ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీలు) సమీక్షా సమావేశం
వ్యాపార పనితీరు, డిజిటల్ టెక్నాలజీ సేవలను అప్‌గ్రేడ్ చేయడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో వ్యాపార వృద్ధిని పెంపొందించడంపై చర్చలో పాల్గొన్న 43 ఆర్ఆర్బీలు
చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రుణాలు అందించేందుకు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో ఆర్ఆర్బీ శాఖలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించిన కేంద్ర ఆర్థికమంత్రి
క్లస్టర్ కార్యకలాపాలకు అనుగుణంగా తగిన ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ఆర్ఆర్బీలు రూపొందించాలి: ఆర్థిక మంత్రి
బ్యాంకింగ్ వ్యాప్తిని పెంచడానికి వ్యక్తిగత, స్థానిక అనుసంధానాన్ని ఉపయోగించుకోవాలి: నిర్మలా సీతారామన్
Posted On:
19 AUG 2024 6:29PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీల) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) నియమిత కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు, ఆర్బీఐ, సీడ్బీ, నాబార్డు ప్రతినిధులు, ఆర్‌ఆర్‌బీల చైర్మన్లు, ప్రాయోజిత బ్యాంకుల సీఈఓలు పాల్గొన్నారు.
ప్రస్తుతమున్న 43 ఆర్ఆర్బీలతో జరిగిన ఈ సమావేశంలో వ్యాపార పనితీరు, డిజిటల్ టెక్నాలజీ సేవలను అప్‌గ్రేడ్ చేయడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో వ్యాపార వృద్ధిని పెంపొందించడంపై దృష్టి సారించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో ఆర్ఆర్బీల కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి వివిధ పథకాల కింద రుణాలను మంజూరు చేసేటప్పుడు లబ్ధిదారులను స్పష్టంగా గుర్తించడంపై ఆర్‌ఆర్‌బీలు ఎక్కువగా దృష్టి పెట్టాలని, స్పాన్సర్ బ్యాంకులు క్రీయాశీల సహాయం అందించాలని కేంద్ర మంత్రి కోరారు. క్షేత్రస్థాయి వ్యవసాయ రుణాల పంపిణీలో వాటాను పెంచాలని ఆదేశించారు.
2022 నుంచి క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆర్థిక పనితీరు, ఆధునిక సాంకేతికత విషయంలో ఆర్‌ఆర్‌బీలను ఆమె ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా అదే వేగాన్ని కొనసాగించాలని గ్రామీణ బ్యాంకులను కోరారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్బీలు అత్యధికంగా రూ.7,571 కోట్ల ఏకీకృత(కన్సాలిడేటెడ్) నికర లాభాన్ని నమోదు చేశాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 10 సంవత్సరాల అత్యల్పానికి చేరుకొని 6.1 శాతంగా నమోదైంది.
ఈ ఆధునిక యుగానికి అనుగుణంగా అన్ని ఆర్‌ఆర్బీలు ఉండేందుకు సొంతంగా సాంకేతికతను కలిగి ఉండాలని నొక్కిచెప్పారు. మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అనుసంధానం కష్టతరమయ్యే ప్రాంతాలకు(ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు) ఒక వరం అని పేర్కొన్నారు. సాంకేతిక సహాయాన్ని అందించడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, విజయవంతం కావడానికి అవసరమైన వనరులను ఆర్‌ఆర్బీలకు అందించటం ద్వారా ప్రాయోజిత బ్యాంకులు గణనీయమైన పాత్ర పోషిస్తాయన్నారు.
టెక్స్‌టైల్స్, హస్తకళలు, కలప ఫర్నిచర్, మట్టి కుండలు, జనపనారతో కూడిన హస్తకళలు, తోలు, ఆహార ప్రాసెసింగ్, పాడిపరిశ్రమ, ప్యాకింగ్ మెటీరియల్స్ వంటి రంగాలలో చిన్న, సూక్ష్మ తరహా సంస్థలకు రుణాలు అందించడానికి ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఉన్న ఆర్‌ఆర్బీ శాఖలు చురుకుగా పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. ఆర్‌ఆర్బీల రుణ ఖాతాను పెంచటంలో వీటికి భారీ సామర్థ్యం ఉందని అన్నారు.
అన్ని ఆర్‌ఆర్‌బీలు తమ క్లస్టర్ కార్యకలాపాలకు అనుగుణంగా తగిన ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను రూపొందించాలని, బ్యాంకింగ్ వ్యాప్తిని పెంచడానికి వ్యక్తిగత, స్థానిక అనుసంధానాన్ని పెంపొందించుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కో-లెండింగ్/ రిస్క్ షేరింగ్ మోడళ్లు, ఎంఎస్ఎంఈ పోర్ట్‌ఫోలియో రీఫైనాన్స్‌ను విస్తరించడంలో ఆర్ఆర్బీలకు సహాయం చేయాలని సిడ్బీని ఆదేశించారు.
ముందున్న సవాళ్లను గుర్తించాలని, ఆస్తుల నాణ్యతను కొనసాగించాలని, డిజిటల్ సేవలను విస్తరించాలని, పటిష్టమైన కార్పొరేట్ పాలనపై దృష్టి పెట్టాలని ప్రాయోజిత బ్యాంకులు, ఆర్ఆర్బీలను శ్రీమతి సీతారామన్ కోరారు.
***
(Release ID: 2046879)
Visitor Counter : 101