రక్షణ మంత్రిత్వ శాఖ
నాలుగు రోజుల అమెరికా పర్యటన కోసం వాషింగ్టన్ చేరుకున్న రక్షణ మంత్రి
భారత్ - అమెరికా కలిసి ప్రపంచ శాంతి శ్రేయస్సులను నిర్ధారిస్తాయి: ప్రవాస భారతీయులతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్
"బలమైన, రక్షణాత్మక, సుసంపన్నమైన భారత్‌ను నిర్మించాలని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోంది"
సహాయ అధికారుల నియామకం, సరఫరాల భరోసాపై భారత్- అమెరికా సంతకాలు
Posted On:
23 AUG 2024 2:08PM by PIB Hyderabad
భారత్, అమెరికా దేశాలు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం, సుస్థిరతను నెలకొల్పగల బలీయమైన శక్తి గల దేశాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్ట్ 22న వాషింగ్టన్ చేరుకున్న మంత్రి ప్రవాస భారతీయులతో మాట్లాడారు. భారత్, అమెరికాలు సహజ మిత్రదేశాలనీ, ఇరు దేశాలు బలమైన భాగస్వాములుగా ఉంటాయనీ, దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతూ వస్తోందని రక్షణ మంత్రి వెల్లడించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో ప్రపంచ వేదికపై భారత దేశ ఖ్యాతి పెరిగిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. గతంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై చెప్పిన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. కానీ నేడు ప్రపంచం మొత్తం శ్రద్ధగా వింటోందని మంత్రి ఆయన అన్నారు.
2014కు ముందు పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ రూపొందించిన 'బలహీనమైన ఐదు' దేశాల్లో భారత్ ఒకటని, నేడు ప్రపంచంలోని 'ధృడమైన ఐదు' ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని రక్షణ మంత్రి గుర్తు చేశారు. 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సంస్థ తాజా నివేదికను ఆయన ఉదహరించారు. కోవిడ్-19 మహమ్మారిపై ప్రభుత్వ ప్రతిస్పందన ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం విజయవంతంగా 25 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ ఎగువకు తీసుకువచ్చిందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. తాజా గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.54 శాతానికి పడిపోయిందని, విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 675 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.
రక్షణ రంగంలో 'ఆత్మనిర్భరత' సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, 5,000 అంశాలతో కూడిన నిశ్చిత స్వదేశీకరణ జాబితాల నోటిఫికేషన్ ను రక్షణ మంత్రి వివరించారు. అత్యాధునిక రక్షణ సామగ్రిని దేశీయ సంస్థలు భారత గడ్డపై తయారు చేసేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.600 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు గణనీయంగా రూ.21,000 కోట్లకు పైగా పెరిగాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యల వల్ల దేశంలో అంకుర సంస్థల సంఖ్య 2014లో 400 నుంచి ప్రస్తుతం 1.20 లక్షలకు పెరిగిందన్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలతో పాటు సంకల్పబలమే ఈ విజయాలకు కారణమని ఆయన కొనియాడారు. భారతదేశాన్ని బలమైన, భద్రమైన, సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
'వసుధైక కుటుంబం' (ప్రపంచమే ఒకే కుటుంబం) స్ఫూర్తికి అనుగుణంగా అమెరికాలోని భారతీయ సమాజం నిజాయితీగా, అంకితభావంతో పనిచేయాలని రక్షణ మంత్రి వారికి సూచించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఇరు దేశాలకు చెందిన రక్షణ శాఖ ఉన్నతాధికారులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో రెండు ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశారు. మొదటిది సరఫరాలకు చెందిన భరోసా(సెక్యురిటీ ఆఫ్ సప్లైస్). రెండోది సహాయ అధికారుల నియామకానికి సంబంధించిన అవగాహన ఒప్పందం.
రక్షణ మంత్రి అమెరికా పర్యటనలో భాగంగా, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల అధ్యక్షుడి అమెరికా సహాయకుడు జేక్ సల్లివాన్‌ను కూడా ఆయన కలుస్తారు. ప్రస్తుత, భవిష్యత్తు రక్షణ సహకారంపై అమెరికా రక్షణ పరిశ్రమతో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2048545)
Visitor Counter : 43