పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, మలేషియా మధ్య అవగాహన ఒప్పందం
2022లో భారత్‌ను సందర్శించిన 2.5 లక్షల మలేషియా పర్యాటకులు
Posted On:
30 AUG 2024 2:44PM by PIB Hyderabad
భారత్, మలేషియాలు చాలా దగ్గరి రాజకీయ, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, పర్యాటక రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించేందుకు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ.. మలేషియా ప్రభుత్వ పర్యాటక, కళలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
భారత పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్.. మలేషియా పర్యాటక, కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వై బి డాటో, శ్రీ టియోంగ్ కింగ్ సింగ్ 2024 ఆగస్టు 20న ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యాలు:
అ. పర్యాటక ఉత్పత్తులు, సేవల ప్రోత్సాహం, మార్కెటింగ్
ఆ. ఎక్సేంజ్ కార్యక్రమాలతో సహా పర్యాటక పరిశోధన, శిక్షణ, అభివృద్ధి రంగాలకు సహకారాన్ని విస్తరించటం
ఇ. పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, ఉత్పత్తులు, సేవలలో పెట్టుబడులను ప్రోత్సహించడం
ఈ. వైద్యారోగ్య పర్యాటక రంగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు వాటాదారులను ప్రోత్సహించడం
ఉ. వ్యాపార పర్యాటకం: ఇందులో సమావేశాలు, ప్రోత్సహకాలు, సదస్సులు, ప్రదర్శనలు (ఎంఐసీఈ) ఉంటాయి.
ఊ. పర్యాటక భాగస్వాములు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం
ఎ. సామాజిక, పర్యావరణ, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం
భారత్‌కు పర్యాటకులు వచ్చే దేశాల్లో మలేషియా ముఖ్యమైనది. 2022లో 2.5 లక్షల మంది మలేషియా పర్యాటకులు ఇక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించారు. మలేషియా నుంచి వచ్చే వారిని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుందని అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 2050357)
Visitor Counter : 49