ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్షుడు బిడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషణ


భారత్-అమెరికా భాగస్వామ్యంపై బిడెన్ నిబద్ధతను ప్రశంసించిన ప్రధానమంత్రి;

రెండు దేశాల ప్రజలతోపాటు యావత్ మానవాళి ప్రయోజనమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని అధినేతల ఉద్ఘాటన;

ఉక్రెయిన్‌లో స్థితిగతులు సహా వివిధ ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై చర్చించిన దేశాధినేతలు;

ఇటీవలి తన ఉక్రెయిన్ పర్యటన గురించి ప్రెసిడెంట్ బిడెన్‌కు వివరించిన ప్రధానమంత్రి;

ఆ దేశంలో శాంతి.. సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ పూర్తి మద్దతిస్తుందని ప్రధాని పునరుద్ఘాటన;

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణ.. మైనారిటీలకు- ముఖ్యంగా హిందువుల భద్రతకు ప్రాధాన్యం;

క్వాడ్‌ సహా బహుపాక్షిక వేదికలపై సహకార విస్తరణకు నిబద్ధతను పునరుద్ఘాటించిన దేశాధినేతలు

Posted On: 26 AUG 2024 10:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఇవాళ అమెరికా అధ్య‌క్షుడు గౌరవనీయ జోసెఫ్ ఆర్.బిడెన్ ఫోన్ ద్వారా సంభాషించారు.

ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, ప్రజల మధ్య బలమైన సంబంధాలు వంటి ఉమ్మడి విలువలు ప్రాతిపదికగా భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నదని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై  అధ్యక్షుడు బిడెన్ చూపుతున్న అంకితభావాన్ని ప్రధాని ప్రశంసించారు.

ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయ పురోగతిని నాయకులిద్దరూ సమీక్షించారు. ఉభయ పక్షాల ప్రజలతోపాటు మానవాళి మొత్తానికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో రెండు దేశాల భాగస్వామ్యం ముందుకు సాగుతున్నదని వారిద్దరూ నొక్కిచెప్పారు.

ఈ సంభాషణలో భాగంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను వివరణాత్మకంగా పంచుకున్నారు.

 

ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చ సందర్భంగా ఆ దేశంలో ఇటీవలి తన పర్యటన గురించి అధ్యక్షుడు బిడెన్‌కు ప్రధాని మోదీ వివరించారు. దౌత్య, సంప్రదింపుల మార్గంలో ఈ సమస్యకు పరిష్కారం అన్వేషించాలన్న భారత్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. ఆ దేశంలో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతల పునరుద్ధరణ కృషికి భారత్ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

బంగ్లాదేశ్‌లో స్థితిగతులపైనా దేశాధినేతలిద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతిభద్రతల పునరుద్ధరణ, మైనారిటీల... ముఖ్యంగా హిందువులకు రక్షణ, భద్రత కల్పించడంపై తమ నిబద్ధతను ప్రకటించారు.

క్వాడ్‌ సహా బహుపాక్షిక వేదికలపై సహకార విస్తరణకు వారిద్దరూ తమ కట్టుబాటును పునరుద్ఘాటించారు. భవిష్యత్తులోనూ తరచూ సంప్రదింపులు కొనసాగించడంపై వారు అంగీకారానికి వచ్చారు.

 

****



(Release ID: 2048977) Visitor Counter : 28