ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆగస్టు 31న మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలలో అనుసంధానాన్ని పెంచనున్నాయి


కొత్త వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచ శ్రేణి అనుభూతిని పంచుతాయి; ప్రయాణ కాలాన్ని తగ్గించడంతో పాటు పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి

Posted On: 30 AUG 2024 2:59PM by PIB Hyderabad

వందే భారత్ రైళ్లు మూడింటికి ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టి కోణాన్ని సాకారం చేస్తూ వస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు... మీరట్ లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై –నాగర్ కోయిల్  మధ్య ప్రయాణిస్తాయి. 

మీరట్ సిటీ  లక్నో వందే భారత్ ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోల్చి చూస్తే దాదాపు ప్రయాణికులకు ఒక గంట సమయం ఆదా అవుతుంది. చెన్నై ఎగ్మూర్  - నాగర్ కోయిల్ వందే భారత్ రైలు తన ప్రయాణ కాలంలో 2 గంటలకు పైగా సమయాన్ని ఆదా చేస్తే, మదురై – బెంగళూరు వందే భారత్ రైలు తన ప్రయాణకాలంలో సుమారు గంటన్నర సమయాన్ని ఆదా చేస్తుంది.

ఈ కొత్త వందే భారత్ రైళ్లు ఆయా ప్రాంతాల ప్రజలకు వేగం పరంగాను, సౌకర్యం పరంగాను ప్రపంచ శ్రేణి ప్రయాణ అనుభూతిని అందిస్తాయి. ఈ రైళ్లు ఉత్తర ప్రదేశ్, తమిళ నాడు, కర్నాటక రాష్ట్రాల అవసరాలను నెరవేర్చుతాయి.  ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వల్ల నిత్యం ప్రయాణాలు చేసే వారికీ, వృత్తి నిపుణులకూ, వ్యాపార వర్గాలకూ, విద్యార్థి వర్గాలకూ ప్రమాణాలతో కూడిన సరికొత్త రైల్వే సేవలు లభిస్తాయి. 

 

***


(Release ID: 2050351) Visitor Counter : 52