మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాలల్లో పిల్లల రక్షణ, భద్రతా మార్గదర్శకాలను అమలు చేయండి: కేంద్ర విద్యా శాఖ
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల భద్రతా మార్గదర్శకాలు – 2021 అమలు స్థితిగతులపై సమాచారమివ్వాలని సూచన
Posted On:
23 AUG 2024 1:56PM by PIB Hyderabad
పాఠశాలలు, విద్యాసంస్థల్లో పిల్లలకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం, విద్యా శాఖ కట్టుబడి ఉన్నాయి. 2017లో దాఖలైన రిట్ పిటిషన్(క్రిమినల్)నెం. 136, రిట్ పిటిషన్(సివిల్) నెం. 874 లపై గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు కల్పించే భద్రతను బలోపేతం చేసేలా, పాఠశాలల జవాబుదారీతనాన్ని పెంచేలా ‘‘పాఠశాల భద్రత- మార్గదర్శకాలు-2021’’కు రూపకల్పన చేశారు. పోక్సో మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని పాఠశాల విద్య, అక్ష్యరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల భద్రత విషయంలో యాజమాన్యాల బాధ్యతను ఇవి నిర్దేశిస్తాయి. అలాగే ప్రివెంటివ్ ఎడ్యుకేషన్, జవాబుదారీతనం, సమాచారం అందించే విధానం, న్యాయ నిబంధనలు, కౌన్సెలింగ్, సహకారం, సురక్షితమైన వాతావరణం తదితర అంశాలపై విధివిధానాలు తెలియజేస్తాయి. సులభంగా, సంఘటితంగా, సానుకూల ఫలితాలను సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
పాఠశాల విద్య, అక్ష్యరాస్యత విభాగం, భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు అక్టోబర్ 1, 2021 న అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/అనుబంధ సంస్థలకు ఈ మార్గదర్శకాలు జారీ చేశాయి. పాఠశాలల్లో చిన్నారుల భద్రత, దాన్ని నిర్ధారించడంలో వివిధ విభాగాలకు చెందినవారి బాధ్యతలను ఈ మార్గదర్శకాలు తెలియజేస్తాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైతే తమకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అయితే వాటిని తమకు తెలియజేయాలని సూచించాయి. ఈ మార్గదర్శకాలు పాఠశాల విద్య, అక్ష్యరాస్యత విభాగం వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
https://dsel.education.gov.in/sites/default/files/2021-10/guidelines_sss.pdf
ఈ మార్గదర్శకాల ఉద్దేశం:
· చిన్నారుల సమగ్రాభివృద్ధి కోసం సురక్షితమైన పాఠశాల వాతావరణాన్ని అందించాల్సిన అవసరంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో సహా ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించడం.
· భౌతిక, సామాజిక, భావోద్వేగ, ప్రకృతి వైపరీత్యాలతో సహా ఇతర భద్రతా అంశాలకు సంబంధించి ఇప్పటికే అందుబాటులో ఉన్న చర్యలు, విధానాలు, పద్ధతులు, నిర్దేశకాలపై అవగాహన కల్పించడం.
· మార్గదర్శకాలను అవలంబించే విధానంపై స్పష్టతనిచ్చి వారు పోషించాల్సిన పాత్రపై అవగాహన పెంచడం
· ప్రవేటు/అన్ఎయిడెడ్ పాఠశాలల్లో, పాఠశాల ఏర్పాటు చేసిన రవాణా సదుపాయాల్లో చిన్నారులను సురక్షితంగా ఉంచే బాధ్యత యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. ప్రభుత్వ/ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు/ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యా సిబ్బందిపై విద్యార్థుల రక్షణ బాధ్యత ఉంటుంది.
· పాఠశాలల్లో పిల్లల భద్రత విషయంలలో వ్యక్తి లేదా యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఉపేక్షించకుండా ‘జీరో టాలరెన్స్ పాలసీని’ అమలు చేయడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.
***
(Release ID: 2048391)
Visitor Counter : 157