటు బ్యాంకు రాజకీయాల ప్రసక్తే రాదు. కానీ మారుతున్న భారత్‌లో దేశంలోని మీడియా వాటిని జాతీయ చర్చనీయాంశాలలో భాగం చేసింది. 2014కి ముందు చాలా మందికి తెలియని స్టార్టప్ అనే పదాన్ని మీడియా, చర్చల ద్వారా ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది.
ఫ్రెండ్స్,
మీరందరూ మీడియాలో సీనియర్లు. చాలా అనుభవజ్ఞులు. మీ నిర్ణయాలు దేశ మీడియాకు కూడా మార్గనిర్దేశం చేస్తాయి. అందువల్ల, ఈ కార్యక్రమం ద్వారా నేను మీ ముందు కొన్ని అభ్యర్థనలను ఉంచుతున్నాను.
ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, అది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే అని అర్థం కాదు. ప్రభుత్వం ఒక నిర్దిష్ట ఆలోచనను నొక్కిచెప్పినట్లయితే, అది కేవలం ప్రభుత్వ ఆలోచన అని అర్థం కాదు. ఉదాహరణకు, దేశం అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంది, 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని నిర్వహించింది. ప్రభుత్వం ఈ ప్రచారాలను ప్రారంభించగా, దేశం మొత్తం వాటిని స్వీకరించి ముందుకు తీసుకువెళ్లింది. అదేవిధంగా నేడు దేశం పర్యావరణంపై చాలా దృష్టి సారిస్తోంది. ఇది రాజకీయాలకు అతీతం, మానవాళి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఉదాహరణకు, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరుతో ఒక చెట్టు) ప్రచారం ఇప్పుడే ప్రారంభమైంది. భారత్‌కు సంబంధించిన ఈ ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేను జి7లో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రతి ఒక్కరికి వారి తల్లితో అనుబంధం ఉన్నందున వారిలో గొప్ప ఉత్సుకత ఏర్పడింది. ఇది వ్యక్తులతో బాగా అనుసంధానం అవుతుందని వారు భావించారు. అందరూ ఈ మాట చెప్పారు. దేశంలోని మీడియా సంస్థలు ఈ ప్రయత్నానికి ఎంతగానో సహకరిస్తే, భవిష్యత్ తరాలకు అంత ప్రయోజనం చేకూరుతుంది. ఇలాంటి ప్రతి ప్రయత్నాన్ని ఈ జాతి ప్రయత్నంగా భావించి ప్రోత్సహించాలని నా విన్నపం. ఇది ప్రభుత్వ ప్రయత్నమే కాదు; ఇది దేశం ప్రయత్నం. ఈ ఏడాది కూడా రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పౌరులలో రాజ్యాంగం పట్ల కర్తవ్య భావం, అవగాహన పెంచడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషించగలరు.
మిత్రులారా,
మరో అంశం పర్యాటకానికి సంబంధించినది. కేవలం ప్రభుత్వ విధానాల వల్ల పర్యాటకం అభివృద్ధి చెందదు. మేము సమిష్టిగా ఒక బ్రాండ్‌ని సృష్టించి, దేశాన్ని మార్కెట్ చేయడానికి కృషి చేసినప్పుడు, దేశ గౌరవంతో పాటు పర్యాటకం కూడా పెరుగుతుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మీరు మీ సొంత మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు, మహారాష్ట్రలోని అన్ని వార్తాపత్రికలు సెప్టెంబరులో బెంగాల్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాయి అనుకుందాం. మహారాష్ట్రలోని ప్రజలు బెంగాల్ గురించి ప్రతి చోటా ప్రముఖంగా చూసినప్పుడు వారు బెంగాల్‌ను సందర్శించాలని ప్లాన్ చేయవచ్చు, తద్వారా బెంగాల్ టూరిజం పెరుగుతుంది. మూడు నెలల తర్వాత, మీరు తమిళనాడుపై సమష్టిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలో యాత్రలు ప్లాన్ చేసుకునే వారు తమిళనాడును ఎంచుకోవడాన్ని మీరు చూస్తారు. దేశంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి ఇది ఒక మార్గం, మీరు మహారాష్ట్ర కోసం ఇలాంటి ప్రచారాలు ఆయా రాష్ట్రాల్లో చేపడితే, మహారాష్ట్రకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది పరస్పరం రాష్ట్రాల మధ్య ఆకర్షణ, ఉత్సుకతను పెంచుతుంది. ఇటువంటి ప్రయత్నం వల్ల అదనపు శ్రమ లేకుండానే రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా మీ ఉనికిని మరింత మెరుగుపర్చుకోవాలని కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాలి. మీడియా విషయానికి వస్తే మనది 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. ఇంత పెద్ద దేశం, చాలా సంభావ్యత, అవకాశాలతో, అతి తక్కువ సమయంలో, మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం. భారత్ విజయాలను ప్రపంచం నలుమూలలకు విస్తరించే బాధ్యతను మీరు సమర్థవంతంగా తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న దేశం ఇమేజ్ నేరుగా దాని ఆర్థిక వ్యవస్థ, వృద్ధిని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసు. ఈ రోజు, భారతదేశం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడినందున విదేశాలలో భారతీయ మూలాలున్న ప్రజల స్థాయి, విశ్వసనీయత, గౌరవం పెరగడాన్ని మీరు చూస్తున్నారు. ప్రపంచ ప్రగతికి భారత్ కూడా గణనీయంగా తోడ్పడుతోంది. ఈ దృక్కోణంలో మన మీడియా ఎంత పని చేస్తే దేశానికి అంత లాభం. కాబట్టి, మీ ప్రచురణలు వీలైనన్ని ఎక్కువ యుఎన్ భాషల్లో విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. మీ మైక్రోసైట్లు, సోషల్ మీడియా ఖాతాలు ఈ భాషల్లో కూడా ఉండాలి. నేడు, కృత్రిమ మేధ (ఏఐ) తో, ఈ పని మీకు చాలా సులభమైంది.
మిత్రులారా,
నేను మీకు చాలా సూచనలు ఇచ్చాను. మీ వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో ఖాళీ స్థలం చాలా పరిమితం అని నాకు తెలుసు. కానీ ఈ రోజుల్లో, ప్రతి వార్తాపత్రిక, ప్రచురణలో స్థల పరిమితులు లేదా పంపిణీ సమస్యలు లేని డిజిటల్ ఎడిషన్లు ఉన్నాయి. మీరు ఈ సూచనలను పరిగణలోకి తీసుకుంటారని, కొత్త ప్రయోగాలు చేస్తారని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారని నాకు నమ్మకం ఉంది. యుఎన్ భాషల్లో రెండు పేజీల చిన్న ఎడిషన్‌ను కూడా ప్రపంచంలోని పెద్ద సంఖ్యలో రాయబార కార్యాలయాలతో సహా చాల మంది చూస్తారని, చదువుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ డిజిటల్ ఎడిషన్లు భారత్ సందేశాన్ని తెలియజేయడానికి గొప్ప మూలం కాగలవు. మీ పని ఎంత బలంగా ఉంటే దేశం అంత పురోగమిస్తుంది.
***
(Release ID: 2050530)
Visitor Counter : 56
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam