కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ క్రీడాదినోత్సవ’ నిర్వహణ
Posted On:
30 AUG 2024 10:27AM by PIB Hyderabad
జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం తపాలా విభాగం ఉత్సాహంతోను, ఐకమత్యంతో ను నిర్వహించింది. దీనిలో భాగంగా దేశమంతటా తపాలా సర్కిళ్లలో క్రీడా సంబంధిత అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ‘తాడు లాగుడు’, పుషప్స్ వంటి ఆటలు, వాలీబాల్, క్యారమ్స్, చదరంగం వంటి పలు ఇండోర్ గేమ్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లు సఖ్యత, జట్టుస్ఫూర్తి, కలుపుగోలుతనం మొదలైన భావనలను పెంపొందింపచేయడానికి ఉద్దేశించినవి. దేహ దారుఢ్యంతోపాటు బలమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి క్రీడలు అద్దం పడతాయి. నిబద్ధతతో తపాలా విభాగం ఈ క్రీడోత్సవాన్ని నిర్వహించింది.
‘ఫిట్ ఇండియా మూవ్ మెంట్’తో అడుగులో అడుగేసి కదులుతూ, దేశవ్యాప్త తపాలా ఉద్యోగులు ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ ను స్వీకరించారు. ఆ ప్రతిజ్ఞలో ఆరోగ్య సంరక్షణ, శారీరక వ్యాయామం పట్ల అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. తపాలా విభాగం తన సిబ్బందిలో చక్కని జీవనశైలిని ఉత్సాహ పరచడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఒక భాగంగా ఈ కార్యక్రమం ఉంది.
క్రీడలకు మద్దతివ్వడం తపాలా విభాగం చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయంగా ఉంది. ఈ విభాగం తన ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ ఆటల పోటీల్లో పాలుపంచుకోవడాన్ని సమర్థిస్తూ వస్తోంది.
తపాలా విభాగం- తన సిబ్బందిలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించడమే కాకుండా, తపాలా బిళ్లలను విడుదల చేయడం ద్వారా మన దేశ క్రీడా వారసత్వాన్ని ఒక పండుగలాగా జరుపుకోవడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఒలింపిక్ క్రీడలు, కామన్ వెల్త్ గేమ్స్, క్రీడారంగ ప్రముఖులపైనా స్మారక తపాలా బిళ్లలను తపాలా విభాగం జారీ చేసింది. ఇది దేశ క్రీడాకారిణులు/క్రీడాకారులకు మరింత ప్రేరణదాయకంగా ఉంది.
ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం విజయవంతం కావడంలో పాలుపంచుకొన్న వారితో పాటు, జాతీయ క్రీడా దినోత్సవానికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి తపాలా విభాగం ప్రశంసలను తెలియజేస్తోంది.
***
(Release ID: 2050349)
Visitor Counter : 46