కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏడాది కాలంలో అదనంగా 7.3 కోట్ల మంది ఇంటర్నెట్, 7.7 కోట్ల మంది బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు


2023-2024లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసిన భారత టెలికాం రంగం

119.9 కోట్లకు చేరిన టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య


బ్రాడ్ బ్యాండ్ సేవల్లో వృద్ధి రేటు 9.15 శాతం

Posted On: 20 AUG 2024 2:00PM by PIB Hyderabad

2023-2024 ఆర్థిక సంవత్సరంలో భారత టెలికాం రంగం విశేషమైన వృద్ధిని సాధించినట్లు భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది.

వివిధ సేవల్లో గణనీయమైన వృద్ధిని  కనపరచడంతోపాటు కీలక ప్రమాణాలను ఈ నివేదిక ప్రముఖంగా పేర్కొన్నది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించారు. భారతదేశంలో మొత్తం టెలి సాంద్రత 2023 మార్చి చివరి నాటికి 84.51శాతం ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి 85.69 శాతానికి చేరుకుని 1.39% వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.

నివేదికలో కీలక అంశాలు:

  1. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల పెరుగుదల: మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 88.1 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 95.4 కోట్లకు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు 8.30  శాతంగా నమోదైంది. ఏడాది కాలంలో కొత్తగా 7.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా మారారు.
  2. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల ఆధిక్యం: బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో వృద్ధి కొనసాగుతోంది. ఈ వినియోగదారుల సంఖ్య 2023 మార్చిలో 84.6 కోట్లుగా ఉండగా, 2024 మార్చి నాటికి 92.4 కోట్లకు పెరిగింది. అదనంగా 7.8 కోట్ల మంది బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులతో 9.15 శాతం వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అనుసంధాన ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
  3. విశేషంగా పెరిగిన డేటా వినియోగం: వైర్ లెస్ డేటా వినియోగదారుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 84.6 కోట్లుగా ఉండగా, అది 2024 మార్చి చివరి నాటికి 91.3 కోట్లకు పెరిగి 7.93 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. మొత్తం వైర్ లెస్ డేటా వినియోగం పరిమాణం 2022-23లో 1,60,054 పీబీ ఉండగా, అది 2023-24 లో 1,94,774 పీబీకి పెరిగింది.
  4. టెలి సాంద్రతలో పెరుగుదల: భారతదేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 117.2 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 119.9 కోట్లకు పెరిగింది. వార్షిక వృద్ధి రేటు 2.30%గా నమోదైంది. దేశంలో మొత్తం టెలి-సాంద్రత 2023 మార్చి చివరి నాటికి 84.51శాతం నుంచి 2024 మార్చి చివరి నాటికి 85.69 శాతానికి పెరిగి వార్షిక వృద్ధి రేటు 1.39 శాతంగా నమోదైంది.
  5. ఒక్కో వినియోగదారు సగటు వినియోగం 2022-23లో నెలకు 919 నిమిషాలుండగా, 2023-24లో అది 963కు చేరింది. వార్షిక వృద్ధి రేటు 4.73 శాతంగా నమోదైంది.
  6. సర్దుబాట్ల అనంతరం స్థూల ఆదాయం కూడా 2022-23లో రూ.2,49,908 కోట్ల నుంచి 2023-24లో రూ.2,70,504 కోట్లకు పెరిగింది. ఇందులో వార్షిక వృద్ధిరేటు 8.24 శాతంగా ఉంది.

 

***


(Release ID: 2047109) Visitor Counter : 67