మంత్రిమండలి
azadi ka amrit mahotsav g20-india-2023

శాస్త్ర, సాంకేతిక విభాగం సూచించిన ‘విజ్ఞాన్ ధార’ పథకానికి మంత్రివర్గం ఆమోదం

Posted On: 24 AUG 2024 7:27PM by PIB Hyderabad

శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విభాగం (డిఎస్టీ) సూచించిన మూడు పథకాలను ‘విజ్ఞాన్ ధార’ పేరుతో ఒకే పథకంగా కలిపి కొనసాగించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజున జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.

అవి ఏవంటే:

  i.        సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్&టి) సంస్థాగత, మానవ సామర్థ్యాల పెంపుదల;

ii.        పరిశోధన, అభివృద్ధి.

 iii.        నవకల్పన, సాంకేతికత అభివృద్ధి, కార్యాచరణలోకి తేవడం.

 

ఈ విలీనీకరించిన ‘విజ్ఞాన్ ధార’ పథకం అమలుకు పదిహేనో ఆర్థిక సంఘం కాలం అంటే 2021-22 నుంచి 2025-26 మధ్య ప్రతిపాదిత ఖర్చు రూ.10,579.84 కోట్లు.  

 

ఈ పథకాలను ఒకే పథకంలో కలపడం నిధుల ఉపయోగంలో నిపుణత వృద్ధి చెందడానికి, సబ్ స్కీములు/ కార్యక్రమాలను ఏకకాలంలో అమలుపరచడానికి అవకాశాన్ని అందిస్తుంది.  

 

 దేశంలో సాంకేతిక విజ్ఞానాన్ని, ఇంకా నవకల్పనల సంబంధి వ్యవస్థ ను బలపరచే దిశలో సైన్స్ & టెక్నాలజీ తాలూకు సామర్ధ్య నిర్మాణంతో పాటు పరిశోధన, నవకల్పన మరియు సాంకేతికత వికాసాలను వినియోగించడం ‘విజ్ఞాన్ ధార’ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం అమలు లో భాగంగా విద్యాసంస్థలలో అన్ని సదుపాయాలతో కూడిన పరిశోధన-అభివృద్ధి (ఆర్&డి) ప్రయోగశాలలను మరిన్నింటిని ఏర్పాటు చేసి, దేశంలో విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం సంబంధ మౌలిక సదుపాయాలకు బలాన్ని చేకూర్చుతారు.

 

అంతర్జాతీయ మహా సదుపాయాల లభ్యత తో మౌలిక పరిశోధనలను ప్రోత్సహించడం, శక్తి, జలం వంటి రంగాలలో సాధించిన ఫలితాలను మానవజాతికి ప్రయోజనకారిగా ఉండేటట్లు మలచడం (ట్రాన్స్ లేషనల్ రిసర్చ్), అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారం ద్వారా సమన్వయభరిత పరిశోధనలకు ఈ పథకం పాటుపడుతుంది. విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం (ఎస్& టి) రంగాన్ని బలపరచడానికి, పూర్తి కాల పరిశోధకుల అండతో దేశంలో పరిశోధన-అభివృద్ధి (ఆర్&డి) పునాదిని విస్తరించడానికి కూడా ఈ పథకం తన వంతుగా తోడ్పాటును అందిస్తుంది. విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం (ఎస్& టి) రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఏకోన్ముఖ ప్రయాసలను చేపట్టడం జరుగుతుంది. అంతిమంగా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ (ఎస్ టిఐ) రంగంలో పురుషులకు, మహిళలకు మధ్య సమానతకు తావు ఇవ్వాలన్నదే లక్ష్యం.  బడి స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత విద్య స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ నవకల్పనలను ప్రోత్సహించే దిశలోను, పరిశ్రమలలో, అంకుర సంస్థల (స్టార్ట్ అప్స్) లో నవకల్పనలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఈ పథకం దృఢపరుస్తుంది. విద్యాసంస్థలకు, ప్రభుత్వానికి మరియు పరిశ్రమలకు మధ్య సైతం సహకారాన్ని పెంచడానికి సార్థక సమర్ధనను అందించడం జరుగుతుంది.

 

‘విజ్ఞాన్ ధార’ పథకంలో భాగంగా అమలు చేయతలపెట్టిన కార్యక్రమాలన్నింటిని విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం (డిఎస్ టి) యొక్క అయిదు సంవత్సరాల లక్ష్యాలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ కృషి అంతాను 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’)ను ఆవిష్కరించాలన్న దార్శనికత ను సాకారం చేసేందుకే. ఈ పథకంలోని పరిశోధన- అభివృద్ధి అంతర్భాగాన్ని అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్ (ఎఎన్ఆర్ఎఫ్) లక్ష్యాలకు తగినట్లు తీర్చిదిద్దుతారు. ఈ పథకం అమలు జాతీయ ప్రాధాన్యాలతో పాటు గా ప్రపంచం అంతటా అమలులో ఉన్న కొలమానాలను కూడా అనుసరించి సాగుతుంది.

 

నేపథ్యం:

దేశంలో విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం (ఎస్& టి) సంబంధి కార్యకలాపాలను నిర్వహించడం, సమన్వయపరచడం, ప్రోత్సహించడం కోసం ఒక నోడల్ డిపార్ట్ మెంట్ గా విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన విభాగం (డిఎస్ టి) పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు, పథకాలకు ఒకే స్కీము లో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించిందే ‘అంబ్రెలా స్కీం’. దేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ (ఎస్ టిఐ) ని ప్రోత్సహించడానికి మూడు కేంద్రీయ రంగ అంబ్రెలా స్కీములను డిఎస్ టి అమలుపరుస్తోంది. ఆ మూడు స్కీముల పేర్లు.. 1. సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థాగత మరియు మానవ సామర్ధ్యాల నిర్మాణం, (Science and Technology (S&T) Institutional and Human Capacity Building) 2. పరిశోధన, ఇంకా అభివృద్ధి, (Research and Development) 3. నవకల్పన, సాంకేతిక వికాసం మరియు మోహరింపు (Innovation, Technology Development and Deployment). ఈ మూడు పథకాలను ‘విజ్ఞాన్ ధార’అనే ఒకే పథకంలో కలిపేశారు.

 

***



(Release ID: 2048830) Visitor Counter : 106