యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ కు పుష్పాంజలి ఘటించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కాలుష్యానికి సైక్లింగ్ ఉత్తమ పరిష్కారం: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి

టగ్ ఆఫ్ వార్, ఫుట్ బాల్ మ్యాచుల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, రక్షా ఖడ్సే

Posted On: 29 AUG 2024 1:36PM by PIB Hyderabad

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి కేంద్ర మంత్రులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ; కేంద్ర యువజన వ్యవహారాలు,  క్రీడాశాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. మూర్తీభవించిన క్రీడా స్ఫూర్తి ధ్యాన్ చంద్. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు ఆయన వారసత్వం ప్రేరణనిస్తూనే ఉంది.

అనంతరం డాక్టర్ మాండవీయ, శ్రీమతి ఖడ్సేలు- జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి వెళ్లి దారుఢ్యం, క్రీడల అవసరంపై సందేశం అందించారు. ఉత్సాహంగా సాగిన సభలో డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పౌరులంతా కనీసం గంట సమయాన్ని ఇంటి బయట క్రీడలకు కేటాయించాలని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుందని, ఇది శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే విస్తృత కార్యక్రమమని అన్నారు.

‘‘2047లో మన వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునేలోపు మన దేశాన్ని ‘వికసిత భారత్’గా మార్చుకోవాలి’’ అని డాక్టర్ మాండవీయ అన్నారు. ‘జో ఖేలేంగే, వో ఖేలేంగే’ అనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, మనమంతా క్రీడలను క్రియాశీలకంగా ఆదరించాలి. ప్రపంచవ్యాప్తంగా యువ దేశాలలో ఒకటిగా, క్రీడల ద్వారా శారీరక, మానసిక శ్రేయస్సును సాధించడం మన పురోగతికి కీలకం’’ అని ఆయన చెప్పారు.

శారీరక శ్రమ ద్వారా పర్యావరణ ప్రయోజనాలను ప్రత్యేకంగా పేర్కొన్న డాక్టర్ మాండవీయ సైకిల్ తొక్కడాన్ని సుస్థిర వ్యాయామంగా చెప్పారు. ‘‘సైకిల్ తొక్కడం ఉత్తమ వ్యాయామం మాత్రమే కాదు, తక్కువ దూరాల కోసం పర్యావరణ హిత రవాణా సాధనం. భూతాపం, వాతావరణ మార్పుల సవాళ్ల నేపథ్యంలో ఇదొక శక్తిమంతమైన సాధనం. ఆరోగ్య, పర్యావరణ కారణాల వల్ల సైక్లింగ్ ను పౌరులు అలవరచుకోవాలి. కాలుష్యానికి సైక్లింగ్ ఉత్తమ పరిష్కారం’’ అని వ్యాఖ్యానించారు.

భారత క్రీడాసంస్థ (ఎస్ఏఐ) అధికారులతో కలిసి మంత్రులు ఉత్సాహంగా టగ్ ఆఫ్ వార్, స్నేహపూర్వక ఫుట్ బాల్ ఆడారు. వారి భాగస్వామ్యం ఈ దినోత్సవ ఇతివృత్తం ‘క్రియాశీల భాగస్వామ్యం, క్రీడాస్ఫూర్తి’ని స్పష్టం చేస్తోంది.

***



(Release ID: 2049968) Visitor Counter : 10